English | Telugu

ల‌య‌న్ వెనుక ర‌హ‌స్యాలు

ల‌య‌న్ మ‌రోసారి వాయిదా ప‌డ‌డం నంద‌మూరి అభిమానుల్ని బాగా నిరుత్సాహానికి గురి చేసింది. లెజెండ్ త‌ర‌వాత నంద‌మూరి బాలకృష్ణ విశ్వ‌రూపాన్ని చూడాల‌నుకొంటున్నవాళ్లంతా.. 'ల‌య‌న్‌' వాయిదా ప‌డ‌డంతో నిరాశ‌లో కూరుకుపోయారు. మార్చి నుంచి ఈ సినిమా కోసం ఎంత‌గానో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌.. 'మా బాల‌య్య ఎప్పుడొస్తాడా' అంటూ ప‌డిగాపులు కాస్తున్నారు. అయితే ఈ సినిమా వాయిదా వెనుక చాలా ర‌హ‌స్యాలున్న‌ట్టు స‌మాచారం. 'లెజెండ్‌' ఇచ్చిన న‌మ్మ‌కంతో ఈ సినిమాపై నిర్మాత‌లు భారీగా పెట్టుబ‌డి పెట్టిన‌ట్టు తెలుస్తోంది. దాదాపుగా ఈ సినిమా కోసం రూ.35 కోట్లు ఖ‌ర్చు పెట్టార‌ట‌. ఈ సినిమాపై, బాల‌య్య క్రేజ్‌పై న‌మ్మ‌కంతో బ‌రిలోకి దిగిన రుద్ర‌పాటి ర‌మ‌ణారావు.. త‌న రైస్ మిల్లుని సైతం అమ్మేసి రంగంలోకి దిగిన‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల సమాచారం. బ‌డ్జెట్ కంట్రోల్ త‌ప్ప‌డంతో మ‌రో నిర్మాత‌ని పార్ట‌న‌ర్‌గా చేర్చుకొన్న‌ట్టు తెలిసింది. సినిమా ఇంత భారీగా తీస్తే... కొత్త ద‌ర్శ‌కుడు కావ‌డం వ‌ల్ల బ‌య్య‌ర్లు జంకుతున్నార‌ట‌. చాలా ఏరియాలో ఇంకా ఈ సినిమా అమ్ముడుపోలేదు. దాంతో సొంతంగా ఈసినిమాని విడుద‌ల చేసుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. ల‌య‌న్ అస్త‌మానూ వాయిదా ప‌డ‌డం బాల‌య్య‌కు న‌చ్చ‌క‌పోయినా.. నిర్మాత‌ల మంచి కోరి ఓపిగ్గా భ‌రిస్తున్న‌ట్టు తెలిసింది. బిజినెస్ పూర్త‌యినా, అవ్వ‌క‌పోయినా మే 14న మాత్రం సినిమాని ఎట్టిప‌రిస్థితుల్లోనూ రిలీజ్ చేయాల‌ని బాల‌య్య అల్టిమేట్టం జారీ చేశాడ‌ట‌. సో.. మే 14న ఈసినిమా రావ‌డం ఖాయం. ఈలోగా బిజినెస్ జ‌రిగిపోతే స‌రేస‌రి.. లేదంటే నిర్మాత‌లే సొంతంగా ఈసినిమాని విడుద‌ల చేసుకొంటార‌ట‌. అదీ.. ల‌య‌న్ వాయిదాల వెనుక అస‌లు ర‌హ‌స్యం.