English | Telugu

బాల‌య్య‌.. అందుంలోచి బ‌య‌ట‌కు రాడా?

డిక్టేట‌ర్‌ని అందరూ `హిట్‌` అనే డిక్లేర్ చేశారు. వ‌సూళ్లూ బాగానే వ‌స్తున్నాయి.. అయితే... ఇదంత గొప్ప‌సినిమాకాద‌ని, అస‌లు ఇందులో కొత్త‌ద‌న‌మ‌నేది శూన్య‌మ‌ని సినీ విమ‌ర్శ‌కులు తేల్చేశారు. ఫార్ములా లెక్క‌ల ప్ర‌కారం సాగిన ఈ సినిమా కేవ‌లం బాల‌య్య ఫ్యాన్స్ కోస‌మే తీసిన‌ట్టుంద‌ని పెద‌వి విరుస్తున్నారు. సంక్రాంతి సీజ‌న్ కాబ‌ట్టి.. ఏవో వ‌సూళ్లు ద‌క్కించుకొంద‌ని, మామూలుగా అయితే.. డిక్టేట‌ర్‌కి అంత సీన్ లేద‌ని.. నాన్ బాల‌య్య ఫ్యాన్స్ వాద‌న‌. అంతేకాదు.. ఈ సినిమాకి పరోక్షంగా టీడీపీ కార్య‌క‌ర్త‌ల అండ దండ‌లున్నాయ‌ని అందుకే.. డిక్టేట‌ర్ యావ‌రేజ్ గా ఉన్నా... వ‌సూళ్లు ద‌క్కాయ‌ని చెబుతున్నారు.

నిజం చెప్పాలంటే డిక్టేట‌ర్ అద్భుత‌మైన సినిమా ఏం కాదు. బాల‌య్య గ‌త సినిమాల్లో ఏం ఉందో ఈ సినిమాలోనూ అదే ఉంది. క‌థ‌, క‌థ‌నాల్లో ఎక్కడా వైవిద్యం లేదు. ఇంట్ర‌వెల్ ముందు వ‌ర‌కూ ఓ బాల‌య్య‌. మ‌ధ్య‌లో ఓ ట్విస్ట్‌, ఆ త‌ర‌వాత ఫ్లాష్ బ్యాక్‌.. బాల‌య్య సినిమాలు ఇలానే సాగుతాయి. డిక్టేట‌ర్ కూడా అంతే. కేవ‌లం `గ‌ట్టెక్కేస్తే చాలు` అనుకొని రాసుకొన్న స్ర్కిప్టులా క‌నిపించింది.

99 సినిమాలు చేసిన బాల‌య్య ఇంత సాదాసీదా సినిమా ఎలా ఎంచుకొన్నాడా అనిపిస్తుంది. బాల‌య్య ఈ ఫార్ములా నుంచి బ‌య‌ట‌కు రావాల్సిన అవ‌స‌రం ఉంది. ఈ తర‌హా సినిమాలు అప్ప‌టిక‌ప్పుడు ఓకే అనిపించి వెళ్లిపోవొచ్చు. కానీ వంద సినిమాల చ‌రిత్ర తిర‌గేస్తే మాత్రం.. డిక్టేట‌ర్ నిల‌బ‌డ‌దు. బాల‌య్య‌లో మాస్ యాంగిలే కాదు... ఇంకా ఎంతో ఉంది. వాటిని బ‌య‌ట‌కు తీసుకొచ్చే ప్ర‌య‌త్నం ద‌ర్శ‌కులు చేయాలి.. బాల‌య్యా మూస పాత్ర‌ల నుంచి బ‌య‌ట‌కు రావాలి. బ‌హుశా... వందో సినిమాగా రాబోతున్న ఆదిత్య 999 అందుకు నాంది కావొచ్చు..! స‌రికొత్త బాల‌య్య వందో సినిమాలో ఆవిష్ర్క‌తం అవ్వొచ్చు. బాల‌య్య అభిమానులే కాదు.. యావ‌త్ తెలుగు సినీ అభిమానులూ.. ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నారు.