English | Telugu
రెహమాన్ ఈసారీ మిస్సయ్యాడు...
Updated : Jan 17, 2015
నాలుగేళ్ళ క్రితం ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ సినిమా ద్వారా ఆస్కార్ అవార్డు కొట్టిన సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ మరోసారి ఆస్కార్ అవార్డ్ కొట్టాలన్న తపనతో వున్నాడు. అందుకే ఆయన ఈమధ్యకాలంలో అంతర్జాతీయ స్థాయి చిత్రాలకే సంగీతాన్ని అందించడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఫిబ్రవరి 22వ తేదీన 87వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరుగనుంది. ఈసారి పోటీలో వున్న నామినేషన్ల వివరాలను ఆస్కార్ కమిటీ ప్రకటించింది. ఆ లిస్టులో ఎ.ఆర్.రెహమాన్ పేరు లేదు. ఇది రెహమాన్‌ని చాలా నిరాశపరచినట్టు తెలుస్తోంది. నాలుగేళ్ల క్రితం ఆస్కార్ వచ్చిన తర్వాత మరో ఏడాది ఆస్కార్ వేదికపై మెరవాలన్న ఆయన కోరిక గత మూడేళ్ళుగా తీరడం లేదు. ఈ సంవత్సరం ఆయన మూడు ప్రతిష్ఠాత్మక చిత్రాలకు సంగీతాన్ని అందించాడు. ‘మిలియన్ డాలర్ ఆర్మ్’, ‘హండ్రెడ్ ఫుట్ జర్నీ’, ‘కొచ్చాడియన్’ సినిమాలకు సంగీతం అందించిన రెహమాన్ ఈ మూడు సినిమాల్లో ఏదో ఒక సినిమా తనకు ఆస్కార్ అందేలా చేస్తుందని ఆశించారు. అయితే ఆయనకు ఈ సంవత్సరం కూడా నామినేషన్ చాన్స్ కూడా మిస్సయింది. అవార్డు వచ్చే సంగతి రాని సంగతి తర్వాత... కనీసం నామినేషన్ల లిస్టులో వున్నా చాలని ఆశించిన రెహమాన్‌కి ఆ ఆశ కూడా తీరలేదు.