English | Telugu
`ఐకాన్`కి బాలీవుడ్ కంపోజర్?
Updated : Aug 10, 2021
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దాదాపు ఇరవై చిత్రాల్లో కథానాయకుడిగా నటించాడు. వీటిలో `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా`ని మినహాయిస్తే.. మిగిలిన సినిమాలన్నింటికీ దక్షిణాది స్వరకర్తలే బాణీలు అందించారు. కీరవాణి, దేవి శ్రీ ప్రసాద్, యువన్ శంకర్ రాజా, చక్రి, మణిశర్మ, థమన్, ఇళయరాజా.. ఇలా బన్నీ ఫిల్మోగ్రఫీలో దక్షిణాది సంగీత దర్శకుల వరుస క్రమం ఉంటుంది. `నా పేరు సూర్య`కి మాత్రం బాలీవుడ్ కంపోజర్స్ విశాల్ - శేఖర్ బాణీలు అందించారు.
లేటెస్ట్ బజ్ ఏంటంటే.. `పుష్ప` (దీనికి డీఎస్పీ మ్యూజిక్ డైరెక్టర్) అనంతరం అల్లు అర్జున్ నటించబోతున్న `ఐకాన్`కి కూడా బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ స్వరాలు సమకూర్చబోతున్నాడని సమాచారం. త్వరలోనే ఆ కంపోజర్ ఎవరు అన్న విషయంపై క్లారిటీ రానుంది. వాస్తవానికి.. `ఐకాన్`కి థమన్ బాణీలు అందిస్తాడని కొద్ది రోజుల క్రితం జోరుగా ప్రచారం సాగింది. అయితే, `ఐకాన్` పాన్ - ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కనుండడంతో బన్నీ - దర్శకుడు వేణు శ్రీరామ్ ఇద్దరు కూడా బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ పైనే ఫోకస్ పెడుతున్నారని బజ్. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొద్దిరోజులు వేచిచూడాల్సిందే.