English | Telugu

ఆప‌ద్భాంధ‌వులు...మెగా హీరోలు

ఆప‌ద్భాంధ‌వుడు అనే టైటిల్‌లో చిరంజీవి ఓ సినిమా చేశాడు గానీ, ఆ టైటిల్ దాదాపుగా మెగా హీరోలంద‌రికీ వ‌ర్తిస్తుంది. మొన్న‌టికి మొన్న‌... అల్లు అర్జున్‌ని అంద‌రూ ఆప‌ద్భాంధ‌వుడు అనే పిలిచారు. రుద్ర‌మ‌దేవి సినిమా క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు ఆదుకొన్నాడు క‌దండీ. అందుకు. ఆ సినిమాలో గోన‌గ‌న్నారెడ్డి పాత్ర‌కోసం పైసా పారితోషికం తీసుకోలేద‌ని ఆకాశానికి ఎత్తేశారు. ఆ మాట‌కొస్తే రామ్‌చ‌ర‌ణ్ కూడా ఆప‌ద్భాంధ‌వుడే.

ఆగ‌డు లాంటి సూపర్ డూప‌ర్ ఫ్లాప్ తీసిన ద‌ర్శ‌కుడు శ్రీ‌నువైట్ల‌కు అవ‌కాశం ఇవ్వ‌డం అంటే మాట‌లా?? శ్రీ‌నువైట్ల‌తో సినిమా చేయ‌డానికి ఎవ‌రూ ముందుకు రాక‌పోవ‌డంతో చ‌ర‌ణ్ ఇచ్చిన‌మాట కోసం... సినిమా ఒప్పుకొని ప‌ట్టాలెక్కించాడు. శ్రీనువైట్ల అనేకాదు, అందుకు ముందు గోవిందుడు అంద‌రివాడేలే సినిమాకీ.. కృష్ణ‌వంశీకి హిట్లు లేవు. పెద్ద హీరోలంతా వంశీని చూసి పారిపోతుంటే.. ధైర్యంగా నిల‌బ‌డ్డాడు. కిక్ 2 త‌ర‌వాత‌.. సురేంద‌ర్ రెడ్డి ప‌రిస్థితీ అంతే. అలా.. ఫ్లాప్ ద‌ర్శ‌కుల పాలిట ఆప‌ద్భాంధ‌వుడ‌య్యాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి గురించి చెప్ప‌క్క‌ర్లెద్దు. బ్రూస్లీ సినిమా కోసం త‌న 150వ సినిమా త్యాగం చేశాడు. బ్రూస్లీకి కిక్ తీసుకొచ్చే క్ర‌మంలో ఓ చిన్న పాత్ర పోషించేందుకు ముందుకొచ్చాడు.

లెక్క ప్ర‌కారం.. ఈ సినిమా త‌న 150వ సినిమా అయినా... చిన్న పాత్ర‌తో సంతోష‌ప‌డిపోయాడు. ఇప్పుడు బ్రూస్లీకి అన్నో కొన్నో టికెట్లు తెగుతున్నాయంటే అదంతా చిరు చ‌ల‌వే. ఆ మాట‌కొస్తే ప‌వ‌న్ క‌ల్యాణ్ అతి పెద్ద ఆప‌ద్భాంధ‌వుడు. ఆరెంజ్ సినిమాతో ఆస్తుల్ని అమ్ముకొన్న నాగ‌బాబుకి ఆర్థిక స‌హాయం చేసింది.. ప‌వ‌నే. అంతెందుకూ.. దాస‌రి నారాయ‌ణ‌రావు `సినిమా చేద్దాం` అని అడ‌గ్గానే.. మ‌రేం ఆలోచించ‌కుండా... ఓకే అనేశాడు. ఇంత‌కంటే ఆప‌ద్భాంధ‌వుడు ఎక్క‌డుంటాడు?? అలా ఈ టైటిల్‌కి ఈ న‌లుగురు మెగా హీరోలూ న్యాయం చేశారు... కాదంటారా?