English | Telugu

‘అఖిల్’ షార్ట్ ఫిల్మా?

ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అక్కినేని అఖిల్ సినిమా ‘అఖిల్’ బుధవారం నాడు దీపావళి సందర్భంగా విడుదలైంది. ఈ సినిమా ఎలా వుంది... హిట్టయిందా.. ఫ్లాపయిందా? బావుందా... బాగాలేదా? హీరో ఎలా చేశాడు... లాంచిగ్‌ బాగా జరిగిందా... వినాయక్ అదరగొట్టాడా... ఇలాంటి ప్రశ్నలన్నిటికీ కరెక్టు సమాధానాలు ఆల్రెడీ డిస్కషన్లో వున్నాయి. సినిమా విడుదలై ఒక్కరోజే అయింది కాబట్టి ఇంకా కరెక్ట్ అభిప్రాయాలు బయటకి రావడం లేదు. రెండు మూడు రోజులు ఆగితే అఖిల్ సినిమా అసలు విషయం బయటకి వచ్చేస్తుంది. ఈ సంగతి అలా వుంచితే, ‘అఖిల్’ ఇంతకీ ఫుల్ లెంగ్త్ సినిమానా... లేక కాస్తంత సైజు పెంచిన షార్ట్ ఫిలిమా అనే సందేహం ఈ సినిమా చూసిన వాళ్ళకి వస్తోందట. ఈ సినిమాలోని పాటలు, ఫైట్లు, అనవసర విషయాలన్నీ తీసేస్తే బెత్తెడు కథ మాత్రమే మిగులుతుందని అనుకుంటున్నారు. ఇంటర్వెల్ తర్వాత సినిమా టక్కుమని అయిపోయిందని చెబుతున్నారు. సినిమా లెంగ్త్ రెండు గంటలకు పైగానే వున్నప్పటికీ సినిమాలో ఇన్వాల్వ్ అయిపోయినందువల్ల తమకు సినిమా డ్యూరేషన్ తెలియలేదా... లేక సినిమా కూడా గొర్రె తోక మాదిరిగా బెత్తెడే వుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇకపై ‘అఖిల్’ సినిమాకి వెళ్ళేవారు స్టాప్ వాచ్‌లు కూడా తీసుకెళ్తే కరెక్ట్ డ్యూరేషన్ అర్థమవుతుందేమో!