English | Telugu
బాలయ్యను ఢీకొట్టనున్న సేతుపతి.. ఇది కదా మాస్ కాంబో అంటే!!
Updated : Aug 12, 2021
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. 'క్రాక్'తో రవితేజకి సూపర్ హిట్ అందించిన గోపీచంద్.. బాలకృష్ణ కోసం పవర్ ఫుల్ స్టొరీ రెడీ చేశారట. ముఖ్యంగా ఇందులో బాలయ్యను ఢీ కొట్టే విలన్ రోల్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని తెలుస్తోంది. అందుకే ఈ పాత్ర కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతిని తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది.
విభిన్న చిత్రాలు, పాత్రలతో నేషనల్ వైడ్ గా క్రేజ్ సంపాదించుకున్నారు విజయ్ సేతుపతి. సైరా నరసింహారెడ్డి, ఉప్పెన వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యారు. దీంతో టాలీవుడ్ కి చెందిన పలువురు దర్శకనిర్మాతలు సేతుపతిని తమ సినిమాలో నటింపజేయాలని ఆశపడుతున్నారు. ఈ క్రమంలో బాలయ్య-గోపీచంద్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న మాస్ ఎంటర్టైనర్ లో విలన్ రోల్ కోసం సేతుపతిని సంప్రదించారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ చేయడానికి సేతుపతి కూడా సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. ఈ వార్త నిజమైతే ఫ్యాన్స్ కి పండగనే చెప్పాలి. అసలుసిసలు మాస్ కాంబినేషన్ అంటే ఇది అంటూ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ' సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ నటిస్తుండగా.. విలన్ గా శ్రీకాంత్ నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత గోపిచంద్ మలినేని ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది.