English | Telugu
బతుకమ్మ వేడుకలకు అనుష్క?
Updated : Oct 10, 2015
త్వరలో తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ వేడుకలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ వేడుకలను జాతీయ స్థాయి వేడుకగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండోసారి జరుగుతున్న బతుకమ్మ వేడుకలివి. ఈ వేడుకలలో ఒక స్పెషల్ ఏమిటంటే, స్టార్ హీరోయిన్ అనుష్క తొమ్మిది రోజులపాటు జరిగే బతుకమ్మ వేడుకలలో పాల్గొనబోతోందట.
ఒక్క హైదరాబాద్‌లో మాత్రమే కాకుండా తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ జరిగే వేడుకలలో అనుష్క పాల్గొంటుందట. అనుష్క నటించిన ‘రుద్రమదేవి’ సినిమా శుక్రవారం నాడు విడుదలైన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రాంతానికి చెందిన యోధురాలు రుద్రమదేవి కథతో రూపొందించిన ఈ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం వినోదపు పన్ను రాయితీని కూడా ప్రకటించింది.
ఈ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా జరిగే బతుకమ్మ వేడుకలలో అనుష్కను పాల్గొనేలా చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ దర్శకుడు గుణశేఖర్‌ని కోరడం, ఈ ప్రతిపాదనకు అనుష్క అంగీకరించడం చకచకా జరిగిపోయాయట. వినోదపు పన్ను రాయితీని ప్రకటించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేయడానికి మాత్రమే కాకుండా.. ‘రుద్రమదేవి’ ప్రచారానికి కూడా అనుష్క బతుకమ్మ వేడుకలలో పాల్గొనడం కలసి వస్తుందని ‘రుద్రమదేవి’ యూనిట్ సభ్యులు భావిస్తు్న్నారు.