English | Telugu

నిజం చెప్పు గుణా..రూ.80 కోట్ల‌య్య‌యా??

రుద్ర‌మ‌దేవి బ‌డ్జెట్ గురించి ఈ సినిమా విడుద‌ల‌కు ముందు భారీ చ‌ర్చ సాగింది. అనుష్కపై గుణ‌శేఖ‌ర్ భారీ పెట్టుబ‌డి పెట్టాడ‌ని, రూ.70 కోట్ల‌తో సినిమా తీశాడ‌ని గొప్ప‌గా చెప్పుకొన్నారు. గుణ‌శేఖ‌ర్ పై కూడా జాలి చూపులు విసిరారు. ఎంత పెద్ద హిట్ అయినా రూ.70 కోట్లు తెచ్చుకోలేద‌ని లెక్క‌లు వేశారు.

గుణ‌శేఖ‌ర్ మాత్రం.. వడ్డీల‌తో క‌లుపుకొని నా సినిమా రూ.80 కోట్ల వ‌ర‌కూ అయ్యింద‌న్నాడు. తీరా సినిమా చూస్తే.. అంత సీన్ లేద‌నిపించింది. అన్నీ సీజీ వ‌ర్కులే. ఈ సీన్‌కి భారీగా ఖ‌ర్చ‌యి ఉంటుంది అనుకోద‌గిన స‌న్నివేశం ఒక్క‌టంటే ఒక్క‌టీ క‌నిపించ‌లేదు. గోన‌గ‌న్నారెడ్డిగా బ‌న్నీ పారితోషికం తీసుకోలేదు. అనుష్కకీ ఇచ్చింది త‌క్కువే. ప్ర‌కాష్ రాజ్ ఇప్ప‌టి వ‌ర‌కూ పైసా కూడా తీసుకోలేద‌ట‌. చాలామంది న‌టీన‌టులు గుణ‌శేఖ‌ర్‌పై ఉన్న గౌర‌వంతో పారితోషికం భారీగా త‌గ్గించుకొన్నార‌ని టాక్‌. అటు విజువ‌ల్ గ్రాండిటీ లేదు, ఇటు పారితోషికాలు ఇవ్వ‌లేదు. అయినా రూ.80 కోట్లు ఎలా ఖ‌ర్చు పెట్టాడంటూ అనుమానాలొస్తున్నాయి. ఈ సినిమాకి రూ.40 కోట్ల‌కు మించి అవ్వ‌ద‌ని, అదీ త్రీడీలో తీసినందున ఆ మాత్ర‌మైనా అయ్యింటుంద‌ని ఓ అనుభ‌వ‌జ్ఞుడైన నిర్మాత‌.. మీడియాకు ఉప్పు అందించాడు.

దాంతో ఇప్పుడు అస‌లు లెక్క‌లు బ‌య‌ట‌కు రాబోతున్నాయి. నిజంగానే రూ.40కోట్ల‌తో ఈ సినిమాతీస్తే.. గ‌ట్టెక్కే అవ‌కాశాలున్నాయి. గుణ‌శేఖ‌ర్ చెప్పిన‌ట్టు 70 నుంచి 80 కోట్లు అయ్యింటే.. ఇక అంతే సంగ‌తులు. స‌గానికి స‌గం పోయిన‌ట్టే. ఇప్ప‌టికైనా గుణ శేఖ‌ర్‌నిజం చెబుతాడేమో చూడాలి.