English | Telugu

ప‌వన్‌కి ప్ర‌భాస్‌తో చెక్ పెడ‌తారా?

గ‌త ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని చాలా బాగా వ్యూహాత్మ‌కంగా వాడుకొంది బీజేపీ. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో టీడీపీ అధికారంలోకి రావ‌డానికి ప‌వ‌న్ ఇతోదికంగా స‌హాయ‌ప‌డ్డాడు. 2019లో మాత్రం ప‌వ‌న్ సాయం టీడీపీకి ద‌క్క‌దు. దాంతో బీజేపీ కీ ప‌వ‌న్ వ‌ల్ల ఒరిగేదేం ఉండ‌దు. పైగా ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన పార్టీ త‌ర‌పున అభ్య‌ర్థుల్ని నిల‌బెడ‌తాడు. ప‌వ‌న్ వ్యూహాల‌కు చెక్ పెట్టాలంటే, ప‌వ‌న్ క్రేజ్‌కి క‌ళ్లెం వేయాలంటే.. మ‌రో స్టార్ హీరోని వెదికిప‌ట్టుకోవాల్సిందే. అందుకే.. బీజేపీ ఇప్పుడు ప్ర‌భాస్ వైపుకు చూస్తోంద‌న్న టాక్స్ వినిపిస్తున్నాయి. ప్ర‌భాస్ పెద‌నాన్న కృష్ణంరాజు బీజేపీ పార్టీకి భ‌క్తుడు. కృష్ణంరాజుని అడ్డుపెట్టుకొని ప్ర‌భాస్‌ని పార్టీలోకి లాగాల‌ని బీజేపీ పావులు క‌దుపుతోంద‌ని తెలుస్తోంది.

ద‌క్షిణాది రాష్ట్రాల‌లో ప్ర‌భాస్‌ని ప్ర‌చారం కోసం వాడుకోవాల‌ని చూస్తోంది. బాహుబ‌లితో ప్ర‌భాస్ ఇండియ‌న్ స్టార్ అయిపోయాడు. ఎక్క‌డ‌కు వెళ్లినా ప్ర‌భాస్‌కు ఓటర్లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్ట‌డం ఖాయం. ప‌వ‌న్‌లా ప్ర‌భాస్ స్పీచులు దంచ‌క‌పోయినా.. క‌నీసం ప్ర‌భాస్‌నిచూడ్డానికైనా త‌మ స‌భ‌ల‌కు జ‌నం వ‌స్తార‌ని బీజేపీ భావిస్తోంది. ఈ రాజ‌కీయాల‌న్నా, స్పీచుల‌న్నా ప్ర‌భాస్‌కి ఏమాత్రం ప‌డ‌దు. కానీ పెద‌నాన్న అడిగితే... కాద‌న‌లేడు. మ‌రి ప్ర‌భాస్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకొంటాడో చూడాలి.