English | Telugu

`ఏజెంట్`లో ఆర్మీ ఆఫీస‌ర్ గా మ‌మ్ముట్టి?

ఈ విజ‌య‌ద‌శ‌మి కానుక‌గా విడుద‌లైన `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్`తో క‌థానాయ‌కుడిగా తొలి విజ‌యాన్ని అందుకున్నాడు అక్కినేని బుల్లోడు అఖిల్. ఈ రొమాంటిక్ డ్రామా స‌క్సెస్.. అఖిల్ లో నూత‌నోత్తేజాన్ని నింపింది. ప్ర‌స్తుతం ఈ యంగ్ హీరో.. `ఏజెంట్` పేరుతో రూపొందుతున్న ఓ స్పై థ్రిల్ల‌ర్ లో న‌టిస్తున్నాడు. స్టైలిష్ ఫిల్మ్ మేక‌ర్ సురేంద‌ర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో.. స‌రికొత్త మేకోవ‌ర్ లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడు అఖిల్. ఇప్ప‌టికే కొంత‌మేర చిత్రీక‌ర‌ణ జ‌రుపుకున్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీ.. త్వ‌ర‌లో హంగేరిలో త‌దుప‌రి షెడ్యూల్ కి సిద్ధ‌మ‌వుతోంది.

ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో మాలీవుడ్ మెగాస్టార్ మ‌మ్ముట్టి ఓ ముఖ్య పాత్ర‌లో న‌టించ‌బోతున్న‌ట్లు కొన్నాళ్ళ క్రితం క‌థ‌నాలు వ‌చ్చాయి. లేటెస్ట్ బ‌జ్ ఏంటంటే.. ఇందులో ఆయ‌న ఆర్మీ ఆఫీస‌ర్ రోల్ లో క‌నిపిస్తార‌ట‌. అంతేకాదు.. ఈ పాత్ర‌కి కాస్త నెగ‌టివ్ షేడ్స్ కూడా ఉంటాయ‌ని టాక్. మ‌రి.. ఈ ప్ర‌చారంలో వాస్త‌వ‌మెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.

కాగా, `ఏజెంట్`లో అఖిల్ కి జంట‌గా నూత‌న క‌థానాయిక సాక్షి వైద్య న‌టిస్తుండ‌గా.. హిప్ హాప్ త‌మిళ సంగీత‌మందిస్తున్నాడు. వ‌చ్చే ఏడాది ప్ర‌థ‌మార్ధంలో `ఏజెంట్` తెర‌పైకి రానుంది.