English | Telugu

ఇలియానాని ప‌డ‌గొట్టిన చ‌ర‌ణ్‌

చేతిలో సినిమాల్లేక‌పోయినా టెక్కు చూపించ‌డంలో కొంత‌మంది క‌థానాయిక‌లు ముందు వ‌రుస‌లో ఉంటారు. అలాంటి క‌థానాయికే ఇలియానా. సౌత్ ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ్ర‌స్ట్రీ ఇలియానాని దాదాపుగా మ‌ర్చిపోయింది. తెలుగులో అవ‌కాశం వ‌చ్చి ఏళ్ల‌కు ఏళ్లు అయిపోయింది. అయినా ఆ టెక్కు మాత్రం త‌గ్గ‌లేదు. రామ్‌చ‌ర‌ణ్ సినిమాలో ఇలియానాని ఐటెమ్ పాట‌కు సంప్ర‌దిస్తే కోటి రూపాయ‌లు డిమాండ్ చేసింద‌ట‌. దాంతో నిర్మాత‌ల క‌ళ్లు బైర్లు క‌మ్మాయి. చీప్‌లో ఏ ముఫై ల‌క్ష‌ల‌కో ఇలియానా వ‌చ్చేస్తుంద‌నుకొంటే ఇంత అడిగిందేంట‌ని బిత్త‌ర‌పోయారు. నాలుగైదు రోజులు తిప్పించుకొని 'ఇంతిస్తే గానీ చేయ‌ను...' అని మ‌రో రేటు చెప్పింద‌ట‌. దాంతో స్వ‌యంగా రామ్‌చ‌ర‌ణ్ రంగంలోకి దిగిన‌ట్టు తెలుస్తోంది.

రామ్‌చ‌ర‌ణ్ ఇలియానాకి ఫోన్ చేసి.. త‌న సినిమాలోని ప్ర‌త్యేక గీతంలో న‌ర్తించ‌మ‌ని కోరాడ‌ట‌. చ‌ర‌ణే స్వ‌యంగా ఫోన్ చేసే స‌రికి ఇలియానా కాస్త మెత్త‌బ‌డింది. ఈ సినిమాలో చేస్తా.. అని మాటిచ్చేసింద‌ట‌. దాంతో చ‌ర‌ణ్ రాయ‌బారం ఫ‌లించిన‌ట్టైంది. శ్రీ‌నువైట్ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ మెగా మూవీలో చిరంజీవి ఓ ప్ర‌త్యేక పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే.

చిరు, చ‌ర‌ణ్ క‌ల‌సి ఓ పాట‌లో న‌ర్తించ‌నున్నారు. అందుకోస‌మే ఇలియానాని సంప్ర‌దించారు. మొత్తానికి చ‌ర‌ణ్ వ‌ల్ల ఇలియానా ఈసినిమాలో ఓకే అయిపోయింది. ఇక వెండి తెర‌పై ఈ ముగ్గురి ఆటా పాట ఎలా ఉంటుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.