English | Telugu
తేజ తిట్లు.. ఏ హీరోలకు..??
Updated : Sep 14, 2015
తేజ అంతే.. మనసులో ఏం ఉంటే అదే మాట్లాడతాడు. కొన్నిసార్లు ఆ మాటలే వివాదాల్లోకి నెట్టాయి. పరిశ్రమకు దూరం చేసే పరిస్థితి తీసుకొచ్చాయి. అయినా సరే.. తేజ మారలేదు. తనకు హ్యాండిచ్చిన హీరోలపై తిట్ల పురాణం మొదలెట్టాడు. ఎంతోమందికి తాను లైఫ్ ఇస్తే.. ఈ రోజు హీరోలుగా సెటిలై, కోట్లకు కోట్లు సంపాదించి, జూబ్లీహిల్స్ లో ఇల్లులు కట్టుకొని, తనని మర్చిపోయారని తేజ తెగ ఫీలైపోతున్నాడు. కనీసం ఫోన్ చేసినా స్పందించడం లేదట.
''ఉదయ్‌కిరణ్ చనిపోయాడు. అతని గురించి మాట్లాడుకోకూడదు. మిగిలిన నా హీరోలంతా ఉన్నా.. చచ్చిపోయినట్టే..'' అంటూ తేజ సన్సేషనల్ కామెంట్స్ చేశాడు. నితిన్, గోపీచంద్‌లాంటివాళ్లకు తేజ లైఫ్ ఇచ్చాడు. ఎంతోమందిని స్టార్లుగా మార్చాడు. వాళ్లంతా జీవితాల్లో సెటిల్ అయినవాళ్లే. అయితే.. వీళ్లంతా ఇప్పుడు తేజని మర్చిపోయారన్నది.. ఆయన బాధ. ఈమధ్య తన ఆడియో ఫంక్షన్ కి పిలుద్దామని ఫోన్ చేస్తే ఒక్కరూ స్పందించలేదట.
దాంతో.. తేజకు కోపం నషాళానికి అంటింది. వేస్ట్ ఫెలోస్, ఎదవలు... అంటూ ఓ టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సదరు హీరోలపై తన అసహనం వెళ్లగక్కాడు. మేకప్ వేసుకోగానే విశ్వాసం అనేది పోతుందని, తాను దాదాపు వెయ్యిమందిని పరిచయం చేస్తే. పదిశాతం మంది కూడా తనని గుర్తు పెట్టుకోలేదని ఫీలౌతున్నాడు తేజ. పాపం.. ఆయన బాధలోనూ అర్థం ఉంది కదూ.