English | Telugu

ప‌వ‌న్ తో విసిగిపోయిన దాస‌రి

దాస‌రి నారాయ‌ణ‌రావుతో ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా అన్న‌ది అప్ప‌ట్లో సంచ‌ల‌న‌మైంది. ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్ ఎవ్వ‌రూ ఊహించ‌నిది. అందుకే అంత షాక్ త‌గిలింది. ఈ సినిమా గురించిన ప్ర‌క‌ట‌న వ‌చ్చి దాదాపు ఏడాది కావొస్తోంది. అయినా ఎలాంటి అప్ డేట్స్ లేవు. కోర్టు వ్య‌వ‌హారాల‌తో దాస‌రి, స‌ర్దార్ సినిమాతో ప‌వ‌న్ బిజీగా ఉండ‌డ‌మే అందుకు కార‌ణం. అయితే.. వీలున్న‌ప్పుడ‌ల్లా దాస‌రి క‌థ‌లైతే బాగానే విన్నారు. దాదాపు 20 క‌థ‌ల్ని ప‌వ‌న్ కోసం సెలెక్ట్ చేసిన‌ట్టు తెలుస్తోంది.

అయితే అందులో ఒక్క‌టీ ప‌వ‌న్‌కి న‌చ్చ‌లేద‌ట‌. దాంతో దాస‌రి కూడా విసిగిపోయిన‌ట్టు తెలుస్తోంది. మంచి క‌థ ఉంటే చేద్దాం.. లేదంటే లేదు అని ప‌వ‌న్ ఖ‌రాఖండీగా చెప్పేయ‌డంతో... దాస‌రికి ఏమీ పాలుపోవ‌డం లేద‌ట‌. ఆఖ‌రికి కొన్ని రీమేక్‌సినిమాల్నీ పవ‌న్ ముందుకు తీసుకెళ్లిన‌ట్టు తెలుస్తోంది. అయితే ఇవేం ప‌వ‌న్‌ని క‌దిలించ‌క‌పోయాయ‌ని తెలుస్తోంది. అస‌లు దాస‌రి తో ప‌వ‌న్‌కి సినిమా చేయాల‌న్న ఉద్దేశం లేద‌ని, అందుకే.. ఇలా క‌థ‌లు న‌చ్చ‌ట్లేద‌ని త‌ప్పుకొంటున్నాడ‌ని ఫిల్మ్‌న‌గ‌ర్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మ‌రి వాటిలో నిజ‌మెంతో దాస‌రికీ, ప‌వ‌న్‌కే తెలియాలి.