English | Telugu

'బాహుబలి' ఆడియో బయటకి వచ్చింది

‘బాహుబలి’ని మొదటి నుంచి ‘లీకేజ్’ సమస్య వెంటాడుతూ వస్తోంది. ఆ మధ్య షూటింగ్ జరుపుకుంటున్న నేపథ్యంలో ఓ ఫైట్ సీన్ కి సంబంధించి ఓ వీడియో లీకై సంచలనం సృష్టించింది. అది రెండుమూడు రోజులపాటు సామాజిక మాధ్యమాల్లో బాగానే చక్కర్లు కొట్టింది. అయితే.. యూనిట్ బృందం దానిపై వెంటనే స్పందించడంతో ఆ వివాదం అంతటితో సమసిపోయింది.

ఇప్పుడు తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ ఆడియో సాంగ్ లీకయ్యింది. ఈ మూవీ ఆడియో జూన్ 13న విడుదల కానున్న నేపథ్యంలో ఇలా ఆడియో లీకవ్వడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ‘శివుని ఆన’ పేరిట వున్న ఆ పాట ఇప్పటికే వాట్సాప్ లాంటి ఇన్‌స్టంట్ మెసేజింగ్‍ సర్వీసుల్లో, యూట్యూబ్ లో హల్‌చల్ చేస్తోంది. దాంతోపాటు మిగతా పాటలు కూడా లీకయ్యాయని తెలుస్తోంది. ఆ ఆడియోను విన్నవారు సామాజిక మాధ్యమాల ద్వారా ఈ విషయాన్ని షేర్ చేసుకుంటున్నారు. ‘బాహుబలి’ ఇంతకుముందే ఒకసారి లీక్‌‌కు గురవ్వడంతో.. ఆ తర్వాత నుంచి మూవీ టీమ్ అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ వస్తోంది. అయినప్పటికీ మరోసారి ఈ మూవీ లీక్ బారిన పడడం ఆసక్తికరంగా మారింది. ఈ యూనిట్ లో వర్క్ చేసిన టెక్నికల్ సభ్యులెవరైనా ఈ ఆడియోని రిలీజ్ చేసి వుంటారేమోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

బాహుబలి’ సినిమాకు సంబంధించిన ఆడియో రిలీజ్ ఇప్పటికే ఓసారి వాయిదా పడిన విషయం తెలిసిందే! తాజాగా జూన్ 13న తిరుపతిలో భారీ ఎత్తున అభిమానుల సమక్షంలో ఆడియో రిలీజ్‌కు ప్లాన్ చేశారు. కీరవాణి ఆధ్వర్యంలో రూపొందిన ఆడియోతో పాటు మరో కొత్త ట్రైలర్‌ను కూడా అదే రోజు విడుదల చేయనున్నట్లు సమాచారం.