English | Telugu
'లవకుశ'లో పట్టుబట్టి లక్ష్మణ పాత్రను కాంతారావుకు ఇప్పించిన ఎన్టీఆర్!
Updated : Jul 3, 2021
తొలి తెలుగు టాకీ 'భక్త ప్రహ్లాద' తీసిన హెచ్.ఎం. రెడ్డి ఆఫీసులో కత్తివీరుడు కాంతారావుకు నటసార్వభౌమ నందమూరి తారకరామారావు తొలిసారిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత ఎన్టీఆర్ 'జయసింహ' చిత్రాన్ని సొంతంగా నిర్మిస్తూ ఆ చిత్రంలో తన తమ్ముడు విజయసింహ పాత్రకు మొదట నాగేశ్వరరావునూ, తర్వాత జగ్గయ్యనూ అనుకొని, చివరకు ఆ అవకాశాన్ని కాంతారావుకు ఇచ్చారు. ఆ చిత్రంలో అన్నదమ్ములుగా నటించిన వారు నిజ జీవితంలోనూ అన్నదమ్ములుగా మెలిగేవారు. ఆ అభిమానంతోనే 'సీతారామ కల్యాణం' చిత్రంలో నారద పాత్రను కాంతారావుకు ఇచ్చి, ఆయన చేత కామెడీ చేయించిన ఘనత ఎన్టీఆర్‌కే చెల్లింది.
క్లాసిక్ ఫిల్మ్ 'లవకుశ' (1963)లో మొదట లక్ష్మణుడి పాత్రకు కాంతారావును నిర్మాతలు తీసుకున్నారు. అయితే మధ్యలో ఆయనను తొలగించే ప్రయత్నాలు జరిగినప్పుడు, నిజమైన సోదరునిగా చొరవ తీసుకొని, "ఆ పాత్రను కాంతారావే పోషించాలి. ఆర్టిస్టును మార్చడానికి వీల్లేదు." అని నిర్మాతలకు గట్టిగా చెప్పి, పట్టుబట్టి కాంతారావు చేతే లక్ష్మణ పాత్రను ధరింపజేశారు ఎన్టీఆర్. ఆ పాత్ర కాంతారావుకు చాలా మంచి పేరు తెచ్చింది. ఆ ఇద్దరూ కలిసి ఎన్నో జానపద చిత్రాల్లో, పౌరాణిక చిత్రాల్లో నటించారు. పౌరాణికాల్లో శ్రీకృష్ణునిగా ఎన్టీఆర్ నటిస్తే, నారదునిగా కాంతారావు, అర్జునునిగా ఎన్టీఆర్ నటిస్తే, శ్రీకృష్ణునిగా కాంతారావు నటించడానికి ముఖ్యకారణం ఎన్టీఆరే.
'వీరాభిమన్యు'లో అర్జునునిగా కాంతారావు నటించారు. అందులో బృహన్నలగా నటించాల్సి వచ్చినప్పుడు, నర్తనశాలలో రామారావు పోషించిన బృహన్నల పాత్రను గుర్తుచేసుకొని 'ఈ పాత్రకు నేను న్యాయం చెయ్యగలనా?' అని సందిగ్ధంలో పడ్డారు. అప్పుడు రామారావు, "ఇది చిన్న సీన్ మాత్రమే. కాబట్టి నాట్య భంగిమ కంటే నడకలో స్త్రీత్వం చూపిస్తే చాలు." అని సలహా ఇచ్చి, ధైర్యంనింపి ఆ పాత్ర రాణింపుకు దోహదపడ్డారు.