English | Telugu
శ్యామలగౌరి పరిచయమైంది 'తరంగిణి'తో కాదు.. 'ప్రేమ సంకెళ్లు'తో! ఆ కథేమిటంటే...
Updated : Jul 2, 2021
శ్యామలగౌరి అనగానే మనకు 'తరంగిణి' (1982) సినిమా గుర్తుకొస్తుంది. కోడి రామకృష్ణ డైరెక్ట్ చేసిన ఆ సినిమాలో టైటిల్ రోల్‌లో ఆమె నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ సినిమాతో హీరోగా సుమన్ పరిచయమయ్యారు. శ్యామల కూడా ఆ సినిమాతోటే పరిచయమైనట్లు ప్రచారంలో ఉంది. అయితే నిజానికి ఆమె పరిచయమైంది విజయనిర్మల డైరెక్ట్ చేసిన 'ప్రేమ సంకెళ్లు' (1982)చిత్రంతో.
అందులో నరేశ్ కుమార్, శ్యామలగౌరి హీరో హీరోయిన్లుగా నటించారు. నరేశ్ కుమార్ అంటే ఎవరో కాదు, విజయనిర్మల కుమారుడు నరేశే! కెరీర్ మొదట్లో నరేశ్ కుమార్ అనే పేరుతోటే ఆయన నటించారు. తర్వాత 'కుమార్'ను తీసేసి, నరేశ్‌గా స్థిరపడ్డారు. జంధ్యాల రూపొందించిన 'నాలుగు స్తంభాలాట' చిత్రంతో నరేశ్ హీరోగా పరిచయమయ్యారు. ఆ సినిమాతో పాటే 'ప్రేమ సంకెళ్లు' చిత్రం కూడా మొదలైంది.
ఈ సినిమాలో హీరోయిన్ ఎంపిక కోసం విజయనిర్మల చాలా కష్టపడ్డారు. కొత్త హీరోయిన్ కావాలని అన్ని పత్రికల్లో ప్రకటించారు. ఆ ప్రకటన వేసిన దగ్గర్నుంచీ రోజుకు యావరేజ్‌గా పదిమంది అమ్మాయిల దాకా విజయనిర్మలను కలుస్తూ వచ్చారు. వాళ్లెవరిలోనూ తన కథానాయిక కనిపించలేదు ఆమెకు. డైరెక్టుగా వచ్చిన వాళ్లను పక్కనపెడితే, కొన్ని వేల ఫొటోలు వాళ్ల ఆఫీసుకు వచ్చాయి. వాటిలో పదకొండు సంవత్సరాల వయసు కలిగిన అమ్మాయిల దగ్గర్నుంచి 40 ఏళ్ల వయసు కలిగిన వారి వరకు ఉన్నారు.
దాదాపు రెండు నెలల పాటు హీరోయిన్ అన్వేషణతోనే గడిచిపోయింది. అన్ని వేల ఫొటోల్లో విజయనిర్మలకు బాగా నచ్చినవి ఇద్దరి ఫొటోలు మాత్రమే! ఆ ఇద్దరిలో ఒక అమ్మాయిని బ్లాక్ అండ్ వైట్ ఫొటోల్లో ఉన్నంత గ్లామరస్‌గా కలర్ స్టిల్స్‌లో లేకపోవడంతో, హైట్ ప్రాబ్లమ్ వల్లా వద్దనుకున్నారు. ఇంకో ఫొటోలోని అమ్మాయి వారికి అన్ని విధాలా నచ్చింది. బొంబాయిలో ఉన్న ఆమెను పిలిపించి, నరేశ్‌తో జంటగా చాలా స్టిల్స్ తీశారు. స్క్రీన్ టెస్ట్ కోసం నరేశ్‌తో కొన్ని దృశ్యాలు చిత్రీకరించి రష్ చూశారు. 'ప్రేమ సంకెళ్లు'కు కావాల్సిన అమ్మాయి దొరికేసిందని అప్పుడు అనిపించింది. ఆమే.. శ్యామలగౌరి.
అప్పుడామె వయసు పదహారేళ్లు. 1965 ఆగస్ట్ 10న ఆమె పుట్టింది. హిందీ, ఇంగ్లీష్, తమిళ భాషల్లో అప్పటికే ఆమెకు మంచి ప్రావీణ్యం ఉంది. 10వ క్లాస్ దాకా బొంబాయిలో చదువుకొని, 1980-81 మధ్య ఒక సంవత్సరం మద్రాస్‌లోని ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి యాక్టింగ్‌లో డిప్లొమా పొందిందామె. అక్కడ ఫస్ట్ క్లాస్‌లో పాసయి, తిరిగి బొంబాయ్ వెళ్లిపోయింది. అప్పుడే విజయకృష్ణా మూవీస్ 'ప్రేమ సంకెళ్లు' సినిమా కోసం హీరోయిన్లు కావాలనే ప్రకటన చూసి, స్టిల్స్ పంపించి, హీరోయిన్‌గా సెలక్టయింది.
చిన్నతనం నుంచీ డాన్స్ అంటే బాగా ఇష్టమున్న శ్యామల.. అప్పటికే భరతనాట్యం పోటీల్లో గోల్డ్ మెడల్ కూడా సంపాదించేసింది. అట్లా విజయనిర్మల డైరెక్ట్ చేసిన 'ప్రేమ సంకెళ్లు' మూవీతో హీరోయిన్‌గా పరిచయమైంది శ్యామలగౌరి. అయితే 'ప్రేమ సంకెళ్లు' ఫ్లాపై, 'తరంగిణి' సినిమా హిట్టవడంతో కాలక్రమంలో ఈ రెండో సినిమాతోటే ఆమె నాయికగా పరిచయమైందనేది ప్రచారంలోకి వచ్చింది.