Read more!

English | Telugu

రాఘ‌వేంద్ర‌రావు లేక‌పోతే నేనేమైపోయేదాన్నో! ర‌మ్య‌కృష్ణ భావోద్వేగం!!

 

1980ల‌లోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ర‌మ్య‌కృష్ణ స్టార్ హీరోయిన్‌గా ఎద‌గ‌డానికి ప్ర‌ధానంగా దోహ‌దం చేసింది కె. రాఘ‌వేంద్ర‌రావు సినిమాలే. 'అల్లుడుగారు' సినిమాలో తొలిసారిగా రాఘ‌వేంద్రరావు డైరెక్ష‌న్‌లో న‌టించారు ర‌మ్య‌కృష్ణ‌. అందులో మూగ‌మ్మాయిగా, మోహ‌న్‌బాబు భార్య‌గా కొద్దిసేపు క‌నిపించే పాత్ర‌లో క‌నిపించారు. ఆ త‌ర్వాత 'అల్ల‌రి మొగుడు' సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా మోహ‌న్‌బాబు జోడీగానే చాన్స్ ఇచ్చారు ద‌ర్శ‌కేంద్రుడు. ఆ రెండు సినిమాలూ సూప‌ర్ హిట్ట‌య్యాయి. ఆ త‌ర్వాత ర‌మ్య వెనుతిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం క‌లుగ‌లేదు. మేజ‌ర్ చంద్ర‌కాంత్‌, అల్ల‌రి ప్రియుడు, ముగ్గురు మొన‌గాళ్లు, ముద్దుల ప్రియుడు, అల్ల‌రి ప్రేమికుడు, రాజ‌సింహం, ఘ‌రానా బుల్లోడు, అన్న‌మ‌య్య‌, ఇద్ద‌రు మిత్రులు త‌దితర రాఘ‌వేంద్ర‌రావు చిత్రాల్లో ర‌మ్య‌కృష్ణ నాయిక‌గా న‌టించారు.

'అల్లుడుగారు' సినిమాకు ముందు ర‌మ్య‌కృష్ణ‌కు ఫ్లాప్ హీరోయిన్‌గా, ఐర‌న్ లెగ్‌గా ఇండ‌స్ట్రీలో పేరు ఉండేది. కానీ త‌న‌కు కావాల్సిన హీరోయిన్ ర‌మ్య‌లో ఉన్న‌ద‌ని భావించిన రాఘ‌వేంద్ర‌రావుకు ఆమెకు అవ‌కాశాలు ఇస్తూ వ‌చ్చారు. ఆయ‌న సినిమాల‌తోటే ఆమె స్టార్ హీరోయిన్‌గా, మోస్ట్ గ్లామ‌ర‌స్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు ర‌మ్య‌.

'అల్ల‌రి మొగుడు' వంద రోజుల వేడుక‌లో మైకు ముందు మాట్లాడ‌టానికి వ‌చ్చి, "వేదిక‌ను అలంక‌రిస్తున్న పెద్ద‌ల‌కు, మీ అంద‌రికీ నా న‌మ‌స్కార‌ములు. ఈరోజు ఇక్క‌డ ఉన్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. దానికి కొన్ని కార‌ణాలు ఉన్నాయి. ఫ్రాంక్‌గా చెప్పాలంటే, చాలామంది న‌న్ను అన్‌ల‌క్కీ ఆర్టిస్టుగా చెప్పుకుంటున్న‌ప్పుడు, కొంత‌మంది ప్రొడ్యూస‌ర్లు న‌న్ను త‌మ సినిమాల‌కు తీసుకొని, తొల‌గించిన‌ప్పుడు.. ఈ సినిమా అవ‌కాశం రావ‌డం నాకు చాలా పెద్ద విష‌యం. అందుకు కె. రాఘ‌వేంద్ర‌రావు, నిర్మాత కృష్ణ‌మోహ‌నరావు, మోహ‌న్‌బాబుల‌కు థాంక్స్ చెప్పుకుంటున్నా.." అని చెప్పి, ఆ త‌ర్వాత ఏదో చెప్ప‌బోయినా అప్ప‌టికే దుఃఖంతో ఆమె గొంతుకు పూడుకుపోయి, క‌ర్చీఫ్‌తో క‌ళ్లు, ముక్కు తుడుచుకుంటూ, మాట‌లు రాక‌.. "సెల‌వు తీసుకుంటున్నా" అని చెప్పి ఇవ‌త‌ల‌కు వ‌చ్చేశారు. అప్పుడు ఆమె ఎంత భావోద్వేగానికి గుర‌య్యారో ఆమెను చూస్తే తెలుస్తుంది! ఆమె కెరీర్ ఎదుగుద‌ల‌లో రాఘ‌వేంద్ర‌రావు ఎంత పెద్ద పాత్ర పోషించారో అర్థ‌మ‌వుతుంది.

ఆ రోజు ఆమె మైకు నుంచి ఇవ‌త‌ల‌కు వ‌చ్చాక చాలామంది ఆమెను ప‌ట్టుకుని కంట్రోల్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించినా, చాలాసేప‌టి దాకా మామూలు మ‌నిషి కాలేక‌పోయారు ర‌మ్య‌.

రాఘ‌వేంద్ర‌రావుతో మొద‌టిసారి క‌లిసి ప‌నిచేసేట‌ప్పుడే అదివ‌ర‌కు త‌న‌ను కొంత‌మంది నిర్మాత‌లు హీరోయిన్‌గా బుక్ చేసుకొని, త‌ర్వాత తీసేసి వేరొక‌ర్ని తీసుకున్నార‌ని చెప్పేశారు ర‌మ్య‌. "ఇవాళ నిన్ను కాద‌నుకున్న‌వాళ్లు, నిన్ను రిమూవ్ చేసిన‌వాళ్లు మ‌ళ్లీ నువ్వే కావాల‌నుకునేట‌ట్లు చేస్తాను" అని ఆమె బ‌ర్త్‌డేకి మాటిచ్చారు రాఘ‌వేంద్ర‌రావు. త‌న మాట‌ను నిల‌బెట్టుకున్నారు.

"రాఘవేంద్ర‌రావు సినిమాలు లేక‌పోతే నేను ఓ సిస్ట‌ర్ క్యారెక్ట‌రో ఇంకొక‌టో చేసుకుంటూ ఉండేదాన్ని. లేదంటే ఇండ‌స్ట్రీ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయి, పెళ్లి చేసుకొని, ఎక్క‌డో ఏదో చేసుకుంటూ ఉండేదాన్ని. న‌టిగా, స్టార్‌గా నాకు రిక‌గ్నిష‌న్ వ‌చ్చిందంటే.. ఆ క్రెడిట్ మొత్తం ఆయ‌న‌దే. నా చివ‌రి శ్వాస దాకా ఆయ‌న‌కు రుణ‌ప‌డి ఉంటాను." అని రాఘ‌వేంద్ర‌రావు 'సౌంద‌ర్య‌ల‌హ‌రి' షోలో చెప్పారు ర‌మ్య‌కృష్ణ‌.