Read more!

English | Telugu

'బాండిట్ క్వీన్‌' ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా?

 

అగ్ర‌వ‌ర్ణ ఠాకూర్ల చేతుల్లో లైంగిక వేధింపుల‌తో పాటు, కుల‌ప‌ర‌మైన వేధింపుల‌కూ గురై, వారికి ఎదురుతిరిగి, బందిపోటుగా మారి, ఠాకూర్ల గుండెల్లో నిద్ర‌పోయిన ఫూల‌న్ దేవి జీవితం ఆధారంగా రూపొందిన 'బాండిట్ క్వీన్' (1994) సినిమా ఓ సంచ‌ల‌నం. డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌పూర్‌కు అంత‌ర్జాతీయ స్థాయిలో కీర్తి ప్ర‌తిష్ఠ‌లు ఆర్జించిపెట్టిన ఈ మూవీలో ఫూల‌న్ దేవి పాత్ర‌ను అప్ప‌టివ‌ర‌కూ జ‌నానికి పెద్ద‌గా తెలీని సీమా బిశ్వాస్ అద్వితీయంగా పోషించి, జాతీయ ఉత్త‌మ‌న‌టి అవార్డును అందుకున్నారు. అనేక అంత‌ర్జాతీయ చ‌ల‌న చిత్రోత్స‌వాల్లోనూ ప్ర‌ద‌ర్శిత‌మైన 'బాండిట్ క్వీన్' అనంత‌ర కాలంలో క‌ల్ట్ ఫిల్మ్‌గా పేరు తెచ్చుకుంది.

'బాండిట్ క్వీన్‌'తో బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ రావ‌డంతో చాలామంది అదే ఆమె మొద‌టి సినిమా అని పొర‌బ‌డుతుంటారు. కానీ ఆ సినిమా కంటే ఆరేళ్ల ముందే 1988లో 'అంషిణి' అనే హిందీ సినిమాలో ఆమె హీరోయిన్‌గా న‌టించారు. ఆ త‌ర్వాత మాతృభాష అస్సామీలోనూ న‌టించిన ఆమెకు ఓవ‌ర్‌నైట్ స్టార్‌డ‌మ్ తెచ్చిన సినిమా మాత్రం 'బాండిట్ క్వీన్‌'.

1996లో సంజ‌య్ లీలా భ‌న్సాలీ డైరెక్ట్ చేసిన 'ఖామోషి: ద మ్యూజిక‌ల్' మూవీలో నానా ప‌టేక‌ర్ జోడీగా ఫ్లావీ అనే ఒక బ‌ధిర స్త్రీగా అపూర్వ‌మైన న‌ట‌న ప్ర‌ద‌ర్శించిన సీమ బెస్ట్ స‌పోర్టింగ్ యాక్ట్రెస్‌గా స్క్రీన్ అవార్డ్ అందుకున్నారు. దీపా మెహ‌తా ప్ర‌ఖ్యాత చిత్రం 'వాట‌ర్‌'లో శ‌కుంత‌ల అనే పాత్ర పోష‌ణ‌కు గాను బెస్ట్ యాక్ట్రెస్‌గా జెనీ అవార్డును పొందారు.

రామ్‌గోపాల్ వ‌ర్మ మూవీ 'కంపెనీ'లో రాణీబాయ్‌, చంద్ర‌ప్ర‌కాశ్ ద్వివేది సినిమా 'పింజార్‌'లో పింగ్లీ, శ్రీ‌రామ్ రాఘ‌వ‌న్ మూవీ 'ఏక్ హ‌సీనా థీ'లో ఏసీవీ మాల‌తీ వైద్య‌, సూర‌జ్ ఆర్ బ‌ర్‌జాత్య చిత్రం 'వివాహ్‌'లో ర‌మా మిశ్రా, దీపా మెహ‌తా మూవీ 'మిడ్‌నైట్ చిల్డ్ర‌న్‌'లో మేరీ, మోహిత్ సురి మూవీ 'హాఫ్ గాళ్‌ఫ్రెండ్‌'లో హీరో అర్జున్ క‌పూర్ త‌ల్లిగా న‌టించి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నారు.

గ‌త‌ ఏడాది జీ5లో స్ట్రీమింగ్ అయిన 'కోడ్ ఎం' వెబ్ సిరీస్‌లో ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించిన సీమా బిశ్వాస్, ఇటీవ‌లే 'ద ఫ్యామిలీ మ్యాన్ '2లో ప్ర‌ధాన‌మంత్రి బ‌సు క్యారెక్ట‌ర్‌లో క‌నిపించి ఆక‌ట్టుకున్నారు. మ‌న‌సుకు న‌చ్చిన పాత్ర‌ల‌నే చేస్తూ, ప్ర‌తిభావంతురాలైన న‌టిగా త‌న ప్ర‌స్థానాన్ని కొన‌సాగిస్తూనే ఉన్నారు సీమ‌.