English | Telugu
తెలుగు సినిమాల్లో నటించకూడదని రజనీకాంత్ నిర్ణయం తీసుకున్నారని తెలుసా?
Updated : Jun 23, 2021
లెజెండరీ డైరెక్టర్ కె. బాలచందర్ రూపొందించిన తమిళ చిత్రం 'అపూర్వ రాగంగళ్' (1975) చిత్రంతో నటుడిగా పరిచయమైన రజనీకాంత్, ఆ తర్వాత సంవత్సరమే అదే డైరెక్టర్ తీసిన క్లాసిక్ ఫిల్మ్ 'అంతులేని కథ' (1976) తో తెలుగు ప్రేక్షకులకూ పరిచయమయ్యారు. అప్పట్నుంచీ ఆయన తమిళ సినిమాల్లో నటిస్తూనే క్రమం తప్పకుండా 1980 వరకు ప్రతి ఏటా తెలుగు సినిమాలు చేస్తూ వచ్చారు. కానీ ఆ తర్వాత మూడేళ్ల పాటు ఆయన ఒక్క తెలుగు సినిమా చేయకుండా దూరంగా ఉండిపోయారు. మళ్లీ 'ఇదే నా సవాల్' (1984), 'న్యాయం మీరే చెప్పాలి' (1985), 'జీవన పోరాటం' (1986) సినిమాలు మాత్రమే చేశారు. అయినా కూడా అదివరకటితో పోల్చుకుంటే తెలుగు సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వడం తగ్గించేశారు. 1986 తర్వాత పూర్తిగా తమిళ సినిమాల మీదే దృష్టి పెట్టారాయన. కేవలం తన స్నేహితుడు మోహన్‌బాబు కోసం 'పెదరాయుడు' (1995)లో పాపారాయుడుగా ఓ పవర్‌ఫుల్ గెస్ట్ రోల్ చేశారు.
ఉద్దేశపూర్వకంగానే ఆయన తెలుగు సినిమాలు తగ్గించుకోవడం లేదా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారంటే ఆశ్చర్యం కలుగక మానదు. అయితే అది నిజం. ఒక ఇంటర్వ్యూలో "చిలకమ్మ చెప్పింది, అన్నదమ్ముల సవాల్, మీసం కోసం.. ఇంకా చాలా తెలుగు చిత్రాల్లో నటించిన మీరు, ఈ మధ్య తెలుగులో నటించకపోవడానికి కారణం ఏమిటి? మీకు నచ్చిన పాత్రలు రానందువల్లా? లేక మరేదైనా కారణం ఉన్నదా?" అనే ప్రశ్న ఆయనకు ఎదురైంది.
దానికి కొద్దిసేపు మౌనంగా ఉండి, "ఇక నుండి తెలుగు సినిమాల్లో నటించకూడదని నిశ్చయించుకున్నాను" అన్నారు రజనీ. "ఎందుకలా?" అనడిగితే, "నేను ఒక తెలుగు సినిమాలో నటిస్తే, అదే తెలుగు సినిమాని తమిళంలోకి డబ్ చేసి, స్ట్రయిట్ పిక్చర్‌గా తమిళనాడులో రిలీజ్ చేస్తున్నారు. ఇది ప్రేక్షకుల్ని మోసం చెయ్యడం లాంటిది. ఒక భాషనుంచి మరొక భాషలోకి చిత్రాన్ని డబ్ చేసినప్పుడు అది డబ్బింగ్ సినిమా అని ప్రేక్షకులకు తెలియజెయ్యాలి. అలా కాకుండా స్ట్రయిట్ పిక్చర్‌గా రిలీజ్ చేస్తే, అసలు చిత్రంలో ఉన్న ఎఫెక్ట్స్ డబ్బింగ్ సినిమాలో పోయి, పేలవంగా కనిపించే ఆస్కారం ఉంది. ఈయన నటన ఇలా ఉందేమిటి? అని ప్రేక్షకులు భావించే అవకాశం ఉంది. దీనివల్ల ఇమేజ్ భంగపడే ఆస్కారం ఉంది. అందుకనే తెలుగు సినిమాల్లో నటించకూడదని అనుకుంటున్నాను." అని చెప్పారు రజనీకాంత్. ఈ ఇంటర్వ్యూ ఇచ్చింది 1981 డిసెంబర్ చివరలో. అది కూడా డి. రామానాయుడు తమిళంలో నిర్మించిన 'తనికాట్టు రాజా' సినిమా సెట్స్‌పై.
సో.. అదన్నమాట విషయం. అంతదాకా రెగ్యులర్‌గా తెలుగు సినిమాలు చేస్తూ వచ్చిన ఆయన అప్పట్నుంచీ తెలుగు సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆ తర్వాత మూడు నాలుగు తెలుగు సినిమాలు చేశారంతే. తన ఇమేజ్ విషయంలో అంత జాగ్రత్త తీసుకోవడం వల్లనే అతి తక్కువ కాలంలో ఆయన సూపర్‌స్టార్ రేంజ్‌కు ఎదిగారు.