English | Telugu

అమెరికాలో ఊగిపోయిన క‌మ‌ల్ ఎక్కిన ఫ్లైట్‌.. మిస్స‌యిన 'నాయ‌క‌న్' ప్రింట్‌!

 

మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో క‌మ‌ల్ హాస‌న్ టైటిల్ రోల్ పోషించిన 'నాయ‌క‌న్' (1987 - తెలుగులో 'నాయ‌కుడు') బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఘ‌న విజ‌యం సాధించ‌డ‌మే కాకుండా, స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. క‌మ‌ల్ న‌ట‌నా విన్యాసాల‌కు, మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌కు అద్దం ప‌ట్టిన చిత్రంగా నాయ‌క‌న్ కాల‌క్ర‌మంలో క‌ల్ట్ క్లాసిక్ స్టేట‌స్‌ను అందుకుంది. ఆ ఏడాది ఆస్కార్ అవార్డుల పోటీకి భార‌త్ త‌ర‌పున అధికారిక ఎంట్రీగా సెల‌క్ట్ అయింది. ఆ సినిమా అమెరిక‌న్ పంపిణీ హ‌క్కుల్ని అక్క‌డి భార‌తీయుడు శంక‌ర్ ర‌మ‌ణి సొంతం చేసుకున్నారు. వివిధ న‌గ‌రాల్లో ఆ సినిమాని ప్ర‌ద‌ర్శించేందుకు సిద్ధ‌మ‌య్యారు. దాని కోసం ఆ ప్ర‌ద‌ర్శ‌న‌ల్లో పాల్గొనాల్సిందిగా నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్‌ను, ఆ చిత్ర నిర్మాత జి. వెంక‌టేశ్వ‌ర‌న్‌ను ఆయ‌న ఆహ్వానించారు. 

ప‌ది రోజుల్లో అక్క‌డ ప‌లు న‌గ‌రాల్లో తిర‌గాల్సి ఉన్నందున భార్య సారిక, నెల‌ల పిల్ల అయిన శ్రుతిల‌ను తీసుకువెళ్ల‌డం కుద‌ర‌ద‌ని వాళ్ల‌ను మ‌ద్రాస్‌లోనే ఉంచి, త‌నొక్క‌డే నిర్మాత వెంక‌టేశ్వ‌ర‌న్‌తో క‌లిసి యు.ఎస్‌. వెళ్లారు క‌మ‌ల్‌. 1987 డిసెంబ‌ర్ 17న బ‌య‌లుదేరి, 22 గంట‌ల ప్ర‌యాణం త‌ర్వాత మ‌రుస‌టి రోజు న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్‌. కెన్న‌డీ ఎయిర్‌పోర్టులో దిగారు. వారికి శంక‌ర్ ర‌మ‌ణి సాద‌ర స్వాగ‌తం ప‌లికారు. డిసెంబ‌ర్ 19న డెట్రాయ్ న‌గ‌రానికి వెళ్లారు. అక్క‌డ త‌మిళ సంఘంవాళ్లు ఏర్పాటుచేసిన అభినంద‌న స‌భ‌లో పాల్గొన్నారు. ఆ స‌భ‌లో క‌మ‌ల్‌ను త‌మిళంలోనే కాకుండా తెలుగు, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం భాష‌ల్లో కూడా మాట్లాడ‌మ‌ని కోరారు. ఒక్కో భాష‌లో రెండు రెండు మాట‌లు మాట్లాడారు క‌మ‌ల్‌. ఆ స‌భ‌లో మోగిన క‌ర‌తాళధ్వ‌నులు చాలా కాలం దాకా క‌మ‌ల్ చెవుల్లో ప్ర‌తిధ్వ‌నిస్తూ వ‌చ్చాయి.

ఆ రాత్రి క‌మ‌ల్‌, వెంక‌టేశ్వ‌ర‌న్ డ‌ల్లాస్ న‌గ‌రానికి వెళ్లాలి కాబ‌ట్టి, చిత్ర ప్ర‌ద‌ర్శ‌న‌కు ముందే ఎయిర్‌పోర్టుకు బ‌య‌లురేరారు. డెట్రాయ్ విమానాశ్ర‌యంలో వాళ్లు ఎక్కిన విమానం రెండుసార్లు సాంకేతిక వైఫ‌ల్యం వ‌ల్ల ఆగి, బ‌య‌ల్దేరింది. విమానం ఆకాశ మార్గం ప‌ట్టి ప‌ది నిమిషాలై ఉంటుంది. మెల్ల‌గా అటు ఇటు ఊగ‌డం ప్రారంభించింది. కొద్దిసేప‌టికే ఆ ఊపు తీవ్ర‌మైంది. వింత వింత శ‌బ్దాలు వినిపించ‌సాగాయి. లోప‌లున్న అంద‌రికీ భ‌యం వేసింది. అంత‌లో విమానం కెప్టెన్ వ‌చ్చి, భ‌య‌ప‌డాల్సిందేమీ లేదు అని ధైర్యం చెప్పి, స‌మీపంలోని మెంఫిస్ ఎయిర్‌పోర్టులోకి విమానాన్ని సుర‌క్షితంగా చేర్చాడు. అక్క‌డ్నుంచి మ‌రో ఫ్ల‌యిట్‌లో అర్ధ‌రాత్రి డల్లాస్‌కు చేరుకున్నారు.

అక్క‌డ‌కు వెళ్లాక చూసుకుంటే వాళ్ల ల‌గేజీలో ఒక పెట్టె క‌నిపించ‌లేదు. క‌మ‌ల్ వాళ్లు గాభ‌రాప‌డ్డారు. "అందులో పాస్‌పోర్ట్‌, డ‌బ్బు కానీ, ఖ‌రీదైన బ‌ట్ట‌లుకానీ లేవుగా" అన్నారు శంక‌ర్ ర‌మ‌ణి. అవేమీ లేవ‌న్నారు క‌మ‌ల్‌. "అయితే కంగారెందుకు?" అన‌డిగారాయన‌. "ఆ పెట్టెలో అంత‌కంటే విలువైన 'నాయ‌క‌న్' ప్రింట్ ఉంది." అని చెప్పారు వెంక‌టేశ్వ‌ర‌న్‌. డ‌ల్లాస్ సిటీలో మ‌ర్నాడు ఉద‌య‌మే ఆ సినిమాని ప్ర‌ద‌ర్శించాల్సి ఉంది. ఆ ఉద‌యం ఏడు గంట‌ల నుంచి ఫోన్ల మీద నాయ‌క‌న్ ప్రింట్ వేట మొద‌లైంది. 10 గంట‌ల‌కు ఆ పెట్టె డెట్రాయ్ ఎయిర్‌పోర్టులోనే ఉంద‌నే స‌మాచారం వ‌చ్చింది. సాయంత్రం ఐదింటికి అది చేరాకే క‌మ‌ల్ బృందానికి ఊర‌ట ల‌భించింది.