Read more!

English | Telugu

అక్క శ్రీ‌ల‌క్ష్మిని సినిమాల్లో న‌టించ‌వ‌ద్ద‌ని దెబ్బ‌లాడిన‌ రాజేశ్‌!

 

శ్రీ‌ల‌క్ష్మి, రాజేశ్ అక్కాత‌మ్ముళ్లు. రాజేశ్ హీరోగా, విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా న‌టించి, యంగ్ ఏజ్‌లోనే లివ‌ర్ దెబ్బ‌తిని మృతిచెందాడు. శ్రీ‌ల‌క్ష్మి లేడీ క‌మెడియ‌న్‌గా జంధ్యాల సినిమాల్లో రాణించి, అలా వ‌చ్చిన పేరుతో అనేక అవ‌కాశాలు సంపాదించుకొని ప్రేక్ష‌కుల ఆద‌రాభిమానాల‌ను పొందారు. నిజానికి శ్రీ‌ల‌క్ష్మి సినిమాల్లో న‌టించ‌డం రాజేశ్‌కు ఏమాత్రం ఇష్టంలేదు. ఆమెను న‌టించ‌వ‌ద్ద‌ని ఆయ‌న చెప్పినా, శ్రీ‌ల‌క్ష్మి విన‌లేదు. అంద‌రూ ప‌నిచేస్తేనే కుటుంబం గ‌డుస్తుంద‌నీ, త‌ను న‌టిస్తాన‌నీ తేల్చిచెప్పి న‌టిగా కొన‌సాగారు.

నిజానికి వాళ్ల నాన్న తొలి త‌రం సినీ క‌థానాయ‌కుడు అమ‌ర్‌నాథ్. తండ్రి చ‌నిపోయిన‌ప్పుడు వాళ్ల కుటుంబం హైద‌రాబాద్‌లోనే ఉండేది. ఆయ‌న చ‌నిపోయాక జీవ‌నాధారం కోసం మ‌ద్రాస్ వెళ్లింది ఆ కుటుంబం. అమ‌ర‌నాథ్‌కు, భానుచంద‌ర్ వాళ్ల నాన్న మాస్ట‌ర్ వేణు (అల‌నాటి మేటి సంగీత ద‌ర్శ‌కుల్లో ఒక‌రు) మంచి మిత్రులు. అలా ఆ కుటుంబం తెలియ‌డంతో నేరుగా వారి ఇంటికే వెళ్లారు శ్రీ‌ల‌క్ష్మి వాళ్లు. ఆ ఇంట్లోనే ఓ పోర్ష‌న్‌లో అద్దెకున్నారు. రాజేశ్‌కు జంధ్యాల సినిమా 'నెల‌వంక‌'లో హీరో వేషం వ‌చ్చింది.

దాని త‌ర్వాత 'రెండు జెళ్ల సీత' సినిమాలోని న‌లుగురు హీరోల్లో ఒక‌డిగా రాజేశ్‌ను తీసుకున్నారు జంధ్యాల‌. ఆ సినిమాలో సుత్తి వేలు భార్య‌గా ఓ చిన్న వేషానికి శ్రీ‌ల‌క్ష్మిని తీసుకున్నారు. అయితే అక్క న‌టిగా మార‌డం ఎందుక‌నో రాజేశ్‌కు రుచించ‌లేదు. మొద‌ట అత‌ను మౌనంగానే ఉన్నాడు. శ్రీ‌ల‌క్ష్మిని రెండు రోజుల క్యారెక్ట‌ర్ కోస‌మే తీసుకున్నారు శ్రీ‌ల‌క్ష్మి. కానీ.. సుత్తి వేలు, ఆమె మ‌ధ్య స‌న్నివేశాలు బాగా వ‌స్తూ, విప‌రీత‌మైన హాస్యాన్ని కురిపిస్తున్నాయ‌న్న విష‌యం సెట్స్‌లోనే అర్థ‌మ‌వ‌డంతో జంధ్యాల ఆమె పాత్ర‌ను పెంచారు. 

అప్పుడు రాజేశ్, "నువ్వెందుకు ఈ క్యారెక్ట‌ర్‌కు వ‌చ్చావ్‌?  నేను హీరోగా చేస్తున్నాను. నువ్వు రెండు రోజుల వేషానికి వ‌చ్చావ్‌. నువ్వు వెళ్లిపో" అని చెప్పాడు. "అదేంట్రా.. న‌లుగురూ క‌ష్ట‌ప‌డితేనే క‌దా మ‌న కుటుంబం వెళ్లేది! నువ్వేమో వెళ్లిపో అంటున్నావ్‌. పో.. కావాలంటే నీ ప్రెస్టీజ్ నిల‌బెట్టుకో. నేను వ‌చ్చిన ప‌ని చేసుకొని వెళ్తానంతే." అని క‌చ్చితంగా చెప్పేశారు శ్రీ‌ల‌క్ష్మి. "నీ ఖ‌ర్మ" అని రాజేశ్ అక్క‌డ్నుంచి వెళ్లిపోయాడు. అట్లా ఇద్ద‌రి మ‌ధ్యా దెబ్బ‌లాట జ‌రిగింది. 'రెండు జెళ్ల సీత' తెచ్చిన పేరుతో వెన‌క్కి తిరిగి చూడ‌కుండా కెరీర్‌లో ముందుకు దూసుకుపోయారు శ్రీ‌ల‌క్ష్మి. ఈ విష‌యాల‌ను ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు శ్రీ‌ల‌క్ష్మి.