English | Telugu

ఐశ్వ‌ర్య తండ్రి 'మ‌ల్లెమొగ్గ‌లు' రాజేశ్ అర్ధంత‌రంగా ఎలా చ‌నిపోయాడు?

ఐశ్వ‌ర్యా రాజేశ్ అంటే ఇప్పుడు మ‌నంద‌రికీ తెలుసు. ఆమెది సినీ కుటుంబం. ఆమె తాత అమ‌ర్‌నాథ్ తొలినాటి తెలుగు సినీ హీరోల్లో ఒక‌రు. ఆమె తండ్రి రాజేశ్‌.. ఒక‌ప్పుడు 'మ‌ల్లెమొగ్గ‌లు' రాజేశ్‌గా మ‌నంద‌రికీ సుప‌రిచితుడు. 'రెండు జెళ్ల సీత‌', 'ఆనంద భైర‌వి' లాంటి కొన్ని సినిమాల్లో హీరోగా, మ‌రి కొన్ని సినిమాల్లో నెగ‌టివ్ రోల్స్‌లో క‌నిపించిన రాజేశ్ యంగ్ ఏజ్‌లోనే అర్ధంత‌రంగా క‌న్నుమూసి, అటు త‌న స‌న్నిహితులు, శ్రేయోభిలాషుల హృద‌యాల్లో విషాదాన్ని నింపారు. ఆయ‌న మ‌ర‌ణంతో ఎక్కువ‌గా కుంగిపోయింది ఆయ‌న కుటుంబ‌మే. రాజేశ్‌కు భార్య‌తో పాటు ముగ్గురు కొడుకులు, ఒక కూతురు.

న‌టునిగా బాగా బిజీగా ఉన్న కాలంలో ఆర్థికంగా మంచి స్థితికి చేరుకోవ‌డంతో అనేక‌మంది ఆయ‌న చుట్టూ చేరేవారు. స్వ‌త‌హాగా మృదుస్వ‌భావి, ద‌యాగుణం క‌ల‌వాడు కావ‌డంతో అనేక‌మందికి ఆయ‌న డ‌బ్బు సాయం చేశాడు. ఫైనాన్స్ సంస్థ‌ల్లో అప్పులు తీసుకున్న కొంత‌మందికి ష్యూరిటీగా వ్య‌వ‌హ‌రించాడు. ఈ మంచిత‌న‌మే ఆయ‌న‌కు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. రుణాలు తీసుకున్న‌వారు వాటిని చెల్లించ‌క‌పోవ‌డంతో రాజేశ్‌పై ఆ భారం ప‌డేద‌ని చెప్పుకునేవారు. ఆ ఒత్తిళ్ల నుంచి బ‌య‌ట‌ప‌డ్డానికో, ఏమో తాగుడు వ్య‌స‌నానికి గుర‌య్యాడు. దాంతో స‌హ‌జంగానే ఆయ‌న ఆరోగ్యం దెబ్బ‌తిన్న‌ది.

ఆ కాలంలో ఆ కుటుంబం చాలా ఆర్థిక క‌ష్టాలు ఎదుర్కొంది. కుటుంబ పోష‌ణ భారం తీసుకున్న రాజేశ్ భార్య ఎల్ఐసీ ఏజెంట్‌గా ప‌నిచేశారు. భ‌ర్త‌నూ, న‌లుగురు పిల్ల‌ల‌నూ పోషించుకుంటూ వ‌చ్చారు. ఆమె సంపాద‌న‌లో అధిక భాగం రాజేశ్ వైద్యానికే ఖ‌ర్చ‌య్యేది. కానీ ఫ‌లితం ద‌క్క‌లేదు. ఆయ‌న లివ‌ర్ అప్ప‌టికే బాగా దెబ్బ‌తినిపోయింది. ఐశ్వ‌ర్య‌కు ఏడెనిమిదేళ్ల వ‌య‌సులో రాజేశ్ మృతి చెందాడు. ఆ స‌మ‌యానికి వారికి మ‌ద్రాస్‌లోని టి. న‌గ‌ర్‌లో ఒక ఫ్లాట్ మిగిలింది. ష్యూరిటీ ఉండ‌టం వ‌ల్ల ఫైనాన్స్ వ్యాపార‌స్తులు గొడ‌వ‌లు చేయ‌డంతో ఆ ఫ్లాట్‌ను కూడా రాజేశ్ భార్య అమ్మేసి, ఆ డ‌బ్బును వాళ్ల‌కు చెల్లించారు. త‌ర్వాత అద్దె ఇంట్లోనే ఉంటూ పిల్ల‌ల‌ను పెంచుతూ వ‌చ్చారు.

దుర‌దృష్ట‌వ‌శాత్తూ ఒక ప్ర‌మాదంలో ఇద్ద‌రు కొడుకులు మృతిచెంద‌డం ఆ కుటుంబంలో జ‌రిగిన మ‌రో పెద్ద విషాదం. అలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటూ వ‌చ్చిన ఐశ్వ‌ర్య ఇవాళ న‌టిగా మంచి పేరు తెచ్చుకుని తండ్రి వార‌స‌త్వాన్ని నిల‌బెట్ట‌డ‌మే కాకుండా, ఆర్థికంగా కుటుంబాన్నీ నిల‌బెట్టింది. ఐశ్వ‌ర్య అన్న‌య్య‌కు పెళ్ల‌యింది కూడా. త‌మిళ‌, తెలుగు చిత్రాల‌తో బిజీగా ఉంటున్న కూతుర్ని చూసుకుంటూ గ‌ర్విస్తోంది ఆమె త‌ల్లి. లేడీ క‌మెడియ‌న్‌గా ఎన్నో సినిమాల్లో మ‌న‌ల్ని న‌వ్వించిన శ్రీ‌ల‌క్ష్మి.. ఐశ్వ‌ర్య‌కు స్వ‌యానా మేన‌త్త‌!