Read more!

English | Telugu

ఎన్టీఆర్‌తో న‌టించ‌డానికి మూడు నెల‌ల ముందే డైలాగ్స్ ప్రాక్టీస్ చేసిన రాధ‌!

 

మ‌హాన‌టుడు నంద‌మూరి తార‌క‌రామారావు స‌ర‌స‌న రాధ నాయిక‌గా న‌టించిన సినిమా ఒకే ఒక్క‌టి. అదీ.. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలోనే రూపొందిన చిత్రం, బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బ్లాక్‌బ‌స్ట‌ర్ అయిన చిత్రం - 'చండ‌శాస‌నుడు'. ఆ సినిమాలో న‌టించ‌డానికి ఒప్పుకున్నాక, షూటింగ్‌కు మూడు నెల‌ల ముందుగానే రాధ‌కు సంబంధించిన డైలాగ్స్ ఆమెకు ఇచ్చి ప్రాక్టీస్ చెయ్య‌మ‌న్నారు. ఆ తెలుగు డైలాగ్స్‌ను ఆమె మ‌ల‌యాళంలో రాసుకొని ప్రాక్టీస్ చేశారు.

అంత‌కుముందు ఆమెకు ఎన్టీఆర్‌తో ప‌రిచ‌యం లేదు. ఎన్న‌డూ నేరుగా ఆయ‌న‌ను చూసే అవ‌కాశం కూడా ఆమెకు రాలేదు. అయితే ఆయ‌న పౌరాణిక చిత్రాలు చాలావాటిని ఆమె అప్ప‌టికే చూశారు. ఆయ‌నంటే రాధ‌కు ఒక‌విధ‌మైన భ‌క్తిభావం ఉండేది. 'చండ‌శాస‌నుడు' షూటింగ్‌కు వెళ్లే ముందే ఆమె 'బొబ్బిలిపులి' మూవీ చూశారు.

'చండ‌శాస‌నుడు' సినిమా షూటింగ్ ఎన్టీఆర్ సొంత స్టూడియో అయిన రామ‌కృష్ణ హార్టిక‌ల్చ‌ర‌ల్ స్టూడియోస్‌లో జ‌రిగింది. షూటింగ్ మొద‌టి రోజున ఎన్టీఆర్ మేక‌ప్ రూమ్‌కు వ‌చ్చి, రాధ‌కు మేక‌ప్ ఎలా ఉండాలి, డ్రెస్ ఎలా ఉండాలి?.. లాంటి విష‌యాలు చెప్పి వెళ్లారు. ఆయ‌నంటే ఆమెకు భ‌యం భ‌యంగా ఉండేది. ప‌క్క‌న సీనియ‌ర్ న‌టి శార‌ద ఉండి ఆమెకు ధైర్యం చెప్పేవారు. డైలాగ్స్ విష‌యంలోనూ, ఎక్స్‌ప్రెష‌న్స్ విష‌యంలోనూ స‌ల‌హాలు ఇస్తూ రాధ‌కు స‌హాయం చేశారు శార‌ద‌.

ఆ మూవీలో "ఏమీ.. ఏమేమీ.." అంటూ పౌరాణిక బాణీలో కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. ఎన్టీఆర్ త‌న‌దైన బాణీలో డైలాగ్స్ చెబుతూ వుంటే, అవే డైలాగ్స్ రాధ రిపీట్ చేసి, ఆయ‌నను వెక్కిరిస్తూ చెప్పే స‌న్నివేశం ఉంది. ఆమెకు నోరు తిరిగేది కాదు. ఎన్టీఆర్ ఓపిగ్గా "ఏం ఫ‌ర్వాలేదు.. నిదానంగా చెప్పు" అంటూ ధైర్యం చెప్పి, ప్రోత్స‌హించేవారు. అలా ఆమెలో భ‌యంపోయి, స‌ర‌దాగా షూటింగ్ చేసేశారు.