English | Telugu

ద‌ర్శ‌కేంద్రుని త‌న‌యుడు ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా?

 

ప్రకాశ్ కోవెలమూడి.. దిగ్దర్శకుడు కె. రాఘవేంద్రరావు కుమారుడు. మొద‌ట న‌టుడిగా ప‌రిచ‌య‌మై, లాభం లేద‌నుకొని డైరెక్ట‌ర్‌గా మారి 2004లోనే ‘బొమ్మలాట’ అనే బాలల చిత్రం రూపొందించాడు. దానికి 2005 జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రం అవార్డు వచ్చింది. అందులో ప్రధాన పాత్ర పోషించిన మాస్టర్ సాయికుమార్ ఉత్తమ బాలనటుడిగా రాష్ట్రపతి నుంచి పురస్కారం పొందాడు.

అయితే ఆ సినిమాని అతి తక్కువమందే చూశారు. కమర్షియల్‌గా అది విజయం సాధించలేదు. ఆ సినిమా తర్వాత మరో సినిమాని డైరెక్ట్ చేయడానికి ఏడేళ్ల కాలం తీసుకున్నాడు ప్రకాశ్. ఈసారి భారీ బడ్జెట్ అవసరమయ్యే జానపద కథాంశాన్ని తీసుకొని శ్రుతి హాసన్‌ను తెలుగు ప్రేక్షకులకు నాయికగా, మంచు లక్ష్మీప్రసన్నను విలన్‌గా పరిచయం చేస్తూ, సిద్ధార్థ్ టైటిల్ రోల్‌లో ‘అనగనగా ఓ ధీరుడు’ తీశాడు.

బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా బోల్తా కొట్టింది. లక్ష్మీప్రసన్నకు ఉత్తమ విలన్‌గా నంది అవార్డు మాత్రం దక్కింది. ఆ సినిమా తర్వాత ప్రకాశ్ మళ్లా కొన్నాళ్లు మౌనం పాటించాడు. 2017లో ‘సైజ్ జీరో’ రూపొందించాడు. ఆ సినిమా కోసం అందాల తార అనుష్కను స్థూలకాయురాలిగా మార్చేశాడు. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచిన ఈ సినిమా తీరా విడుదల తర్వాత బాగా నిరాశపర్చింది. వాళ్లు ఆ సినిమాని నిర్ద్వంద్వంగా తిరస్కరించారు.

ఈసారి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి సాక్షాత్తూ కంగ‌నా ర‌నౌత్ హీరోయిన్‌గా ఓ సినిమా రూపొందించాడు. రాజ్‌కుమార్ రావ్ హీరోగా న‌టించిన ఆ మూవీ.. 'జ‌డ్జిమెంట‌ల్ హై క్యా'. 2019 జూలైలో వ‌చ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఫ‌ర్వాలేద‌నిపించే స్థాయిలో ఆడింది. ఈ సినిమాకు ప్ర‌కాశ్ మాజీ భార్య క‌నికా థిల్లాన్ స్క్రీన్‌ప్లే స‌మ‌కూర్చింది.

2014లో పెళ్లాడిన ప్ర‌కాశ్‌, కనిక మూడేళ్ల త‌ర్వాత విడిపోయారు. ఆ త‌ర్వాతే 'జ‌డ్జిమెంట‌ల్ హై క్యా' వ‌చ్చింది. క‌నిక ఈ ఏడాదే రైట‌ర్‌ హిమాంశు శ‌ర్మను రెండో వివాహం చేసుకుంది. ప్ర‌కాశ్ మాత్రం సింగిల్‌గానే ఉన్నాడు. 'జ‌డ్జిమెంట‌ల్ హై క్యా' మూవీ త‌ర్వాత అత‌ను ఏం చేస్తున్నాడనే విష‌యం ఇంత‌దాకా బ‌య‌ట‌కు రాలేదు. క‌నిక‌తో విడిపోయాక అనుష్కను అత‌ను పెళ్లాడ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఆ ప్ర‌చారాన్ని అనుష్క ఖండించింది.