English | Telugu
'అంకుల్' రజనీకాంత్‌తో హీరోయిన్‌గా చేయడానికి ఇబ్బందిపడ్డ మీనా!
Updated : Sep 6, 2021
అటు అందాల తారగా, ఇటు ప్రతిభావంతురాలైన నటిగా పేరు తెచ్చుకున్న కొద్దిమందిలో మీనా ఒకరు. స్వతహాగా తమిళురాలైన ఆమెను తెలుగువారు తమ ఇంటి ఆడపడుచు అన్నంతగా ఆదరించారు. ఆమె తెలుగమ్మాయి కాదంటే తెలుగువారిలో చాలామంది నమ్మరు కూడా. అంతలా ఆమె ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించారు. తొంభైలలో తెలుగు, తమిళ భాషా చిత్ర రంగాలు రెండింటిలోనూ ఆమె అగ్రనాయికగా ఒక వెలుగు వెలిగారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ జోడీగా నటించిన 'ముత్తు' సినిమా ఎంతటి బ్లాక్‌బస్టర్ హిట్టయిందో మనకు తెలుసు. ఈ సినిమా జపాన్‌లోనూ విడుదలై అటు రజనీకి, ఇటు మీనాకు కూడా అక్కడ ఫ్యాన్‌బేస్ ఏర్పడింది. ముఖ్యంగా "థిల్లానా థిల్లానా" సాంగ్ అప్పట్నుంచి ఇప్పటికీ సంగీత ప్రియులను అలరిస్తూనే ఉంది.
రజనీ సరసన మీనా తొలిసారి నాయికగా నటించిన సినిమా 'యజమాన్' (1993). తెలుగులో ఆ సినిమాని 'రౌడీ జమీందార్'గా డబ్ చేసి రిలీజ్ చేశారు. మొదట ఆ సినిమా చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు మీనా. కారణం.. అంతకుముందు 'అన్బుళ్ల రజనీకాంత్' సినిమాలో రజనీతో పాటు బాలతారగా నటించిన ఆమె, అప్పుడాయనను "అంకుల్.. అంకుల్" అంటూ పిలిచేవారు. ఆ సినిమాలోని ఆమె పాల్గొన్న సన్నివేశాల్లో అత్యధిక భాగం రజనీ ఇంటిలోనే చిత్రీకరించారు. అలాంటిది 'యజమాన్'లో ఆయనతో రొమాన్స్ చేయాలంటే చాలా ఇబ్బందిగా, సిగ్గుగా అనిపించింది. ఇంకోవైపు హీరోయిన్‌గా కెరీర్ స్టార్టింగ్‌లోనే సూపర్‌స్టార్ అయిన ఆయనకు జంటగా నటిస్తున్నాననే ఆనందం కూడా ఆమెలో ఉంది.
'అప్పుడు అంకుల్ అని పిలిచేదాన్ని కదా, ఇప్పుడు ఏమని పిలవాలి?' అని సంకోచపడ్డారు మీనా. రొమాంటిక్ సీన్స్ ఎలా చేయాలని ఇబ్బందిపడ్డారు. అలాగే, హీరోయిన్‌గా ఆయనతో చేయడమంటే మాటలు కాదు కదా, కరెక్టుగా చేయాలనే భయం కూడా ఆమెలో ఉంది. ఆ సినిమా మొదటి రోజు షూటింగ్ రాజమండ్రిలో జరిగింది. ఆమె పూవులు కోయడానికి వెళ్లి కిందపడిపోవటాన్ని తొలి దృశ్యంగా చిత్రీకరించారు. ఫస్ట్ షాట్ పూర్తికాగానే మీనాకు "కంగ్రాచ్యులేషన్స్" చెప్పారు రజనీ. ఆమె "థాంక్స్ సార్" అని చెప్పినా, ఆ షెడ్యూల్ పూర్తయ్యేదాకా భయం భయంగానే ఉన్నారామె. ఆయన సపోర్టుతో ఆ భయాన్ని పోగొట్టుకొని నటించారు. తర్వాత 'ముత్తు' సినిమా ఆ ఇద్దరి జోడీకి సూపర్ పాపులారిటీ తీసుకొచ్చింది.