Read more!

English | Telugu

ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ గురించి చాలామందికి తెలీని విష‌యాలు!

 

కామెడీ సినిమాలు, యాక్ష‌న్ సినిమాలు, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్స్ తీసి డైరెక్ట‌ర్‌గా ఆల్‌రౌండ‌ర్ అనిపించుకున్న వ్య‌క్తి ఇ.వి.వి. స‌త్య‌నారాయ‌ణ‌. ప‌లు హీరోల‌కు బ్లాక్‌బ‌స్ట‌ర్స్ అందించిన ఆయ‌న కేన్స‌ర్ బారిన‌ప‌డి అకాల మృత్యువాత‌ప‌డ్డారు. లేదంటే మ‌రెన్నో వినోదాత్మ‌క చిత్రాలు ఆయ‌న మేధ‌స్సు నుంచి పుట్టేవే. ఆయ‌న సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చారు, ఎవ‌రి ద‌గ్గ‌ర ఎలా ప‌నిచేశార‌నే విష‌యాలు చాలామందికి తెలీవు. ఆస‌క్తిక‌ర‌మైన ఆ విష‌యాలు మీకోసం...

స‌త్య‌నారాయ‌ణ స్వ‌స్థ‌లం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా కొవ్వూరు స‌మీపంలోని దొమ్మేరు. వారిది మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబం. ఆయ‌న నిడ‌ద‌వోలులో చ‌దువుకున్నారు. చ‌దువుకొనే రోజుల నుండే ఆయ‌న‌కు సినిమా పిచ్చి ఉండేది. సినిమాలు చూస్తూ, వాటిని విశ్లేషిస్తూ ఉండేవారు. నిర్మాత న‌వ‌తా కృష్ణంరాజుకు తెలిసిన ఓ వ్య‌క్తి వాళ్ల ఊరిలో ఉన్నారు. ఆయ‌న‌తో రిక‌మండేష‌న్ లెట‌ర్ రాయించుకొని, ఒక‌రోజు మ‌ద్రాసు రైలెక్కేశారు స‌త్య‌నారాయ‌ణ‌. మ‌ద్రాస్ సెంట్ర‌ల్ స్టేష‌న్‌లో దిగి, నేరుగా న‌వ‌తా కృష్ణంరాజు గారింటికి వెళ్లారు. 

స‌త్యనారాయ‌ణ‌ను కృష్ణంరాజు ఎంత నిరుత్సాహ‌ప‌ర‌చాలో అంత నిరుత్సాహ‌ప‌రిచారు. "ఈ సినిమాగోల ఎందుకు? ఇక్క‌డ ఎవ‌రికో ఒక‌రికి త‌ప్ప ఫ‌లితం రాదు" అని చెప్పారు. కానీ స‌త్య‌నారాయ‌ణ గ‌ట్టి ప‌ట్టుద‌ల చూపించారు. అప్పుడు దేవ‌దాస్ క‌న‌కాల 'ఓ ఇంటి బాగోతం' సినిమాని డైరెక్ట‌ర్ చేస్తున్నారు. ఆయ‌న ద‌గ్గ‌ర స‌త్య‌నారాయ‌ణ‌ను అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా చేర్పించారు న‌వ‌తా కృష్ణంరాజు. అలా డైరెక్ష‌న్‌కు సంబంధించిన ఓన‌మాలు దేవ‌దాస్ ద‌గ్గ‌ర నేర్చుకున్నారు స‌త్య‌నారాయ‌ణ‌. త‌న‌వ‌ద్ద స‌హాయ‌కులుగా ప‌నిచేసే వారంద‌రికీ అన్ని విష‌యాలు క్షుణ్ణంగా చెప్పేవారు దేవ‌దాస్‌. పైగా ఆయ‌న మంచి న‌టుడు కూడా. దాంతో చాలా విష‌యాలు ఆయ‌న ద‌గ్గ‌ర నేర్చుకున్నారు. దేవ‌దాస్ ద‌గ్గ‌ర ఆయ‌న నాలుగు సినిమాల‌కు ప‌నిచేశారు. 

ఆ త‌ర్వాత అప్ప‌టి అగ్ర ద‌ర్శ‌కుల్లో ఒక‌రైన వి. మ‌ధుసూద‌న‌రావు హైద‌రాబాద్‌లో మ‌ధు ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ పెడితే, దానికి ప్రిన్సిపాల్‌గా వెళ్లారు దేవ‌దాస్ క‌న‌కాల‌. అప్పుడు జంధ్యాల ద‌గ్గ‌ర 'నాలుగు స్తంభాలాట' సినిమాకు అసోసియేట్ డైరెక్ట‌ర్‌గా చేర్పించారు న‌వ‌త కృష్ణంరాజు. అప్ప‌ట్నుంచీ జంధ్యాల ద‌గ్గ‌ర 23 సినిమాల‌కు ప‌నిచేశారు స‌త్య‌నారాయ‌ణ‌. ఫ‌లితంగా జంధ్యాల శిష్యుడిగా ఇండ‌స్ట్రీలో ఆయ‌న‌కు బాగా గుర్తింపు ల‌భించింది. కామెడీ పాయింట్‌ను శ్రుతిమించ‌కుండా ఎలా తీస్తే ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌కు నోచుకుంటుంద‌నే విష‌యం జంధ్యాల నుంచే ఆయ‌న ఆక‌ళింపు చేసుకున్నారు.

జంధ్యాల ద‌గ్గ‌ర‌కు రాక‌ముందు స‌త్య‌నారాయ‌ణ దృష్టి కేవ‌లం ద‌ర్శ‌క‌త్వం మీదే ఉండేది. జంధ్యాల వ‌ద్ద‌కు వ‌చ్చాక క్ర‌మంగా ఆయ‌న దృష్టి ర‌చ‌న‌వైపు మ‌ళ్లింది. ఆ స్ఫూర్తితో అప్పుడ‌ప్పుడు క‌థ‌లు రాసి ప‌త్రిక‌ల‌కు పంపేవారు. అయితే వాటిలో అత్య‌ధికం ప్ర‌చుర‌ణ‌కు అన‌ర్హ‌మైన‌విగా వెన‌క్కి తిరిగి వ‌చ్చేవి. అలా తిరిగివ‌చ్చిన వాటిలో 'ఆడే మ‌గైతే' అనే క‌థ ఒక‌టి. ఈ క‌థ‌ను 'మొగుడు - పెళ్లాలు' సినిమా షూటింగ్ స‌మ‌యంలో జంధ్యాలకు చెప్పారు స‌త్య‌నారాయ‌ణ‌. ఆయ‌న విని, "బాగుంది స‌త్యం.. త‌ర్వాత వాడ‌దాం" అన్నారు. కానీ అది జ‌ర‌గ‌లేదు. త‌ను డైరెక్ట‌ర్ అయ్యాక ఆ క‌థ‌ను ఆధారం చేసుకొని సినిమా తీశారు స‌త్య‌నారాయ‌ణ‌. అది సూప‌ర్ డూప‌ర్ హిట్ట‌యింది. ఆ సినిమా న‌రేశ్‌, ఆమ‌ని జంట‌గా న‌టించిన‌.. 'జంబ‌ల‌కిడిపంబ' (1992).

సినిమాటోగ్రాఫ‌ర్ ఎం.వి. ర‌ఘు డైరెక్ట్ చేసిన ఫ‌స్ట్ ఫిల్మ్ 'క‌ళ్లు'కు అసోసియేట్ డైరెక్ట‌ర్‌గా వ‌ర్క్ చేశారు స‌త్య‌నారాయ‌ణ‌. క‌మ‌ల్ హాస‌న్‌, విజ‌య‌శాంతి జంట‌గా న‌టించిన 'ఇంద్రుడు చంద్రుడు' సినిమాకు డైరెక్ట‌ర్ సురేశ్‌కృష్ణ ద‌గ్గ‌ర ప‌నిచేశాక‌, రాజేంద్ర‌ప్ర‌సాద్ హీరోగా న‌టించిన 'చెవిలో పువ్వు' (1990) సినిమాతో డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌య‌మ‌య్యారు. అది క‌మ‌ర్షియ‌ల్‌గా హిట్ కాక‌పోయినా, ద‌ర్శ‌కుడిగా ప్ర‌శంస‌లు ల‌భించాయి. అయితే రెండో సినిమా, డి. రామానాయుడు నిర్మించిన 'ప్రేమ‌ఖైదీ' (1990) ఘ‌న‌విజ‌యం సాధించ‌డంతో ఈవీవీ వెన‌క్కి తిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం క‌లగ‌లేదు.

అప్పుల అప్పారావు, సీతార‌త్నంగారి అబ్బాయి, ఆ ఒక్క‌టీ అడ‌క్కు, వార‌సుడు, జంబ‌ల‌కిడి పంబ‌, హ‌లో బ్ర‌ద‌ర్‌, అబ్బాయిగారు, ఆమె, ఆయ‌న‌కి ఇద్ద‌రు,  అల్లుడా మ‌జాకా, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, మా నాన్న‌కి పెళ్లి, క‌న్యాదానం, సూర్య‌వంశం, చాలా బాగుంది, కిత‌కిత‌లు, అత్తిలి స‌త్తిబాబు ఎల్‌కేజీ, బెండు అప్పారావు ఆర్ఎంపీ, క‌త్తి కాంతారావు లాంటి సినిమాలు తీసిన ఆ ప్ర‌తిభావంతుడైన ద‌ర్శ‌కుడు గొంతు కేన్స‌ర్‌కు గురై, 54 ఏళ్ల వ‌య‌సులోనే త‌న‌ను న‌మ్ముకున్న వాళ్ల‌ను, త‌న‌ను అభిమానించేవాళ్ల‌ను వ‌దిలేసి 2011 జ‌న‌వరి 21న‌ వెళ్లిపోయారు.