English | Telugu

కాస్త‌యితే గౌత‌మి కొండ‌మీంచి ప‌డిపోయేవారే!

 

న‌టి గౌత‌మి కెరీర్ తొలినాళ్ల‌లో 'ఏళు సుత్తిన కోటే' అనే క‌న్న‌డ సినిమా కోసం చిక్‌మంగ‌ళూరు ద‌గ్గ‌ర‌లో ఉన్న‌ కుద్రేముఖ్‌కు ఔట్‌డోర్ షూట్ కోసం వెళ్లారు. క్లైమాక్స్ సీన్‌ను చిత్రీక‌రిస్తున్నారు. హీరో అంబ‌రీష్ (న‌టి సుమ‌ల‌త భ‌ర్త‌) రోడ్డు మీద న‌డుస్తూ ఉంటే, హీరోయిన్ అయిన గౌత‌మి కొండ మీద నుంచి ఆయ‌న‌ను పిలుస్తూ కింద‌కు దిగాలి. ఇదీ సీన్‌. గౌత‌మి కొండ‌మీద నిల్చున్నారు. కింద కెమెరా ఫిక్స్ చేశారు. డైరెక్ట‌ర్ గౌరీశంక‌ర్ "స్టార్ట్ కెమెరా.. యాక్ష‌న్" అని కేక పెట్టారు. 

గౌత‌మి ఆ కొండమీద నుంచి హీరోను పిలుస్తూ కింద‌కు దిగుతున్నారు. ఆ కొండ‌మీద గోతులు, రాళ్లు, ముళ్లు, పిచ్చిమొక్క‌లు లాంటివి అడుగ‌డుగునా ఉన్నాయి. దాంతో ఆమెకు దిగ‌డం కొంచెం క‌ష్ట‌మైంది. అందులోనూ ఆమె సంప్ర‌దాయ‌బ‌ద్ధ‌మైన చీర‌క‌ట్టులో ఉన్నారు. డైరెక్ట‌ర్ "యాక్ష‌న్" అన‌గానే గ‌బ‌గ‌బా ప‌రిగెత్తుతూ కొండ‌దిగే స‌మ‌యంలో ఓ రాయి కాలికి త‌గిలి, కింద‌ప‌డ‌బోయి త‌మాయించుకున్నారు. అయితే అప్పుడే చీర కుచ్చిళ్లు కాళ్ల‌కింద ప‌డ్డాయి. దాంతో ఆమె ముందుకు తూలారు.

వెంట‌నే కాస్త అవ‌త‌ల ఉన్న యూనిట్ మెంబ‌ర్ ఒక‌రు వేగంగా వ‌చ్చి ఆమెను ప‌ట్టుకొని, కొండ‌మీంచి కింద‌కు జారిప‌డ‌కుండా కాపాడారు. లేక‌పోతే ఆ రోజు ఆమె ప‌ల్టీలుకొట్టి, రోడ్డుమీద ప‌డేవారే! దాదాపు ప్రాణాపాయం త‌ప్పింద‌న్న మాట‌. ఆ రోజు జ‌రిగిన ఘ‌ట‌న త‌ల‌చుకున్న‌ప్పుడ‌ల్లా ఆమెకు ఓ వైపు భ‌యం, మ‌రోవైపు థ్రిల్ క‌లుగుతూ ఉంటాయి.