English | Telugu
దాసరిని తక్కువ అంచనావేసి, 'తాత మనవడు' చెయ్యనంటే చెయ్యనన్న శోభన్‌బాబు!
Updated : Jul 13, 2021
దాసరి నారాయణరావు డైరెక్టర్‌గా పరిచయమైన చిత్రం 'తాత మనవడు' (1973). ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కె. రాఘవ నిర్మించిన తొలి చిత్రం కూడా అదే. అందులో టైటిల్ రోల్స్‌ను ఎస్వీ రంగారావు, రాజబాబు పోషించారు. నిజానికి రాజబాబు క్యారెక్టర్‌ను శోభన్‌బాబు చెయ్యాల్సింది. ఆ పాత్రను రాఘవ ఆఫర్ చేసినప్పుడు శోభన్‌బాబు చెయ్యనని చెప్పేశారు. "డైరెక్టర్ కొత్తవాడు. దయచేసి నాతో ఎక్స్‌పెరిమెంట్ చేయొద్దు. అనుభవంలేని దర్శకుడు ఏం తీస్తాడో తెలీదు. తర్వాత పిక్చరు చేద్దాం." అని తప్పించుకున్నారు.
దాంతో రాజబాబును పెట్టి తీశారు దాసరి. 'తాత మనవడు' అప్పట్లో సెన్సేషనల్ హిట్టయింది. దాంతో దాసరిని తక్కువ అంచనా వేసినందుకు శోభన్‌బాబు బాధపడ్డారు. ఆ తర్వాత నుంచి దాసరి నుంచి ఏ ఆఫర్ వచ్చినా ఎప్పుడూ వెంటనే కాదని చెప్పలేదు. డేట్స్ అడ్జస్ట్ అవడం కష్టమైతే తప్ప ఆయన సినిమాలు చేసుకుంటూ వచ్చారు. ఆయనను ఎన్నడూ స్క్రిప్టు అడిగిన పాపాన కూడా పోలేదు. అంతేకాదు, ఒకరినొకరు "బావా బావా" అనుకునేంత సన్నిహితత్వం ఆ ఇద్దరి మధ్య ఏర్పడింది. ఇద్దరూ సెట్‌లో ఉంటే చాలా సరదాగా ఉండేది.
వాళ్ల కాంబినేషన్‌లో వచ్చిన తొలి సినిమా 'బలిపీఠం' బ్లాక్‌బస్టర్ హిట్టయింది. అది దాసరికి తొలి రంగుల చిత్రం. ఆ తర్వాత వచ్చిన 'గోరింటాకు' మరింత హిట్. దీపారాధన, కృష్ణార్జునులు, స్వయంవరం, జగన్, అభిమన్యుడు, ధర్మపీఠం దద్దరిల్లింది చిత్రాలు వారి కాంబినేషన్‌లో వచ్చాయి.