Read more!

English | Telugu

సెట్‌లో త‌న ప్లేస్‌లో బాల‌కృష్ణ‌ను చూసి షాకైన చంద్ర‌మోహ‌న్‌!

 

న‌ట‌ర‌త్న నంద‌మూరి తార‌క‌రామారావు, ముర‌ళీమోహ‌న్‌, బాల‌కృష్ణ అన్న‌ద‌మ్ములుగా న‌టించిన చిత్రం 'అన్న‌ద‌మ్ముల అనుబంధం' (1975). హిందీ హిట్ ఫిల్మ్ 'యాదోం కీ బారాత్' (1973)కు ఈ మూవీ రీమేక్‌. య‌స్‌.డి. లాల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బాగా ఆడింది. ఆ సినిమాలోని "ఆనాటి హృద‌యాల ఆనంద గీతం ఇదేలే" పాట చాలా కాలం పాటు జ‌నం నోట నానింది. ఈ సినిమాకు సంబంధించిన ఒక విశేష‌మేమంటే.. నిజానికి ముగ్గురు అన్న‌ద‌మ్ముల్లో చిన్న‌వాడి క్యారెక్ట‌ర్‌కు మొద‌ట ఎంపికైంది చంద్ర‌మోహ‌న్‌. షూటింగ్‌కు కూడా ఆయ‌న హాజ‌ర‌య్యారు. కానీ మాట మాత్రం చెప్పాపెట్ట‌కుండా ఆయ‌న‌ను తీసేసి, ఆ పాత్ర‌ను బాల‌కృష్ణ‌తో చేయించారు. ఇది చంద్ర‌మోహ‌న్‌కు తీవ్ర మ‌న‌స్తాపం క‌లిగించింది. తీవ్ర అవ‌మానానికి గురైన‌ట్లు ఆయ‌న భావించారు. అయితే ఆ సినిమా త‌ప్పిపోవ‌డం, మ‌రో మంచి అవ‌కాశాన్ని క‌ల్పించింది.. అది ఏకంగా ఎంజీఆర్ త‌మ్ముడిగా మంచి పాత్ర‌ను చేసే అవ‌కాశం! అవును. 

"ఆనాటి హృద‌యాల ఆనంద గీతం ఇదేలే" స్టేజ్ సాంగ్‌కు కొరియోగ్ర‌ఫీ స‌మ‌కూర్చింది సుంద‌రం మాస్ట‌ర్‌. ఆ సాంగ్‌కు సుంద‌రం ఆధ్వ‌ర్యంలో చంద్ర‌మోహ‌న్‌కు ప‌దిహేను రోజుల పాటు ట్రైనింగ్ ఇప్పించారు నిర్మాత పీతాంబరం (ఆ రోజుల్లో ఎన్టీఆర్ ప‌ర్స‌న‌ల్ మేక‌ప్‌మ్యాన్ కూడా). అడ్వాన్స్ ఇచ్చారు. డ్ర‌స్సులు కూడా కుట్టించారు. మ‌ద్రాస్ వాహినీ స్టూడియోలోని ఆరో ఫ్లోర్‌లో షూటింగ్ పెట్టారు. చంద్ర‌మోహ‌న్ త‌న కారులో ఇంటి నుంచి బ‌య‌లుదేరి స్టూడియోకు వ‌చ్చారు. మేక‌ప్ రూమ్‌లోకి వెళ్లి కూర్చున్నారు. మేక‌ప్ వేయడానికి ఎవ‌రూ రాలేదు. పీతాంబ‌రం కోసం చూశారు చంద్ర‌మోహ‌న్‌. ఆయ‌న క‌నిపించ‌లేదు. అంత‌లో సెట్లోంచి సాంగ్ వినిపించింది. డాన్స్ మాస్ట‌ర్లు ఏమైనా రిహార్స‌ల్స్ చేసుకుంటున్నారేమో అని మొద‌ట అనుకున్నారు చంద్ర‌మోహ‌న్‌.

ఎంత‌సేప‌టికీ ఎవ‌రూ రాక‌పోతుండ‌టంతో, చూద్దామ‌ని సెట్ డోర్ ఓపెన్ చేసి చూశారు. అచ్చం చంద్ర‌మోహ‌న్ వేసుకున్న డ్ర‌స్సును ఎవ‌రో కుర్రాడు వేసుకొని, గిటార్ ప‌ట్టుకొని డాన్స్ చేస్తూ క‌నిపించాడు. మొద‌ట ఎవ‌రో డూప్ కాబోలు అనుకున్నారు. త‌ర్వాత అక్క‌డున్న వాళ్లు చెప్పారు, అత‌నెవ‌రో కాదు, ఎన్టీఆర్ గార‌బ్బాయి బాల‌కృష్ణ అని. 'బాల‌కృష్ణ‌కు ఆ వేష‌మేంటి? ఇంత‌దాకా నాకెవ‌రూ చెప్ప‌లేదే!' అన్నారు చంద్ర‌మోహ‌న్‌. అప్ప‌టికి చిన్న‌గా అనుమానం వ‌చ్చింది. కాసేప‌ట్లో త‌ను సెట్‌కు వెళ్లాల్సివుండ‌గా, త‌న ప్లేస్‌లో ఇంకొక‌రు ఉండ‌ట‌మేంటి? ఒక ఆర్టిస్టుకు ఇంత‌కంటే బ్యాడ్ ఎక్స్‌పీరియెన్స్ ఇంకేముంటుంది? అనుకున్నారు.

స‌రే చూద్దామ‌ని రూమ్‌లో అలాగే కూర్చున్నారు చంద్ర‌మోహ‌న్‌. కొంత‌సేప‌య్యాక పీతాంబ‌రం వ‌చ్చారు. రాగానే, "సార్‌.. మీరు ఇంటికెళ్లండి. నేను వ‌చ్చి మాట్లాడ‌తాను. చిన్న పొర‌పాటు జ‌రిగింది." అన్నారాయ‌న‌. "ఏం జ‌రిగింది సార్?" అన‌డిగారు చంద్ర‌మోహ‌న్‌. "ఇప్పుడిక్క‌డ ఆ విష‌యాలు వ‌ద్దు. న‌న్ను మ‌న్నించండి." అని చేతులు జోడించారు. అంత పెద్దాయ‌న అలా అనేస‌రికి, స‌రేన‌ని ఇంటికెళ్లిపోయారు చంద్ర‌మోహ‌న్‌. 

సాయంత్రం షూటింగ్ అయ్యాక చంద్ర‌మోహ‌న్ ఇంటికి వ‌చ్చారు పీతాంబ‌రం. "రామారావుగారు త‌న బ్ర‌ద‌ర్‌గా బాల‌కృష్ణ వేస్తాడ‌ని చెప్పారు. మీకు ఎన్ఏటీ బ్యాన‌ర్‌లో మంచి వేషం ఇస్తామ‌న్నారు. నేను ఆయ‌న‌ను క‌న్విన్స్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించాను కానీ ఆయ‌న ప‌ట్టుప‌ట్టారు." అని చెప్పి వెళ్లిపోయారు. మ‌రుస‌టి రోజు ఉద‌యం ఎన్టీఆర్ స‌న్నిహితుడు, నిర్మాత‌ పుండ‌రీకాక్ష‌య్య వ‌చ్చారు. రామారావుగారు మీకు ఎన్ఏటీలో మంచి వేషం ఇస్తామ‌ని చెప్పార‌న్నారు. చంద్ర‌మోహ‌న్‌కు కోపం వ‌చ్చేసింది. "ఇంక నా ద‌గ్గ‌ర రామారావుగారి మాట వినిపించ‌డానికి వీల్లేదు. ఎన్ఏటీ వ‌ద్దు, ఏం వ‌ద్దు. ఇంత ద్రోహం చేస్తారా?  స్టూడియోకు వ‌చ్చిన ఆర్టిస్టుకు ఈ ఖ‌ర్మ తీసుకువ‌స్తారా" అనేశారు.

ఆ త‌ర్వాత రోజు మ‌ళ్లీ పీతాంబ‌రం వచ్చి, "అన్న‌ద‌మ్ముల అనుబంధం సినిమాను త‌మిళంలో ఎంజీఆర్‌తో తీస్తున్నాం. అందులో ఆయ‌న త‌మ్ముడిగా మీరు న‌టించండి" అని చెప్పారు. ఎంజీఆర్‌ను క‌లిశాక‌, జ‌రిగిన విష‌యం ఆయ‌న‌కు చెప్పారు చంద్ర‌మోహ‌న్‌. "అలా జ‌రిగిందా?  మిమ్మ‌ల్ని నేను ఎంక‌రేజ్ చేస్తాను." అని ఆయ‌న భుజం త‌ట్టారు ఎంజీఆర్‌. ముగ్గురు అన్న‌ద‌మ్ముల్లో మొద‌టి ఇద్ద‌రి పాత్ర‌ల‌ను ఎంజీఆరే చేయ‌గా, చిన్న‌వాడి పాత్ర‌ను చంద్ర‌మోహ‌న్ చేశారు. ఆయ‌న‌కు ఆ సినిమా చాలా మంచి పేరు తెచ్చింది. ఈ విష‌యాల‌ను చంద్ర‌మోహ‌న్ స్వ‌యంగా ఒక ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు.