Read more!

English | Telugu

హీరోయిన్‌గా ప‌రిచ‌యం చేయ‌డానికి రాధ ఇంటికి స్వ‌యంగా వెళ్లిన భార‌తీరాజా!

 

తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళం భాష‌ల్లో అగ్ర హీరోయిన్‌గా వెలిగారు రాధ‌. ఆమె స్వ‌త‌హాగా మ‌ల‌యాళీ. ఆమె న‌టిగా ఇండ‌స్ట్రీలోకి రాక ముందే ఆమె అక్క అంబిక హీరోయిన్‌గా మంచి పేరు పొందారు. అప్ప‌టికి రాధ ఇంకా చిన్న‌ది. అయినా ఆమెను కూడా సినీ న‌టిని చెయ్యాల‌నే ఉద్దేశంతో ఆమె త‌ల్లి ఆమెకు డాన్స్ నేర్పించారు. న‌టీన‌టులు ఎలా మేక‌ప్ వేసుకుంటారు?  సెట్లో కెమెరా ముందు ఎలా న‌టిస్తారు?  లాంటి విష‌యాల‌పై అవ‌గాహ‌న‌, ఆస‌క్తి ఏర్ప‌డ‌టానికి రాధ‌ను కూడా అంబిక‌తో పాటు షూటింగ్స్‌కు తీసుకువెళ్లేవారు వాళ్ల‌మ్మ‌. అక్క‌డ జ‌రిగే ప్ర‌తి అంశాన్నీ క్షుణ్ణంగా వివ‌రించి చెప్పేవారు. అలా క్ర‌మంగా న‌ట‌న‌పై ఆస‌క్తిని క‌లిగించారామె.

ఇక రాధ‌ను న‌టిగా ప‌రిచ‌యం చేయ‌డ‌మే కాకుండా, ఆమెలోని ఉత్త‌మ న‌టిని బ‌య‌ట‌కు వెలికితీసింది సుప్ర‌సిద్ధ ద‌ర్శ‌కుడు భార‌తీరాజా. ఆయ‌న 'అలైగ‌ళ్ ఓయ‌వుదిల్లై' (తెలుగులో 'సీతాకోక‌చిలుక‌') త‌మిళ సినిమాలో హీరోయిన్ క్యారెక్ట‌ర్‌కు కొత్త న‌టి కోసం అన్వేషిస్తున్న రోజుల్లో ఎడిట‌ర్ ప్ర‌కాశ్ ఒక‌సారి రాధ వాళ్ల ఇంటికి వ‌చ్చారు. రాధ‌, ఆమె అక్క‌లు మ‌ల్లిక‌, అంబిక క‌లిసి తీయించుకున్న ఫొటో చూసి, "ఈ ఫొటో భార‌తీరాజాగారికి చూపిస్తాను. మీ మూడో అమ్మాయికి ఆయ‌న చిత్రంలో మంచి అవ‌కాశం ల‌భించ‌వ‌చ్చు" అని చెప్పారు.

అలాగే ఆయ‌న ఆ ఫొటో భార‌తీరాజాకు చూపించ‌డం, ఆయ‌న రాధ ఫొటో చూసి, "ఓకే ఈ అమ్మాయి బాగుంది.. ఎవ‌రు? ఎక్క‌డుంటారు?" అనే వివ‌రాలు తెలుసుకున్నారు. ఆ త‌ర్వాత కెమెరామేన్ క‌ణ్ణ‌న్‌ను వెంట‌పెట్టుకొని రాధ‌వాళ్ల ఊరు తిరువ‌నంత‌పురంకు స్వ‌యంగా వెళ్లారు భార‌తీరాజా. రాధ వాళ్లింటికి వెళ్లి ఆమెను చూసి, త‌న హీరోయిన్ ఆమే అని నిర్ణ‌యించుకొని, మ‌ద్రాస్ ర‌మ్మ‌ని చెప్పారు.

ఆయ‌న చెప్పిన‌ట్లు మ‌ద్రాస్‌లోని ప్ర‌సాద్ రికార్డింగ్ థియేట‌ర్‌లో ఆయ‌న‌ను క‌లుసుకుంది రాధ‌. 'అలైగ‌ళ్ ఓయ‌వుదిల్లై' సినిమా నిర్మాత భాస్క‌ర్‌, సుప్ర‌సిద్ధ సంగీత ద‌ర్శ‌కుడు ఇళ‌య‌రాజాకు సోద‌రుడు. ఆ సంద‌ర్భంలోనే భార‌తీరాజా, భాస్క‌ర్‌, "ఈ కొత్త‌ అమ్మాయే మ‌న సినిమాలో హీరోయిన్" అని ఇళ‌య‌రాజాకు ప‌రిచ‌యం చేశారు. అలా ఆ సినిమాలో న‌టించ‌డం ద్వారా హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మైన రాధ‌, తొలి సినిమాతోటే ఉత్త‌మ‌న‌టి అవార్డును అందుకోవ‌డం విశేషం.

ఆ త‌ర్వాత కాలంలో ఎన్నో చిత్రాల్లో న‌టించి, 'రాధ కేవ‌లం గ్లామ‌ర‌స్ యాక్ట్రెస్' అని ముద్ర‌ప‌డిన సంద‌ర్భంలో 'ముద‌ల్ మ‌రియాదై' (తెలుగులో 'ఆత్మ‌బంధువు') త‌మిళ చిత్రం ద్వారా 'రాధ కేవ‌లం గ్లామ‌ర్ పాత్ర‌ల‌కే ప‌రిమితం కాదు. మంచి అవ‌కాశం ల‌భిస్తే గ్లామ‌ర్ ప్రాధాన్యంలేని ప‌ర్ఫార్మెన్స్‌కు అవ‌కాశం ఉన్న ఎలాంటి పాత్ర‌నైనా పోషించి, న్యాయం చేకూర్చి రాణించ‌గ‌ల శ‌క్తిసామ‌ర్థ్యాలున్న న‌టి' అని నిరూపించింది కూడా భార‌తీరాజే!