Read more!

English | Telugu

సీఏ పాస‌వ్వాలంటే ఫొటో పంపాలంటూ విజ‌య‌శాంతికి ఉత్త‌రం రాసిన అభిమాని!

 

హీరోలు కానీ, హీరోయిన్లు కానీ ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎంత పేరు ప్ర‌ఖ్యాతులు, డ‌బ్బు సంపాదించినా అభిమానుల‌కు ఒరిగేదేమీ ఉండ‌దు. అయినా తాము ఆరాధించే తార‌ల‌ను వారు ఆరాధిస్తూ, ఆత్మీయ‌త కురిపిస్తూ, త‌మ కుటుంబ స‌భ్యుల్లో ఒక‌రిగా ప‌రిగ‌ణిస్తూ అభిమానాన్ని ప్ర‌ద‌ర్శిస్తుంటారు. అభిమానుల అంత‌రంగం అంచ‌నా వెయ్య‌డానికి వీలు కానిది, వెల‌క‌ట్ట‌డానికి వీలు లేనిది. త‌మ అభిమాన హీరోల‌ను అన్న‌య్యా అనీ, హీరోయిన్ల‌ను అక్క‌య్యా అని సంబోధిస్తూ ఒక‌ప్పుడు వారికి ఉత్త‌రాలు రాసేవారు అభిమానులు.

అలా లేడీ అమితాబ్ విజ‌య‌శాంతికి ఓ బెంగ‌ళూరు అభిమాని నుంచి ఓ విచిత్ర‌మైన ఉత్త‌రం వ‌చ్చింది. త‌ను సీఏ (చార్ట‌ర్డ్ అకౌంటెన్సీ) పాస‌వ్వాలంటే, ఆమె రిప్లై ఇవ్వాల‌నీ, ఆ రిప్లైలో ఫొటో పంపాల‌నీ రాశాడు. విజ‌య‌శాంతి అందుకున్న ఆ ఉత్త‌రంలో ఏముందంటే...

"ప్రియ‌మైన విజ‌యశాంతి గారికి,
నేను బికామ్ పాస‌య్యాను. ప్ర‌స్తుతం చార్ట‌ర్డ్ అకౌంటెన్సీ చేస్తున్నాను. నాకు స్త్రీల‌తో స్నేహం చెయ్య‌డం అంటే చాలా ఇష్టం. అందుకు కార‌ణం - వారి స్నేహం ద్వారా, ఆ స్నేహం క‌లిగించే ప్రేర‌ణ ద్వారా జీవితంలో నేను అనుకున్న‌ది సాధించ‌గ‌ల‌న‌నే న‌మ్మ‌కం. నాకు ఒక స్నేహితురాలు ఉంది. ఆమె కూడా చార్ట‌ర్డ్ అకౌంటెన్సీ చేస్తోంది. మేమిద్ద‌రం పోటీప‌డి చ‌దువుతున్నాం. అందుకు కార‌ణం, ఆమె నాకు ప్రేర‌ణ క‌లిగించ‌డ‌మే! ఎలాగైనా ఆ అమ్మాయి క‌న్నా మంచి మార్కులు తెచ్చుకొని సీఏ పాస‌వ్వాల‌ని నా ప‌ట్టుద‌ల‌.
అలాగే మీ స్నేహం కోరుకుంటున్నాన‌ను. మీరు ద‌య‌చేసి నా ఈ ఉత్త‌రానికి స‌మాధాన‌మిస్తూ, ఒక ఫొటో పంపిస్తే చాలు. నాకు కొండంత బ‌లం, ధైర్యం వ‌స్తాయి. త‌ప్ప‌కుండా సీఏలో మంచి మార్కుల‌తో పాస‌వుతాను. విదేశాల‌కు వెళ్ల‌డానికి కూడా నాకు అవ‌కాశాలు వ‌స్తున్నాయి. నేను విదేశాల‌కు వెళ్లాలంటే సీఏ పూర్తిచెయ్యాలి. నేను సీఏ పూర్తి చెయ్యాలంటే మీ ద‌గ్గ‌ర్నుంచి స‌మాధానం రావాలి. ఈ ఉత్త‌రానికి మీరు స‌మాధానం ఇస్తే, ఆ ప్రేర‌ణ‌తో నేను క‌ష్ట‌ప‌డి చ‌దివి సీఏ పాసై, విదేశాల‌కు వెళ్లేంత‌వ‌ర‌కూ మీకు రెండో ఉత్త‌రం నా ద‌గ్గ‌ర్నుంచి రాదు. 
న‌న్ను సీఏని చేసి, విదేశాల్లో న‌న్ను ఉన్న‌త స్థానంలో ఉంచ‌డం అనేది మీ చేతుల్లోనే ఉంది. త‌ప్ప‌కుండా స‌మాధానం ఇస్తార‌ని ఆశిస్తూ.. నా కల‌ల్ని నిజం చేస్తార‌ని విశ్వ‌సిస్తూ..

మీ
ప్రియాతి ప్రియ‌మైన అభిమాని"

ఈ ఉత్త‌రం చూడ‌గానే త‌న మీద అత‌నికున్న అభిమానాన్ని అంచ‌నా వేయ‌లేక‌పోయారు. ఆమె ఉత్త‌రం రాస్తే అత‌ను త‌ప్ప‌కుండా సీఏలో మంచి మార్కుల‌తో పాస‌వుతాడ‌ట‌. శ్ర‌మించి చ‌దివేది అత‌ను. ప‌రీక్ష‌లు రాసేది అత‌ను. ప‌రీక్ష‌లో ఇచ్చిన ప్ర‌శ్న‌ల‌కు రాసిన స‌మాధానాల‌ను బ‌ట్టి మార్కులు వేసేది మ‌రొక‌రు. దీనికీ, ఆమె ఉత్త‌రానికీ ఎక్క‌డ‌న్నా సంబంధం ఉందా! అయినా అత‌ని అభిమానం అత‌నిచేత అలా ఉత్త‌రం రాయించింద‌న్న మాట‌. ఆ అభిమానికి విజ‌య‌శాంతి రిప్లై ఇచ్చివుంటార‌నీ, ఫొటో పంపివుంటార‌నీ ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు క‌దా!