English | Telugu

ఒకప్పటి చాక్లెట్ బోయ్ హరీష్.. ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా!

హరీష్.. బాలనటుడిగా పరిచయమై ఆనక కథానాయకుడిగా ఎదిగిన ఒకప్పటి చాక్లెట్ బోయ్. ఒక తరం అగ్ర కథానాయకులు ఎన్టీఆర్, ఏయన్నార్, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంటర్టైన్ చేసిన హరీష్.. ఆపై టీనేజ్ హీరోగా 'ప్రేమ ఖైదీ' వంటి బ్లాక్ బస్టర్ మూవీతో అప్పటి యువతకి చేరువయ్యాడు. అదే చిత్రం హిందీలోనూ రీమేక్ అయి హిట్టవ్వడంతో.. బాలీవుడ్ లోనూ గుర్తింపు పొందాడు. అలాగే తమిళ, కన్నడ, మలయాళ పరిశ్రమల్లోనూ తనదైన ముద్ర వేశాడు.

ఒకవైపు సోలో హీరోగా అలరిస్తూనే.. మరోవైపు ఏయన్నార్, శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ వంటి అగ్ర కథానాయకుల చిత్రాల్లో సెకండ్ లీడ్ గానూ కనిపించాడు హరీష్. అయితే, చిన్న వయసులో వచ్చిన క్రేజ్ ని సరైన రీతిలో వాడుకోలేకపోవడంతో పాటు ఇతర భాషల్లో కొన్ని అడల్ట్ కంటెంట్ సినిమాల్లో నటించడంతో.. హరీష్ కెరీర్ క్రమంగా ట్రాక్ తప్పింది. అదేవిధంగా తెలుగు కంటే హిందీ చిత్ర పరిశ్రమపైనే ఎక్కువ దృష్టి సారించటంతో రేసులో వెనుకపడ్డాడు.  సరైన ప్లానింగ్, గైడెన్స్ లేకపోవటంతో స్టార్ డమ్ చూడాల్సిన ఈ టాలెంటెడ్ హీరో కాస్త.. సైడ్ రోల్స్ కే పరిమితమై తెరమరుగైపోయాడు.

తెలుగులో చివరిసారిగా అల్లరి నరేశ్ కథానాయకుడిగా నటించిన 'పెళ్ళయింది కానీ' (2007)లో కనిపించిన హరీష్.. 2018లో రిలీజైన హిందీ మూవీ 'ఆ గయా హీరో' (గోవిందా) తరువాత మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పై దర్శనమివ్వలేదు. కెరీర్ మొత్తమ్మీద 280కి పైగా సినిమాల్లో కనిపించిన హరీష్.. 1995లో ముంబైకి చెందిన సంగీత చుఘ్ ని పెళ్ళాడాడు. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ప్రస్తుతం ముంబయిలో ఈవెంట్స్ నిర్వహిస్తూ కాలం గడుపుతున్నాడీ ఒకప్పటి చాక్లెట్ బోయ్. 

(ఆగస్టు 1.. హరీష్ పుట్టినరోజు)