English | Telugu
సెకండ్ ఇన్నింగ్స్ కోసం వెయిట్ చేస్తున్న భానుప్రియ చెల్లెలు శాంతిప్రియ!
Updated : Jul 14, 2021
శాంతిప్రియ గుర్తున్నారా? వంశీ డైరెక్ట్ చేసిన 'మహర్షి' (1988) సినిమాలో చేసిన సుచిత్ర పాత్రతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, తొలి పాత్రతోనే ఆకట్టుకున్న నటి. ఆమె.. అప్పటి స్టార్ హీరోయిన్ భానుప్రియకు స్వయానా చెల్లెలు. దక్షిణాదితో పాటు, ఉత్తరాదితో కొంతకాలం తన గ్లామర్‌తో అలరించిన శాంతిప్రియ 27 ఏళ్లుగా సిల్వర్ స్క్రీన్‌కు దూరమయ్యారు. చివరిసారిగా ఆమె అక్షయ్ కుమార్ సరసన 'ఇక్కే పే ఇక్కా' సినిమాలో నటించారు. ఆ తర్వాత ఏ భాషలోనూ ఆమె వెండితెరపై కనిపించలేదు. మీకు గుర్తుందో, లేదో.. ఆమె 'సౌగంధ్' (1994) సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. సందర్భవశాత్తూ ఆ సినిమాతోటే అక్షయ్ కుమార్ హీరోగా పరిచయమయ్యాడు!
1969 సెప్టెంబర్ 22న రాజమండ్రిలో పుట్టారు శాంతిప్రియ. 18 సంవత్సరాల వయసులో 'ఎంగ ఊరు పాట్టుకరన్' (1987) అనే తమిళ చిత్రంతో ఆమె చిత్రరంగ ప్రవేశం చేశారు. అందులో ఆమె రామరాజన్‌తో నటించారు. ఆ తర్వాత సంవత్సరమే 'మహర్షి' చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. తమిళంలో నిశాంతి పేరుతో, తెలుగు, హిందీ భాషల్లో శాంతిప్రియ పేరుతో ఆమె నటించారు. 1995లో ఆమె 'బాజీగర్' ఫేమ్ సిద్ధార్థ్ రేను వివాహం చేసుకున్నారు. కానీ 2004లో సిద్ధార్థ్ మృతి చెందడం బాధాకరం. ఆ దంపతులకు ఇద్దరు కొడుకులు.. శుభమ్, శిష్య. భర్త మరణానంతరం వారిని తనే పెంచుతూ వచ్చారు శాంతిప్రియ.
'మహర్షి' చిత్రం తర్వాత జగపతిబాబు హీరోగా పరిచయమైన 'సింహ స్వప్నం'లో ఆమె నాయికగా నటించారు. ఆ తర్వాత రాజశేఖర్‌తో 'యమపాశం', 'శిలాశాసనం', నాగార్జునతో 'అగ్ని', రమేశ్‌బాబుతో 'కలియుగ అభిమన్యుడు', నరేశ్‌తో 'జస్టిస్ రుద్రమదేవి' లాంటి చిత్రాలు చేశారు. 'సౌగంధ్'తో బాలీవుడ్‌లోకి వెళ్లాక, ఆమె మళ్లీ తెలుగులో నటించలేదు. హిందీలో అక్షయ్ కుమార్, మిథున్ చక్రవర్తి, సన్నీ డియోల్ సరసన నటించారు. వివాహానంతరం సినిమాలకు గుడ్‌బై చెప్పిన ఆమె, 'విశ్వామిత్ర', 'ఆర్యమాన్', 'మాతా కీ చౌకీ', 'ద్వారకాధీష్ - భగవాన్ శ్రీకృష్ణ' తదితర సీరియల్స్ చేశారు. 2012 తర్వాత టెలివిజన్‌కు కూడా స్వస్తి పలికారు.
కొద్ది కాలంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులను పలకరిస్తూ వస్తున్నారు శాంతిప్రియ. అప్పుడప్పుడు తన కొడుకుల ఫొటోలను షేర్ చేస్తున్నారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను నటిగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి రెడీగా ఉన్నానని చెప్పారు. "ఇప్పుడు నేను పని, మరింత పని కోసం ఎదురుచూస్తున్నాను. మంచి నటిగా ప్రూవ్ చేసుకోవాలని ఇప్పటికీ తపిస్తున్నాను. ఒక నటిగా సెకండ్ ఇన్నింగ్స్‌లో వైవిధ్యమైన పాత్రలు చేయాలనుకుంటున్నాను." అని ఆమె తెలిపారు. చూద్దాం.. తెలుగు దర్శకులు కూడా ఆమెకు అవకాశాలు ఇస్తారో, లేదో...