English | Telugu
ఉత్తర కొరియా నుంచి గీత ఉత్తమనటి అవార్డు అందుకున్నారని మీకు తెలుసా?!
Updated : Jul 14, 2021
ఒకప్పుడు గ్లామరస్ హీరోయిన్‌గా తెలుగు సినిమాల్లో రాణించారు గీత. కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు, చిరంజీవి లాంటి అగ్ర హీరోల సరసన నాయికగా నటించిన ఆమెకు ఒక్కసారిగా అవకాశాలు తగ్గిపోయాయి. అడపాదడపా మాత్రమే ఆమె తెలుగు సినిమాల్లో కనిపిస్తూ వచ్చారు. అయితే మిగతా దక్షిణాది భాషల్లో మాత్రం ఆమెకు అవకాశాలు బాగానే వచ్చాయి. విశేషమేమంటే.. మనదేశం నుంచి అవార్డు అందుకోవడాని కంటే ముందు ఆమె ఓ అంతర్జాతీయ అవార్డును అందుకున్నారు. అదీ.. ఉత్తర కొరియా నుంచి!
ఆరోజు గీత జీవితంలో మరపురాని రోజు. మద్రాసులోని ఉత్తరకొరియా కాన్సులేట్ కార్యాలయాధికారి వాళ్ల ఇంటికి ఫోన్ చేశారు. ఫోన్‌లో ఆయన, "ఉత్తర కొరియాలో ఈ మధ్య ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగింది. ఇలా ఇతర దేశాల చలనచిత్రాలతో ఇంటర్నేషనల్ స్థాయిలో ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించడం మా దేశంలో ఇదే మొదటిసారి. ఈ విదేశీ చలనచిత్రాల్లో భారతదేశం నుంచి వచ్చిన మలయాళ చిత్రం 'పంచాగ్ని'ని ప్రదర్శించాం. ఆ చిత్రంలో నటించిన మిమ్మల్ని ఉత్తమనటిగా ఎన్నుకున్నారు. ఈ అవార్డులకై ప్రత్యేకంగా మేం ఎలాంటి సభనూ ఏర్పాటుచేయడం లేదు. అందువల్ల ఆ అవార్డును మీ ఇంటికి పంపే ఏర్పాటు చేస్తున్నాం." అని చెప్పారు. చెప్పినట్లే ఆమెకు ఉత్తరకొరియా నుంచి వెండి షీల్డు వచ్చింది.
గీతకు ఒక్కసారిగా ఎగిరి గంతేద్దామన్నంత ఆనందం కలిగింది. ఎంచేతంటే ఆమెకు ఉత్తమనటి అవార్డు రావడం అదే మొదటిసారి. అందులోనూ 'పంచాగ్ని' చిత్రంలోని తన నటన గురించి, ఆ అవార్డు గురించి ఒక మలయాళ పత్రిక, "గీత ఈ సినిమాలో ఎంతో చక్కగా నటించారు. అయినా రాష్ట్ర స్థాయిలో కానీ, జాతీయ స్థాయిలో కానీ అవార్డు రాలేదు. అయితేనేం.. వీటన్నిటికీ మించిన అంతర్జాతీయ స్థాయి అవార్డు లభించింది. మనం గుర్తించలేని మన నటి ప్రతిభను విదేశీయులు గుర్తించారు." అని రాసింది. స్వదేశంలో ఉత్తమనటిగా గుర్తింపు లభించలేదన్న బాధ ఆ తర్వాత అంటే అదే సంవత్సరం కన్నడ చిత్రం 'అరుణరాగ'లో ఆమె నటనకు కర్ణాటక ప్రభుత్వం ఇచ్చిన ఉత్తమనటి అవార్డుతో కొంతవరకు తీరింది.
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో విరివిగా నటించిన గీతకు ఒక్కసారిగా ఇక్కడ అవకాశాలు తగ్గిపోయాయన్న బాధ ఉండిపోయింది. కన్నడ, మలయాళ చిత్ర రంగాలలో మాత్రం ఆమెకు మంచి ఆదరణ లభించింది. అవార్డులూ లభించాయి. తెలుగు చిత్రాలతో అవార్డు సాధించాలన్న ఆమె ఆకాంక్ష మాత్రం నెరవేరలేదు.
(జూలై 14 గీత పుట్టినరోజు)