English | Telugu
విజయశాంతి తొలిసారిగా తన పాత్రకు వాయిస్ ఇచ్చిన సినిమా 'ఒసేయ్ రాములమ్మా'!
Updated : Jun 24, 2021
1980లోనే హీరోయిన్‌గా 'కిలాడీ కృష్ణుడు' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విజయశాంతి, తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకోవడానికి దాదాపు 17 సంవత్సరాలు పట్టిందంటే ఆశ్చర్యం కలగక మానదు. తెలుగమ్మాయి అయివుండి కూడా అంతవరకూ ఆమె చేసిన పాత్రలకు డబ్బింగ్ ఆర్టిస్టులే వాయిస్ ఇస్తూ వచ్చారు. దాసరి నారాయణరావు డైరెక్ట్ చేయగా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన 'ఒసేయ్ రాములమ్మా' మూవీలో తొలిసారి తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పారు విజయశాంతి.
అదివరకు ఎన్ని లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసినా, కర్తవ్యం చిత్రంలో ప్రదర్శంచిన నటనకు జాతీయ అవార్డు సాధించినా, ఆమె క్యారెక్టర్‌కు వేరేవాళ్లు డబ్బింగ్ చెబుతూ వచ్చారు. ఉత్తరప్రదేశ్‌లో జరిగి ఓ వాస్తవ ఘటన ఆధారంగా 'ఓసేయ్ రాములమ్మా' కథను దాసరి తయారుచేశారు. షూటింగ్ అయ్యాక రష్ చూసిన దాసరి.. రాములమ్మ పాత్రలో విజయశాంతి అభినయం చూసి, అద్భుతం అనుకున్నారు. ఆమె చేతే ఆ పాత్రకు డబ్బింగ్ చెప్పిస్తే మరింత సహజంగా ఉంటుందని భావించారు. విజయశాంతికి చెప్పి, ఆమెను ఒప్పించారు. అంతేకాదు, డబ్బింగ్ చెప్పేసమయంలో తాను కూడా అక్కడే ఉన్నారు.
విజయశాంతి సొంత గొంతు రాములమ్మ పాత్రకు మరింత బలాన్ని చేకూర్చింది. మొదట అమాయక రాములమ్మగా, తర్వాత దుండగులపై తిరుగుబాటు చేసే రాములక్కగా విజయశాంతి నటన ప్రేక్షకులను తీవ్ర భావోద్వేగానికి గురిచేసింది. అందుకే 1997 మార్చి 7న విడుదలైన ఆ చిత్రానికి అఖండ విజయం చేకూర్చి పెట్టారు. ఆ సినిమా విడుదలైన తర్వాత నుంచి విజయశాంతి ఎక్కడ కనిపించినా ఆమెను "రాములమ్మా" అని పిలవడం ప్రారంభించారంటే.. ఆ పాత్ర వారిపై కలిగించిన ప్రభావం అలాంటిది. ఈ చిత్రంలో పోలీసాఫీసర్‌గా కీలకమైన ఓ అతిథి పాత్రను సూపర్‌స్టార్ కృష్ణ చేయగా, ప్రజానాట్యమండలి గాయకుడు కొమరన్నగా దాసరి నటించారు.