English | Telugu

శార‌ద‌కు తొలిసారి 'ఊర్వ‌శి' అవార్డు అందించిన 'స్వ‌యంవ‌రం' ఛాన్స్ ఎలా వ‌చ్చిందంటే...

 

మొద‌టిసారిగా శార‌ద‌కు 'ఊర్వ‌శి' (జాతీయ ఉత్త‌మ‌న‌టి) అవార్డు అంద‌జేసిన చిత్రం.. మ‌ల‌యాళంలో వ‌చ్చిన 'స్వ‌యంవ‌రం' (1972). ఈ సినిమాలో మ‌ధు, శార‌ద హీరో హీరోయిన్లుగా చేశారు. ఆ సినిమా ప్రారంభ స‌మ‌యానికి న‌టిగా శార‌ద బిజీగా ఉన్నారు. ఒక‌రోజు మ‌ద్రాస్‌లోని ప్ర‌సాద్ స్టూడియోలో ఒక సినిమా షూటింగ్‌లో ఉండ‌గా, ఆదూర్ గోపాల‌కృష్ణ‌న్ అనే కొత్త ద‌ర్శ‌కుడు అక్క‌డ‌కు వ‌చ్చి, ఆమెకు క‌థ చెప్పారు. "ఇది చాలా మంచి పాత్ర‌. ఈ పాత్ర‌ను మీరే చెయ్యాలి." అని చెప్పారు.

క‌థ విన్న‌ప్పుడే ఆ సినిమాతో ఎవ‌రికి అవార్డు వ‌చ్చినా, రాక‌పోయినా సినిమాకు మాత్రం త‌ప్ప‌క వ‌స్తుంద‌నే న‌మ్మ‌కం శార‌ద‌కు క‌లిగింది. అదే విష‌యం ఆయ‌న‌కు చెప్పారు కూడా. ఆమె ఊహించిన‌ట్లుగానే జాతీయ ఉత్త‌మ‌చిత్రంగా అవార్డు రావ‌డ‌మే కాకుండా, డైరెక్ట‌ర్‌గా ఆదూర్ గోపాల‌కృష్ణ‌న్‌కు, సినిమాటోగ్రాఫ‌ర్‌గా మంక‌డ ర‌వివ‌ర్మ‌కూ, న‌టిగా శార‌ద‌కూ అవార్డులు ల‌భించాయి.

ఈ సినిమాకు సంబంధించి ఓ ముఖ్య‌మైన విష‌యం ఒక‌టుంది. హీరోయిన్ నిండు గ‌ర్భిణిగా ఉన్న‌ప్పుడు బిందెతో నీళ్లు తీసుకెళ్లాలి. అప్ప‌టికి శార‌ద వ‌య‌సులో చాలా చిన్న‌వారు. గ‌ర్భిణీ స్త్రీల ప్ర‌వ‌ర్త‌న ఎలా ఉంటుందనేది తెలీని వ‌య‌సు. అయిన‌ప్ప‌టికీ త‌న‌కున్న ప‌రిశీల‌నా జ్ఞానంతో, ఊహాశ‌క్తితో త‌న‌కు తానే ఊహించుకొని ఆ సీన్ చేశారు. స‌రిగ్గా అదే స‌న్నివేశం జాతీయ అవార్డుల క‌మిటీ మెంబ‌ర్స్‌ను బాగా ఆక‌ర్షించింది. ఆ అవార్డుల జ్యూరీలో మెంబ‌ర్‌గా ఉన్న ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మృణాల్ సేన్‌.. ఆ త‌ర్వాత ఎప్పుడు క‌నిపించినా ఆ స‌న్నివేశాన్ని గుర్తుచేస్తూ.. "ఆ సీన్ చాలా నేచుర‌ల్‌గా వ‌చ్చింద‌మ్మా, నాకు చాలా బాగా న‌చ్చింది." అని ఆమెతో అనేవారు.

విశేష‌మేమంటే అప్ప‌టికి కొన్ని డాక్యుమెంట‌రీలు మాత్ర‌మే తీసిన ఆదూర్ గోపాల‌కృష్ణ‌న్‌కు 'స్వ‌యంవ‌రం' తొలి ఫీచ‌ర్ ఫిల్మ్ (ఆ త‌ర్వాత దేశంలోని గొప్ప ద‌ర్శ‌కుల్లో ఒక‌రిగా కీర్తి ప్ర‌తిష్ఠ‌లు పొందారు ఆదూర్‌). విశ్వం, సీత పాత్ర‌ల్లో మ‌ధు, శార‌ద న‌ట‌న‌కు స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు ల‌భించాయి. మ‌ల‌యాళం సినిమాలో న్యూవేవ్ సినిమా మూవ్‌మెంట్‌కు ఊత‌మిచ్చిన సినిమాగా 'స్వ‌యంవ‌రం' చ‌రిత్రంలో నిలిచింది.