English | Telugu
సినిమా చరిత్రలో ఏ డైరెక్టర్‌కీ లేని ఘనత పి.సి.రెడ్డికి ఉంది.. అదేమిటో తెలుసా?
Updated : Oct 15, 2024
సినిమా పుట్టిన నాటి నుంచి ఎంతో మంది దర్శకులు వచ్చారు, వస్తూనే ఉన్నారు. ఒక్కో డైరెక్టర్‌ది ఒక్కో శైలి. వారి వారి ఆలోచనలకు అనుగుణంగా ప్రేక్షకుల్ని అలరించే సినిమాలు తీస్తూ వస్తున్నారు. పాతతరం దర్శకుల విషయానికి వస్తే ఎంతో మంది లెజెండరీ డైరెక్టర్లు ఎన్నో క్లాసిక్స్ తీశారు. ఇప్పటి తరం ప్రేక్షకులు చూసే విధంగా సినిమాలు రూపొందించారు. అలాంటి డైరెక్టర్లలో పి.సి.రెడ్డి ఒకరు. సినిమా పుట్టిన నాటి నుంచి ఇప్పటివరకు ఏ డైరెక్టర్‌కీ దక్కని అరుదైన ఘనత ఆయనకు దక్కింది. అక్టోబర్ 15 పి.సి.రెడ్డి జయంతి సందర్భంగా ఆయన సినీ జీవితంలోని కొన్ని సినీ విశేషాల గురించి, ఆ అరుదైన ఘనత గురించి తెలుసుకుందాం.
పి.సి.రెడ్డి పూర్తి పేరు పందిళ్ళపల్లి చంద్రశేఖరరెడ్డి. 1933 అక్టోబర్ 15న నెల్లూరు జిల్లాలోని అనుమసముద్రం గ్రామంలో జన్మించారు. మద్రాస్‌లో డిగ్రీ వరకు చదువుకున్న పి.సి.రెడ్డి దాదాపు 11 సంవత్సరాలు దర్శకుడు వి.మధుసూదనరావు వద్ద దర్శకత్వ శాఖలో పనిచేశారు. ఆ తర్వాత పూలరంగడు సినిమాకు ఆదుర్తి సుబ్బారావు వద్ద కోడైరెక్టర్‌గా వర్క్ చేశారు. దర్శకత్వ శాఖలో సుదీర్ఘమైన అనుభవాన్ని సంపాదించిన పి.సి.రెడ్డి తొలిసారి దర్శకత్వం వహించిన సినిమా అనూరాధ. ఈ చిత్రంలో కృష్ణ, విజయనిర్మల జంటగా నటించారు. అయితే కొంత షూటింగ్ జరిగిన తర్వాత ఈ సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత మళ్ళీ కృష్ణ హీరోగా అత్తలూ కోడళ్లు, శోభన్‌బాబు హీరోగా విచిత్ర దాంపత్యం చిత్రాలు చేశారు పి.సి.రెడ్డి. ఈ రెండు సినిమాలు 1971 ఏప్రిల్ 14న రిలీజ్ అయ్యాయి. రిలీజ్ రోజు విజయవాడలో తమ సినిమా చూసేందుకు బయల్దేరారు రెండు సినిమాల నిర్మాతలు. వారితోపాటు పి.సి.రెడ్డి కూడా ఉన్నారు.
ఒకేరోజు విడుదలైన తన సినిమాల్లో మార్నింగ్ షో ఏది చూడాలి అనేది పి.సి.రెడ్డికి పెద్ద సమస్యగా మారింది. అప్పుడు ఫస్ట్‌హాఫ్ విచిత్ర దాంపత్యం, సెకండాఫ్ అత్తలూ కోడళ్లు సినిమా చూశారు. అలా పి.సి.రెడ్డి కొత్త దర్శకుడిగా ఓ అరుదైన ఘనతను దక్కించుకున్నారు. ఈలోగా అతను మొదటిసారి దర్శకత్వం వహించిన అనూరాధ చిత్రం షూటింగ్ కూడా పూర్తయింది. 1971లోనే ఈ సినిమా కూడా విడుదలైంది. అంటే ఒక కొత్త దర్శకుడి మూడు సినిమాలు ఒకే సంవత్సరం విడుదలయ్యాయి. అత్తలూ కోడళ్లు, విచిత్ర దాంపత్యం చిత్రాలు సూపర్‌హిట్ అయ్యాయి. ముఖ్యంగా అత్తలూ కోడళ్లు హీరో కృష్ణకు మంచి టర్నింగ్ పాయింట్ అయింది. హీరో కృష్ణతో ఎక్కువ సినిమాలు చేసిన డైరెక్టర్‌గా విజయనిర్మలకు పేరుంది. ఆ తర్వాతి స్థానం పి.సి.రెడ్డిదే. కృష్ణతో 23 సినిమాలు చేశారు పి.సి.రెడ్డి. గ్రామీణ నేపథ్యంలో సినిమాలు చెయ్యడంలో పి.సి.రెడ్డికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. కృష్ణ పంచెకట్టి నటిస్తే ఆ సినిమా సూపర్‌హిట్ అనే సెంటిమెంట్ క్రియేట్ అవ్వడానికి పి.సి.రెడ్డే కారణం.
కమర్షియల్ హీరోగా మంచి స్వింగ్‌లో ఉన్న ఎన్టీఆర్‌తో ఓ వృద్ధ పాత్ర చేయించి బడిపంతులు అనే సినిమా చేసి విజయం సాధించారు పి.సి.రెడ్డి. ఆయన డైరెక్ట్ చేసిన సినిమాల్లో పాడిపంటలు, మానవుడు దానవుడు, ఇల్లు ఇల్లాలు, పట్నవాసం, నాయుడు బావ, భోగభాగ్యాలు, బంగారు భూమి, నా పిలుపే ప్రభంజనం వంటి సూపర్‌హిట్ హిట్ సినిమాలు ఎన్నో ఉన్నాయి. కృష్ణ హీరోగా నటించిన అనూరాధ చిత్రానికి తొలిసారి దర్శకత్వం వహించిన పి.సి.రెడ్డి సినీ కెరీర్ కృష్ణ ప్రధాన పాత్ర పోషించిన శాంతి సందేశంతోనే ముగిసింది. ఎ.కోదండరామిరెడ్డి, ముత్యాల సుబ్బయ్య, బి.గోపాల్, పి.ఎన్.రామచంద్రరావు, శరత్, వై.నాగేశ్వరరావు వంటి డైరెక్టర్లు పి.సి.రెడ్డి దగ్గర శిష్యరికం చేసిన వారే. పి.సి.రెడ్డి తన కెరీర్‌లో మొత్తం 80 సినిమాలకు దర్శకత్వం వహించారు. 2022 జనవరి 3న కొన్ని ఆరోగ్య సమస్యలు రావడంతో తుది శ్వాస విడిచారు. తెలుగు ప్రేక్షకులకు ఎన్నో వైవిధ్యమైన సినిమాలు అందించిన పి.సి.రెడ్డి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తోంది తెలుగువన్.