English | Telugu

లైట్‌బోయ్‌కి ‘సారీ’ చెప్పిన ‘మాయాబజార్‌’ డైరెక్టర్‌ కె.వి.రెడ్డి.. ఎందుకో తెలుసా?

పాతతరం దర్శకుల్లో కె.వి.రెడ్డికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆ తర్వాతి కాలంలో వచ్చిన ఎంతో మంది దర్శకులకు, నిర్మాతలకు టెక్నీషియన్స్‌కు కె.వి.రెడ్డి పితామహుడులాంటి వారు. ఎన్‌.టి.రామారావు వంటి నటుడు దర్శకుడిగా మారిన తర్వాత చాలా విషయాల్లో కె.వి.రెడ్డిని అనుసరించేవారు. నిర్మాతలకే గౌరవం తీసుకొచ్చిన దుక్కిపాటి మధుసూదనరావుకు కె.వి.రెడ్డి గురువుతో సమానం. కె.వి.రెడ్డి మూడు దశాబ్దాలపాటు సినీ పరిశ్రమలో కొనసాగారు. కానీ, ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు 14 మాత్రమే. వాటిలో 10 సినిమాలు సూపర్‌హిట్‌ అయి నిర్మాతలకు భారీ లాభాలను ఆర్జించి పెట్టాయి. సిఎన్‌ఎన్‌, న్యూస్‌18 సంస్థలు 2013లో భారతీయ సినిమా పుట్టిన నాటి నుంచి ఆరోజు వరకు అత్యుత్తమ సినిమాగా ఏది ఎంపిక చేస్తారు అని నిర్వహించిన పోల్‌లో ఎక్కువ శాతం ప్రజలు ‘మాయాబజార్‌’ చిత్రానికే ఓటు వేశారు.

ప్రొడక్షన్‌ మేనేజర్‌గా కెరీర్‌ ప్రారంభించి 1943 ‘భక్తపోతన’ చిత్రంతో దర్శకుడిగా మారారు కె.వి.రెడ్డి. ఈ సినిమాలో నాగయ్య ప్రధాన పాత్ర పోషించారు. ఆ తర్వాత ‘యోగి వేమన’ చేశారు. ఇందులో కూడా నాగయ్యే ప్రధాన పాత్రలో కనిపిస్తారు. ఆ తర్వాత ‘గుణసుందరి కథ’ చిత్రం తీశారు. 1951లో విడుదలైన ‘పాతాళ భైరవి’ కె.వి.రెడ్డి కెరీర్‌కి పెద్ద టర్నింగ్‌ పాయింట్‌గా చెప్పొచ్చు. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మించారు. ఎన్‌.టి.రామారావుతో కె.వి.రెడ్డి చేసిన తొలి సినిమా కూడా ఇదే. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో ఏడు సినిమాలు వచ్చాయి. పాతాళభైరవి తర్వాత కె.వి.రెడ్డి చేసిన ప్రతి సినిమా ఆణిముత్యం లాంటిదే. పెద్ద మనుషులు, దొంగరాముడు, మాయాబజార్‌, పెళ్లినాటి ప్రమాణాలు, జగదేకవీరుని కథ, శ్రీకృష్ణార్జునయుద్ధం, శ్రీకృష్ణ సత్య వంటి సినిమాలు క్లాసిక్స్‌గా నిలిచిపోయాయి. ఈ సినిమాల నిర్మాణ సమయంలోనే కె.వి.రెడ్డి, ఎన్‌.టి.రామారావు మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. 

1960 దశకం వరకు కె.వి.రెడ్డితో సినిమాలు చేసేందుకు నిర్మాతలు పోటీ పడేవారు. ఆ తర్వాత సత్య హరిశ్చంద్ర, ఉమాచండీ గౌరీశంకరుల కథ, భాగ్యచక్రము వంటి సినిమాలు ఫ్లాప్‌ అవ్వడంతో మూడు సంవత్సరాలపాటు కె.వి.రెడ్డికి మరో సినిమా చేసే ఛాన్స్‌ రాలేదు. ఆయన్ని గురువుగా భావించే ఎన్‌.టి.రామారావు.. తన సొంత నిర్మాణ సంస్థ ఎన్‌.ఎ.టి. పిక్చర్స్‌ పతాకంపై నిర్మిస్తున్న శ్రీకృష్ణసత్య చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చారు. అవకాశాలు రాని సందర్భంలో వరస ఫ్లాపులు తీసిన డైరెక్టర్‌గానే కన్ను మూస్తానేమోనని ఎంతో బాధపడేవారు కె.వి.రెడ్డి. అలాంటి సమయంలో శ్రీకృష్ణసత్య సినిమా ఘనవిజయం సాధించింది. ఆ సంతోషంతో మరుసటి సంవత్సరమే కె.వి.రెడ్డి కన్ను మూశారు. 

చేసిన సినిమాలు తక్కువే అయినా తరతరాలు మాట్లాడుకునే స్థాయి సినిమాలు చేసి ఎంతో మంది సినీ దిగ్గజ్జాలకు పితామహుడిగా చెప్పబడే కె.వి.రెడ్డి ఒక సందర్భంలో సాధారణ లైట్‌బోయ్‌కి క్షమాపణ చెప్పారు. ఈ విషయాన్ని ఆయన దగ్గర అసోసియేట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన సింగీతం శ్రీనివాసరావు ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’ షూటింగ్‌ జరుగుతున్న రోజులవి. కమలంలో కూర్చుని ఉన్నాడు బ్రహ్మ. అతనికి కుడివైపున సరస్వతి, ఎడమవైపున బృహస్పతి ఉన్నారు. వారిద్దరితో బ్రహ్మ మాట్లాడే సన్నివేశాన్ని చిత్రీకరించారు కె.వి.రెడ్డి. షాట్‌ ఓకే అయిపోయింది. అప్పుడు సింగీతం శ్రీనివాసరావు దగ్గరికి రామయ్య అనే లైట్‌బోయ్‌ వచ్చి ‘నాకు చిన్న డౌట్‌ ఉంది సార్‌’ అని అడిగాడు. ‘ఏమిటో చెప్పు’ అన్నారు సింగీతం. దానికా లైట్‌బోయ్‌ ‘బ్రహ్మకి నాలుగు తలలు ఉన్నాయి కదా.. మరి సరస్వతి, బృహస్పతితో మాట్లాడేటప్పుడు వారివైపు ఎందుకు తల తిప్పుతున్నాడు. మిగతా తలలతో మాట్లాడొచ్చు కదా’ అని అడిగాడు. అది విని సింగీతం షాక్‌ అయ్యారు. అతను అడిగిన దానిలో లాజిక్‌ ఉంది కదా అనుకున్నారు. ఆ సమయంలోనే అక్కడికి వచ్చిన కె.వి.రెడ్డి ‘ఏం జరిగింది.. నాకు కూడా చెప్పండి.. నేను కూడా ఎంజాయ్‌ చేస్తాను’ అన్నారు. అప్పుడు ఆ లైట్‌బోయ్‌ సందేహం గురించి చెప్పారు సింగీతం. ‘నువ్వు అడిగింది కరెక్టే. ఆర్టిస్టు తల తప్ప మిగతా తలలన్నీ డూపే. వాటితో కూడా మాట్లాడిరచేంత టెక్నాలజీ మాకు లేదు. దయచేసి నన్ను క్షమించు. నీ సందేహాన్ని తీర్చే టెక్నాలజీ మున్ముందు వస్తుందేమో. ప్రస్తుతానికి నన్ను క్షమించు’ అన్నారు కె.వి.రెడ్డి. ఒక లైట్‌బోయ్‌కి క్షమాపణ చెప్పడం ఆయన సంస్కారానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.