Read more!

English | Telugu

కృష్ణంరాజు చేసిన పనికి అందరూ షాక్‌.. ‘భక్త కన్నప్ప’ నిర్మాణానికి అన్నీ అవరోధాలే.!

సినిమా రంగంలో నటీనటులుగా పేరు తెచ్చుకున్న వారందరికీ ఏదో ఒక డ్రీమ్‌ క్యారెక్టర్‌ ఉంటుంది. ఎప్పటికైనా అవకాశం వస్తే ఆ క్యారెక్టర్‌ చెయ్యాలని కలలు కంటూ ఉంటారు. కొందరికి మాత్రమే అది సాధ్యపడుతుంది. అలాంటి డ్రీమ్‌ క్యారెక్టర్‌ రెబల్‌స్టార్‌ కృష్ణంరాజుకి కూడా ఉండేది. ‘చిలకా గోరింకా’ చిత్రంతో నటుడిగా రంగ ప్రవేశం చేసిన ఆయన ఆ తర్వాత హీరోగా, విలన్‌గా, సహాయనటుడిగా ఎన్నో పాత్రలు చేశారు. దాదాపు 50 సినిమాలు పూర్తి చేసిన తర్వాత గోపీకృష్ణా మూవీస్‌ పేరుతో ఓ బేనర్‌ను స్థాపించి ‘కృష్ణవేణి’ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి వి.మధుసూదనరావు దర్శకుడు. సినిమాకి మంచి పేరు వచ్చింది. కానీ, బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన విజయం లభించలేదు. 

అయితే తన బేనర్‌లో తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అయిన ‘భక్త కన్నప్ప’ను భారీ బడ్జెట్‌తో రెండో సినిమాగా నిర్మించాలనుకున్నారు. వి.మధుసూదనరావు దర్శకత్వంలోనే ఈ సినిమా కూడా చెయ్యాలనుకున్నారు. కథ సిద్ధం చేసుకున్నారు. ఆదినారాయణరావు సంగీత దర్శకత్వంలో కొన్ని పాటలు కూడా రికార్డ్‌ చేశారు. కానీ, ఈ సినిమా కార్యరూపం దాల్చలేదు. దాంతో ప్రాజెక్ట్‌ను కొన్నాళ్ళు పక్కన పెట్టేశారు. ఆ మరుసటి ఏడాది బాపు దర్శకత్వంలో రూపొందిన ‘ముత్యాల ముగ్గు’ చిత్రం విడుదలై ఘనవిజయం సాధించింది. బాపు, రమణల పేర్లు మారుమ్రోగిపోయాయి. వారిద్దరే తన భక్తకన్నప్పకు న్యాయం చెయ్యగలరని భావించారు కృష్ణంరాజు. ఈ ప్రాజెక్ట్‌ గురించి బాపు, రమణలకు చెప్పగానే వారు కూడా సినిమా చేసేందుకు అంగీకరించారు. సాధారణంగా బాపు శ్రీరాముడి కథాంశంతో సినిమా చేసేందుకు ఎక్కువ మక్కువ చూపిస్తారు. కానీ, ఒక శివభక్తుడి సినిమా చేసేందుకు ఆయన అంగీకరించడం గొప్ప విషయంగానే చెప్పాలి. అలా ‘భక్త కన్నప్ప’ మళ్ళీ పట్టాలెక్కింది. 

అంతకుముందు సిద్ధం చేసిన స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేర్పులు చేశారు రమణ. గతంలో భక్త కన్నప్ప కథాంశంతో వచ్చిన కాళహస్తి మహత్మ్యం చిత్రంలో లేని కిరాతార్జునీయం ఎపిసోడ్‌ని ‘భక్త కన్నప్ప’ చిత్రంలో చేర్చారు రమణ. ఈ పాటను వేటూరి సుందరరామ్మూర్తి రచించారు. అప్పటివరకు వచ్చిన పౌరాణిక సినిమాలన్నీ ఎక్కువ శాతం స్టూడియోల్లో చిత్రీకరించినవే. మొదటిసారి ఎక్కువ శాతం ఔట్‌డోర్‌లో రూపొందిన సినిమాగా ‘భక్త కన్నప్ప’ క్రెడిట్‌ దక్కించుకుంది. జంగారెడ్డిగూడెంకి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది బుట్టాయగూడెం. అక్కడికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవిలో సినిమాను తీసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. మోటార్ల సాయంతో ఏర్లు సృష్టించారు. కొన్ని వందల తాడిచెట్లను కొట్టేసి సినిమాకు అనుగుణంగా ఎరెనా సెట్‌ వేశారు. ఈ సెట్‌ను కొంత భాగం వేసిన తర్వాత కళాదర్శకుడు భాస్కరరాజుకు అత్యవసరంగా వేరే పని రావడంతో దాన్ని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయారు. దాంతో సెట్‌ పనులు ఆగిపోయాయి. ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న బాపు, రమణల స్నేహితుడు బి.వి.ఎస్‌.రామారావుకు ఆ బాధ్యతను అప్పగించారు. ఆయన మొదట సందేహించినా ఆ సెట్‌ను పూర్తి చేయడానికి ఒప్పుకున్నారు. ఆ సెట్‌ను మొదట అనుకున్న దానికంటే బాగా వేశారాయన. 90 అడుగుల అమ్మవారి విగ్రహాన్ని, ఒక ఆశ్రమాన్ని నిర్మించారు. ఆ అడవికి దారి సరిగా లేకపోవడంతో 12 కిలోమీటర్ల మేర రోడ్డు వేశారు. ఇవన్నీ చేయడానికి 45 రోజులు పట్టింది. రూ.9 లక్షలు ఖర్చయింది. ఆరోజుల్లో పౌరాణిక చిత్రాన్ని భారీగా తియ్యాలంటే రూ.15 లక్షల వరకు బడ్జెట్‌ అయ్యేది. కానీ, ఈ సినిమాకి మాత్రం రూ.20 లక్షలు ఖర్చయింది. యూనిట్‌ సభ్యులంతా ఆ అడవిలోనే బస చేసేవారు. వారానికి 6 రోజులు మాత్రమే షూటింగ్‌ చేసేవారు. ఒకరోజు విశ్రాంతి దినం. ఆరోజు అందరికీ బిర్యానీ వండిరచేవారు. వినోద కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసేవారు. మొత్తం 550 మంది యూనిట్‌ సభ్యులకు భోజన వసతి కల్పించారు. ఈ సినిమా షూటింగ్‌ 70 రోజులపాటు జరిగింది. 

ఈ సినిమాలో రావుగోపాలరావు కొడుకు పాత్ర కోసం రాజబాబును అనుకున్నారు. సమయానికి అతని కాల్షీట్స్‌ అడ్జస్ట్‌ అవ్వకపోవడంతో, పద్మనాభంతో ఆ క్యారెక్టర్‌ చేయించాలనుకున్నారు. కానీ, చివరి నిమిషంలో వాళ్ళ నాన్నకు ఆరోగ్యం బాగోకపోవడంతో ఆయన కూడా షూటింగ్‌కి రాలేకపోయారు. అప్పుడా క్యారెక్టర్‌ సారధికి దక్కింది. అది ఆయనకు ఎంతో పేరుతో పాటు కళానగర్‌ అవార్డును కూడా తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన వాణిశ్రీ అప్పటికే టాప్‌ హీరోయిన్‌. ‘భక్త కన్నప్ప’ను బాపు తెరకెక్కించిన విధానం నచ్చడంతో ఆ తర్వాత ఆయన దర్శకత్వంలోనే వచ్చిన ‘గోరంత దీపం’ చిత్రంలో డీగ్లామరైజ్డ్‌ రోల్‌ చేసేందుకు ఒప్పుకున్నారు వాణిశ్రీ. 

ముత్యాలముగ్గు చిత్రంలో నటించిన శ్రీధర్‌, రావుగోపాలరావు, జయమాలినిలకు ఈ సినిమాలో మంచి పాత్రలు లభించాయి. ఈ చిత్రంలోని మల్లన్న పాత్రకు పూర్తి న్యాయం చేశారు శ్రీధర్‌. అలాగే రావుగోపాలరావు కైలాసనాథశాస్త్రిగా అద్భుతంగా నటించారు. ‘శివ శివ అననేలరా..’ పాటతో అలరించారు జయమాలిని. ఈ చిత్రం కోసం వేటూరి రాసిన ‘శివశివ శంకర..’ పాటను ఆదినారాయణరావు స్వరపరచారు. అనారోగ్య కారణాల వల్ల తన శిష్యుడు సత్యంకు మిగతా పాటల బాధ్యతను అప్పగించారు. బాపు కాంబినేషన్‌లో సత్యం చేసిన సినిమా ఇదొక్కటే. ఈ సినిమాకి ఉత్తమ సంగీత దర్శకుడుగా సత్యం నంది అవార్డును అందుకున్నారు. ఈ సినిమాలోని పాటలు వి.రామకృష్ణకు ఎంతో మంచి పేరును తెచ్చాయి. ఈ సినిమాకి సంబంధించిన మరో విశేషం ఏమిటంటే.. 45 డ్రమ్స్‌తో ‘కండ గెలిచింది..’ అనే పాటను ఎంతో భారీగా చిత్రీకరించారు. నృత్య దర్శకుడు శ్రీను ఈ పాటను ఎంతో అద్భుతంగా చేశారు. ఈ పాట కోసం బాపు చెప్పిన షాట్స్‌కి అనుగుణంగా పాట రాసారు సి.నారాయణరెడ్డి. ఈ పాటలో వాడిన డ్రమ్స్‌ను బుట్టాయగూడెంలోనే తయారు చేయించారు. 9 నిమిషాల ఈ పాటను తియ్యడానికి 10 రోజులు పట్టింది. ఈ సినిమాలోని మరో పాట ‘ఎన్నీయల్లో ఎన్నీయల్లో చందామామా..’ పాటను ఆ ప్రాంతంలోని కోయవారి దగ్గర నుంచి సేకరించి ఆరుద్రతో రాయించారు. ఈ పాటను మిట్టమధ్యాహ్నం తీశారు. కానీ, సినిమాలో మాత్రం వెన్నెల్లో తీసినట్టు అనిపిస్తుంది. ఆ క్రెడిట్‌ అంతా డి.ఓ.పి. వి.ఎస్‌.ఆర్‌.స్వామికి దక్కుతుంది. ఇలా సినిమా ఆద్యంతం ఒక అద్భుతంలా అనిపిస్తుంది. మనం పుస్తకాల్లో చదువుకున్న కథను సినిమాగా మలిచి అందర్నీ ఆకట్టుకోవడం బాపు వంటి దర్శకుడి వల్లే అవుతుందని ‘భక్త కన్నప్ప’ మరోసారి రుజువు చేసింది. 1976లో ఈ సినిమా విడుదలై ఘనవిజయం సాధించింది. రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు కల నెరవేరింది. ‘కృష్ణవేణి’ చిత్రం నిర్మాతగా ఆయనకు లాభాలు తెచ్చిపెట్టకపోయినా, ‘భక్తకన్నప్ప’ మాత్రం గోపీకృష్ణా మూవీస్‌ సంస్థను లాభాల్లోకి నడిపించింది.