Read more!

English | Telugu

దేశవ్యాప్తంగా ఆ సినిమాపై నిరసనలు, దాడులు.. అయినా కాసుల వర్షం కురిసింది.. అవార్డుల పంట పండింది.!

మన భారతీయ సినిమాలకు ఒక ఫార్మాట్‌ ఉంది. అది ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అయితే ఓవరాల్‌గా ఇండియన్‌ ఆడియన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఇష్టపడతారు. కొన్నిసార్లు కొత్తదనంతో కూడిన కథలను, సామాజిక స్పృహ ఉన్న సినిమాలను సైతం ఆదరిస్తారు. భారతదేశంలో సినిమా పుట్టినప్పటి నుంచి దాదాపు ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అప్పుడప్పుడు వాటిని బ్రేక్‌ చేసేందుకు కొందరు దర్శకులు ప్రయత్నించారు. అయితే వారిలో కొందరు సక్సెస్‌ అయితే మరికొందరు మరుగున పడిపోయారు. రెండున్నర గంటల నిడివి ఉండే సినిమాలో ప్రేక్షకులు ఏం కోరుకుంటారు, వారికి కేవలం ఎంటర్‌టైన్‌మెంటే కావాలా లేక ప్రస్తుత సామాజిక పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు చూపించినా చూస్తారా? అనే విషయంలో కొందరు దర్శకులకు కొన్ని ప్రత్యేకమైన అభిప్రాయాలు ఉన్నాయి. కేవలం సమాజాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని కథను రెడీ చేసి సినిమాగా తీస్తే ఆదరణ ఉండదని, అంతర్లీనంగా ఒక మంచి కల్పిత కథను కూడా జోడిస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని కొందరు దర్శకులు ప్రూవ్‌ చేశారు. అలాంటి వారిలో మణిరత్నం ప్రథముడు అని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా తను చేసే సినిమా ఒక విజువల్‌ వండర్‌గా ఉండాలని కోరుకునే దర్శకుడు మణిరత్నం. తను చేసిన సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఫెయిల్‌ అయినా ఆడియన్స్‌ మాత్రం మణిరత్నంకి ఫస్ట్‌ క్లాస్‌ మార్కులే వేస్తారు. తను చేసిన ప్రతి సినిమాకీ ఇదే సూత్రం వర్తిస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో దేశంలో అనిశ్చితి నెలకొన్నప్పుడు కూడా కొన్ని సున్నితమైన అంశాలను తీసుకొని ఎంతో ధైర్యంగా సినిమాలు తీశారు మణిరత్నం. అలాంటి వాటిలో రోజా, బొంబాయి వంటి సినిమాల గురించి మొదట చెప్పుకోవాలి. 

డిసెంబర్‌ 6, 1992. దేశాన్ని మతపరంగా, సామాజికంగా, రాజకీయంగా కుదిపేసిన రోజు. ఎన్నాళ్ళుగానో రెండు మతాల మధ్య నలుగుతున్న సమస్య ఒక్కసారిగా ఉధృత రూపం దాల్చింది. వివాదాస్పద బాబ్రీ మసీదును హిందూ విశ్వపరిషత్‌ పిలుపు మేరకు అయోధ్య చేరుకున్న కరసేవకులు కూల్చివేశారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. ఆ సమయంలో జరిగిన అల్లర్లలో 3 వేలకు పైగా సామాన్యులు తమ ప్రాణాలను కోల్పోయారు. ముఖ్యంగా ముంబాయిలో ఈ అల్లర్లు ఎక్కువగా జరిగాయి. అప్పుడు మహారాష్ట్రలో ఉన్న సామాజిక, రాజకీయ పరిస్థితులే దానికి కారణం. ఇలాంటి సామాజిక అంశాలపై ఎంతో అవగాహన ఉన్న మణిరత్నం దేశవ్యాప్తంగా జరుగుతున్న అల్లర్లపై ఆందోళన చెందారు. ఆ సమయంలో తన డైరెక్షన్‌లో రూపొందుతున్న ‘దొంగ దొంగ’ సినిమాకి సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. ఒకపక్క వర్క్‌ జరుగుతున్నా అతని ఆలోచనలు మాత్రం బాబ్రీ మసీదు గొడవల చుట్టూనే తిరుగుతున్నాయి.

ముంబాయిలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో ఓ సినిమా తియ్యాలని నిర్ణయించుకున్నారు మణిరత్నం. ప్రముఖ మలయాళ రచయిత ఎం.టి.వాసుదేవన్‌ నాయర్‌ను కథ, స్క్రీన్‌ప్లే సిద్ధం చేయవలసిందిగా కోరారు. అయితే అది కార్యరూపం దాల్చేందుకు ఎంతో సమయం పట్టేలా ఉండడంతో మణిరత్నమే దానికి పూనుకున్నారు. ఎంతో వేగంగా స్క్రిప్ట్‌ను పక్కాగా సిద్ధం చేసుకున్నారు. ఈ సినిమా కోసం విక్రమ్‌, మనీషా కోయిరాలాకు ఫోటోషూట్‌ చేయించారు. అప్పటికే మరో సినిమా కోసం గడ్డం, మీసాలు పెంచిన విక్రమ్‌ ఈ సినిమా కోసం వాటిని తొలగించేందుకు అంగీకరించలేదు. చివరికి తన ‘రోజా’ చిత్రంలో నటించిన అరవింద్‌ స్వామిని ఎంపిక చేశారు. సినిమా మొదలైంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిత్రాన్ని షూట్‌ చేశారు. ఈ సినిమాలో బాబ్రీ మసీదు కూల్చి వేస్తున్న వీడియోను సినిమాలో చూపించేందుకు ప్రయత్నించారు మణిరత్నం. కానీ, సెన్సార్‌ బోర్ట్‌ ఒప్పుకోలేదు. అలా ఎన్నో అడ్డంకుల్ని అధిగమించి షూటింగ్‌ పూర్తి చేశారు. 1995 మార్చి 10న ఈ సినిమాను తమిళ్‌, తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్‌ చేశారు. బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌కు చెందిన ఎబిసిఎల్‌ సంస్థ ఈ చిత్రం హిందీ విడుదల హక్కులను రూ.2.5 కోట్లకు కొనుగోలు చేసింది. 

ఈ సినిమా విడుదలైన తర్వాత ఒక వర్గం వారు నిరసన వ్యక్తం చేశారు. ‘బొంబాయి’ ప్రదర్శితమవుతున్న థియేటర్లపై దేశవ్యాప్తంగా దాడులు చేశారు. ఎవరు ఎన్నిరకాలుగా ఈ సినిమాను అడ్డుకునే ప్రయత్నం చేసినా ప్రేక్షకులు మాత్రం విపరీతంగా ఆదరించారు. అప్పట్లో ఈ సినిమా దేశవ్యాప్తంగా గొప్ప సంచలనాన్నే సృష్టించింది. మణిరత్నం సినిమా అంటేనే ఒక దృశ్యకావ్యంలా ఉంటుంది. అది మిస్‌ అవ్వకుండా బొంబాయిలో జరిగిన అల్లర్లను కళ్ళకు కట్టినట్టుగా చూపించడంలో మణిరత్నం హండ్రెడ్‌ పర్సెంట్‌ సక్సెస్‌ అయ్యారు. ఈ సినిమాకి కథ, కథనాలు ప్రాణం అయితే.. దానికి కొత్త ఊపిరి పోసింది ఎ.ఆర్‌.రెహమాన్‌ చేసిన పాటలు. ‘ఉరికే చిలకా..’, ‘కన్నానులే..’, ‘హమ్మ హమ్మ’ పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సినిమాకి బాగా ప్లస్‌ అయిన మరో అంశం బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌. సినిమాలోని ఎమోషన్‌ని, కొన్ని భయానక పరిస్థితుల్ని బాగా ఎలివేట్‌ చేసింది మ్యూజిక్‌. కాశ్మీర్‌ టెర్రరిస్టుల నేపథ్యంలో మణిరత్నం చేసిన ‘రోజా’ 1992లో ఒక సంచలనం అయితే, 1995లో వచ్చిన ‘బొంబాయి’ మరో సంచలనాన్ని సృష్టించింది. అందరూ ఈ సినిమాను చూసి మణిరత్నంను ప్రశంసల్లో ముంచెత్తారు. ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రంగా ‘బొంబాయి’ చిత్రం నేషనల్‌ అవార్డును గెలుచుకుంది. అలాగే తమిళనాడు ప్రభుత్వ అవార్డులు, ఫిలింఫేర్‌ అవార్డులు, సినిమా ఎక్స్‌ప్రెస్‌ అవార్డులతోపాటు విదేశాల్లో కూడా ఈ చిత్రాన్ని ప్రదర్శించి అవార్డులు అందించారు. ఈ సినిమా విడుదలై 30 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ ఈ సినిమాకి, ఇందులోని పాటలకు ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. మణిరత్నం కెరీర్‌లో ‘బొంబాయి’ సినిమా ఓ దృశ్యకావ్యంలా నిలిచిపోయింది.