English | Telugu
ఎన్నికల్లో ప్రభంజనం.. ఈ సినిమాతోనే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు!
Updated : Jul 1, 2024
నటరత్న ఎన్.టి.రామారావు తొలిసారి కెమెరా ముందుకు వచ్చిన సినిమా ‘మనదేశం’. ఈ సినిమా 1949లో విడుదలైంది. అలాగే ఆయన చివరగా నటించే సినిమా అంటూ ప్రచారం పొందిన సినిమా ‘నా దేశం’. ఈ సినిమా 1982లో విడుదలైంది. ఎన్టీఆర్ జీవితంలో 1982 సంవత్సరానికి ఒక విశిష్టత ఉంది. ఈ ఒక్క సంవత్సరంలోనే జస్టిస్ చౌదరి, బొబ్బిలిపులి, నాదేశం.. ఈ మూడు సినిమాలు రిలీజ్ అయి ఘనవిజయం సాధించాయి. ఎన్టీఆర్ రాజకీయంగా విజయపథంలో పయనించేందుకు, ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యేందుకు ఈ సినిమాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. అలాగే ఎన్టీఆర్ 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించి తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్టు ప్రకటించారు. అప్పటికే ఎన్టీఆర్ హీరోగా మంచి ఫామ్‌లో ఉన్నారు. ఆయనతో సినిమాలు చెయ్యాలని ఎంతో మంది నిర్మాతలు ఆసక్తిగా ఉన్నారు. అయితే ఇక ఎన్టీఆర్ సినిమాలు చెయ్యరు అని ప్రచారం మొదలైపోయింది.
అప్పుడు నిర్మాత దేవీవరప్రసాద్‌ని పిలిపించారు ఎన్టీఆర్. ఆయన వచ్చేసరికి అక్కడ ఎస్.వెంకటరత్నం, కృష్ణంరాజు అనే నిర్మాతలు కూడా అక్కడ ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో విడివిడిగా మీకు సినిమాలు చెయ్యలేనని, ముగ్గురూ కలిసి ఒక సినిమా చేసుకోమని చెప్పారు ఎన్టీఆర్. అలా ఆయన నటించే చివరి సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే సినిమా ప్రారంభం కాకముందే కొన్ని భేదాభిప్రాయాల వల్ల నిర్మాత కృష్ణంరాజు తప్పుకున్నారు. కాల్షీట్స్ ఇచ్చే ముందు ‘పదిరోజుల్లో స్క్రిప్ట్ రెడీ అయిపోవాలి.. మరో 18 రోజుల్లో షూటింగ్ పూర్తి చేయాలి’ అని కండిషన్ పెట్టారు ఎన్టీఆర్. కొత్త కథ రెడీ చెయ్యాలంటే సమయం పడుతుంది కాబట్టి హిందీ సినిమా ‘లావారిస్’ని రీమేక్ చేస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది నిర్మాతలకు. ఈ విషయాన్ని ఎన్టీఆర్‌కి చెప్పారు. ఆ సినిమా చూసేంత తీరిక తనకు లేదని, పరుచూరి బ్రదర్స్‌ని చూసి స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పండి అన్నారు ఎన్టీఆర్. అప్పటికే ఎంతో బిజీ రైటర్స్ అయిన పరుచూరి బ్రదర్స్‌ని ఎలాగోలా ఒప్పించి స్క్రిప్ట్ రెడీ చేయించారు నిర్మాతలు.
1982 జూలై 22న ‘నా దేశం’ చిత్రాన్ని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముహూర్తపు షాట్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. అప్పుడు మేకప్ రూమ్‌లోకి వెళ్ళిన ఎన్టీఆర్‌ను ఆయన కుమారుడు జయకృష్ణ కలిసి హిందీలో లావారిస్ ఫ్లాప్ సినిమా అనీ, దాన్ని రీమేక్ చేస్తే మీకు చెడ్డపేరు వస్తుందని చెప్పాడు. దీంతో ఆలోచనలో పడ్డారు ఎన్టీఆర్. ఇది తెలుసుకున్న నిర్మాతలు టెన్షన్‌తో వణికిపోయారు. ఎంతో ఆలోచించిన తర్వాత ఎన్టీఆర్ సినిమా చేయడానికే నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ముహూర్తపు షాట్ వరకు వచ్చిన సినిమాను ఆపెయ్యమని చెప్పడం తనకు శ్రేయస్కరం కాదని భావించిన ఎన్టీఆర్ ఎలా జరిగేది అలా జరుగుతుంది అంటూ ప్రొసీడ్ అయ్యారు. అలా ప్రారంభమైన ‘నా దేశం’ చిత్రాన్ని షూటింగ్, డబ్బింగ్ కలిపి 25 రోజుల్లో పూర్తి చేశారు ఎన్టీఆర్. రోజుకి లక్ష రూపాయల చొప్పున 25 రోజులకు ఎన్.టి.ఆర్‌కు 25 లక్షల రూపాయలు పారితోషికంగా నిర్మాతలు చెల్లించారు.
1982లో విడుదలైన జస్టిస్ చౌదరి, బొబ్బిలిపులి, నా దేశం చిత్రాలు ఎన్టీఆర్ రాజకీయ ప్రభంజనానికి ఎంతగానో దోహదపడ్డాయి. ‘నా దేశం’ చిత్రంలో పరుచూరి బ్రదర్స్ ఓ పవర్‌ఫుల్ డైలాగ్ రాశారు. ‘మీరు రాజకీయం నేర్చుకోవడానికి 35 ఏళ్ళు పట్టింది. నేను దాన్ని మూడు నెలల్లోనే అవపోసన పట్టాను’ అని ఎన్టీఆర్ చెప్పిన ఈ డైలాగ్ జనంలోకి బాగా దూసుకెళ్ళింది. ‘ఈ ఒక్క డైలాగ్ ద్వారా కోట్లాది మంది ప్రజలకు మా సందేశం వెళ్ళిపోతుంది బ్రదర్’ అని ఎన్టీఆర్ అన్నారు. 1982 అక్టోబర్ 27న ‘నా దేశం’ చిత్రం విడుదలై ఘనవిజయం సాధించింది. 10 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. రూ.45 లక్షల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా కోటి రూపాయలు వసూలు చేసింది. కోటి రూపాయలు అంతకు మించి కలెక్షన్ సాధించిన ఎన్టీఆర్ సినిమాల్లో ‘నా దేశం’ 12వ స్థానాన్ని దక్కించుకుంది. ఈ సినిమా విడుదలైన 70 రోజులకు ఎన్.టి.రామారావు ఎన్నికల్లో ఘనవిజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. ‘నా దేశం’ తర్వాత ఎన్టీఆర్ మళ్ళీ సినిమాల్లో నటించరు అనే ప్రచారం బాగానే జరిగినప్పటికీ ఓ కళాకారుడిగా సినిమాలను విస్మరించలేదు. తన వీలును బట్టి కొన్ని సినిమాల్లో నటించారు. ఎన్టీఆర్ నటించిన చివరి చిత్రం బాపు దర్శకత్వంలో రూపొందిన ‘శ్రీనాథ కవిసార్వభౌముడు’.