English | Telugu
గిన్నిస్‌బుక్ రికార్డ్స్‌లో లతా మంగేష్కర్.. వివాదం తేలకుండానే కన్నుమూసారు!
Updated : Jul 2, 2024
మహ్మద్ రఫీ, లతా మంగేష్కర్ బాలీవుడ్‌లో లెజెండరీ సింగర్స్‌గా పేరు సంపాదించుకున్నారు. హిందీలోనే కాదు పలు భాషల్లో తమ గాన మాధుర్యంతో శ్రోతలను అలరించారు. సమకాలీనులు కావడంతో ఇద్దరూ కలిసి కొన్ని వందల పాటలు పాడారు. మహ్మద్ రఫీ ఇండస్ట్రీకి లత కంటే మూడు సంవత్సరాలు ముందే వచ్చారు. ఆయన పాడిన తొలిపాట 1944లో రికార్డ్ అయింది. లతా మంగేష్కర్ పాడిన తొలిపాటను 1947లో రికార్డ్ చేశారు. అయితే రఫీ కంటే వేగంగా లత పాడిన పాటల సంఖ్య పెరిగింది.
1977 నాటికి లత 25,000 పాటలను పూర్తి చేశారు. దాంతో అత్యధిక పాటలు పాడిన గాయనిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్నారు. ఆమె ఈ ఘనత సాధించడం మహ్మద్ రఫీకి బాధ కలిగించింది. నిజానికి వారిద్దరి మధ్య ఎలాంటి వివాదాలు లేవు. ఒకరి మీద ఒకరికి అపారమైన గౌరవం ఉంది. రఫీ ఈ విషయం గురించి బాధ పడడానికి కారణం.. రికార్డు స్థాయిలో పాటలు పాడిన ఘనత తనకే దక్కాలని మొదటి నుంచి భావించేవారు. లత ఆ ఘనత సాధించినప్పటికీ దాన్ని ఆయన ఒప్పుకునేవారు కాదు. లత కంటే తనకే ఆ బుక్‌లో స్థానం సంపాదించే అర్హత ఉందని వాదించేవారు.
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ 1977 ఎడిషన్‌లో లతా మంగేష్కర్ సాధించిన ఘనత గురించి పేర్కొన్న వివరాలు.. గ్రామ్‌ఫోన్ సినిమా అనే కేటగిరిలో లతా మంగేష్కర్ అత్యధిక పాటలు పాడారు. 1948-74 మధ్యకాలంలో ఆమె 25 వేలకు తక్కువ కాకుండా పాటలు పాడారు. సోలో, డ్యూయెట్, కోరస్, గ్రూప్ సాంగ్స్‌ను 20 భారతీయ భాషల్లో ఆమె ఆలపించారు. రోజుకి ఆమె ఐదు షిఫ్టుల చొప్పున పనిచేశారు. 1974లోనే దాదాపు 1800 పాటలు పాడారు అంటూ ఆ బుక్‌లో ప్రచురించారు.
లతా మంగేష్కర్ సాధించిన ఈ రికార్డ్‌ను సవాల్ చేస్తూ మహ్మద్ రఫీ గిన్నిస్ బుక్ ప్రచురణ కర్తలకు 1977, జూన్ 11న ఓ లేఖ రాశారు. ‘1944 నుంచి నేను సినిమా రంగంలో ఉన్నాను. సినీరంగానికి, సినీ సంగీతానికి నేను చేసిన సేవలకు తగిన గుర్తింపు రావాలని కోరుకోవడం అత్యాశ కాదని నా అభిప్రాయం. 1944లో సింగర్‌గా నా కెరీర్‌ను ప్రారంభించాను. నేను పాడిన 23,000 పాటలు రికార్డ్ అయ్యాయి. దానికి సంబంధించిన ఆధారాలను కూడా జత చేస్తున్నాను. లతా మంగేష్కర్ 1947లో తన కెరీర్‌ను స్టార్ట్ చేసింది. నా కంటే జూనియర్ అయిన లత నా కంటే ఎక్కువ పాటలు ఎలా పాడగలదు? మీరు ఈ సంవత్సరం ఎడిషన్‌లో పేర్కొన్నట్టుగా లత ఐదు షిఫ్టుల్లో ఎప్పుడూ పాటలు పాడలేదు. అది వాస్తవం కాదు. రోజుకి ఒక పాట కంటే ఎక్కువ రికార్డ్ అయిన సందర్భాలు కూడా చాలా తక్కువ. 30 ఏళ్ళ కెరీర్‌లో 25,000 పాటలు పాడినట్టు చెప్పడం కూడా కరెక్ట్ కాదు. రోజుకి ఒక పాట చొప్పున లెక్క వేస్తే 9,300 పాటలు మాత్రమే అవుతాయి. నేను రోజుకి రెండు పాటలు పాడాను. కొన్నిసార్లు రోజుకి 5 పాటలు కూడా పాడానని ప్రూవ్ చేయగలను. అందువల్ల నిజాయితీ కలిగి వున్న ఏదైనా భారతీయ ఏజెన్సీ ద్వారా నిజానిజాలు తేల్చాలి. అది తేలేవరకూ ఈ రికార్డ్‌కు సంబంధించిన పేజీని ఖాళీగా ఉంచాలని కోరుతున్నాను’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.
లేఖను అందుకున్న గిన్నిస్ బుక్ పబ్లిషర్స్ ‘మీరు ప్రస్తావించిన విషయాల గురించి పరిశీలిస్తాం’ అని హామీ ఇచ్చారు. కానీ, ఆ తర్వాతి రెండు సంవత్సరాలు ప్రచురించిన గిన్నిస్ బుక్‌లో లతా మంగేష్కర్ పేరే ఉంది. దీంతో రఫీ ఇరిటేట్ అయిపోయేవారు. తను పాడిన పాటల వివరాలను మూడుసార్లు గిన్నిస్ బుక్ సంస్థకు పంపారు. వాటితోపాటు లేఖలు కూడా రాశారు. కానీ, ఆ సంస్థ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఈ వివాదం తేలకుండానే 1980 జూలై 31న మహ్మద్ రఫీ కన్నుమూసారు. 1984లో విడుదలైన గిన్నిస్ బుక్ ఎడిషన్‌లో అత్యధిక పాటలు పాడిన గాయనిగా లత పేరును ఉంచుతూనే 1944 నుంచి 1980 వరకు 11 భాషల్లో 28,000 పాటలు పాడానని మహ్మద్ రఫీ స్వయంగా పేర్కొన్నారని గిన్నిస్‌బుక్‌లో ప్రచురించారు. ఆ తర్వాత 1991లో విడుదలైన గిన్నిస్‌బుక్ ఎడిషన్‌లో లతా మంగేష్కర్, మహ్మద్ రఫీ పేర్లను తొలగించారు.