English | Telugu

చిరంజీవిని మోసం చేసిన అగ్ర నిర్మాత.. ఏ విషయంలో?

చిరంజీవిని మోసం చేసిన అగ్ర నిర్మాత.. ఏ విషయంలో?

మెగాస్టార్‌ చిరంజీవి సినీ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినీ పరిశ్రమలో ఎవరి అండా లేకుండా, కేవలం స్వయంకృషితో మెగాస్టార్‌గా ఎదిగిన వైనం అందరికీ తెలుసు. అయితే ఆయన సినీ జీవితం ప్రారంభించిన తొలి రోజుల్లో అందరిలాగే  ఎన్నో అవమానాలు, మరెన్నో అవహేళనలు ఎదుర్కొన్నారు. చిరంజీవి తొలిసారి నటించిన సినిమా పునాదిరాళ్లు. కానీ, రిలీజ్‌ అయిన మొదటి సినిమా ప్రాణం ఖరీదు. ఈ సినిమా తర్వాత మనవూరి పాండవులు చిత్రంలో మంచి క్యారెక్టర్‌ చేసే అవకాశం వచ్చింది. ఆ తర్వాత సెకండ్‌ హీరోగా, కొన్ని సాధారణ సినిమాల్లో హీరోగా నటించినప్పటికీ పెద్ద బేనర్‌, పెద్ద డైరెక్టర్‌ చేతిలో చిరంజీవి పడలేదు. ఆ సమయంలో అడవిరాముడు వంటి బ్లాక్‌బస్టర్‌ని నిర్మించిన సత్యచిత్ర సంస్థలో ఒక సినిమాలో హీరోగా నటించే అవకాశం వచ్చింది. ఆ సంస్థ అధినేతల్లో ఒకరైన సూర్యనారాయణ ఈ విషయం చెబుతూ.. ‘ప్రస్తుతం కృష్ణతో కొత్త అల్లుడు సినిమా చేస్తున్నాం. ఈ సినిమా తర్వాత నువ్వు హీరోగా సినిమా స్టార్ట్‌ చేస్తాం. అయితే కొత్త అల్లుడు సినిమాలో విలన్‌ క్యారెక్టర్‌ ఉంది. అది నువ్వు చెయ్యాలి’ అన్నారు. అప్పటికి కొన్ని సినిమాల్లో నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న క్యారెక్టర్లు, మోసగాడు వంటి సినిమాలో విలన్‌గా నటించిన చిరంజీవి.. ఇకపై విలన్‌గా నటించకూడదని నిర్ణయించుకున్నారు. అయినప్పటికీ తర్వాతి సినిమాలో హీరోగా ఛాన్స్‌ ఇస్తామని చెప్పడంతో కొత్త అల్లుడు సినిమాలో విలన్‌గా నటించడానికి ఒప్పుకున్నారు చిరంజీవి. కృష్ణ, జయప్రద జంటగా నటించిన ఈ సినిమాలో చిరంజీవి చేసిన విలన్‌ క్యారెక్టర్‌కి మంచి పేరు వచ్చింది. సినిమా విడుదలై ఘన విజయం సాధించింది. 

ఆ సినిమా తర్వాత తనతోనే సినిమా చేస్తారని భావించారు చిరంజీవి. కానీ, నిర్మాత సూర్యనారాయణ ఆ విషయం గురించి మళ్లీ ప్రస్తావించలేదు. పైగా తమ నెక్స్‌ట్‌ సినిమాను కూడా ఎనౌన్స్‌ చేసేశారు. అందులో కూడా కృష్ణ, జయప్రదే హీరోహీరోయిన్స్‌. తనను హీరోగా పెట్టి సినిమా చేస్తానని మాట ఇచ్చిన నిర్మాత మరో సినిమా మొదలు పెట్టడంతో చిరంజీవి షాక్‌ అయ్యారు. సూర్యనారాయణ దగ్గరకు వెళ్లి అదే విషయాన్ని అడిగారు చిరంజీవి. దానికాయన.. ‘ఈ సినిమా తప్పనిసరిగా చెయ్యాల్సి వస్తోంది. నెక్స్‌ట్‌ ఇయర్‌ తప్పనిసరిగా నీతో సినిమా చేస్తాం. అయితే కొత్తపేట రౌడీ చిత్రంలో ఒక గెస్ట్‌ రోల్‌ ఉంది. విలన్‌ క్యారెక్టర్‌  కాదు. పాజిటివ్‌ రోల్‌. పైగా నీకు ఒక పాట కూడా ఉంటుంది’ అన్నారు. తనకు హీరోగా ఛాన్స్‌ ఇవ్వకపోయినా మొహమాటానికి పోయి రెండో సినిమా కూడా చెయ్యడానికి ఒప్పుకున్నారు చిరంజీవి. ఆ సమయంలో మరో రెండు సినిమాల్లో హీరోగా నటిస్తున్నారు. తమ సినిమాలో హీరోగా చేస్తూ వేరే సినిమాల్లో విలన్‌గా, గెస్ట్‌ ఆర్టిస్ట్‌గా నటించడం ఆ నిర్మాతలకు నచ్చలేదు. అయితే వారికి సర్ది చెప్పి కొత్తపేట రౌడీ చిత్రంలో నటించారు చిరంజీవి. ఆ సినిమా కూడా విడుదలై సూపర్‌హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. అప్పుడైనా తనతో సినిమా చేస్తారేమోనని చిరంజీవి ఎదురుచూశారు. కానీ, సత్యచిత్ర అధినేతల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆ క్షణం ఎంతో బాధపడిన చిరంజీవి.. తాను మోసపోయానని గ్రహించారు. అయితే దాని గురించి ఎవరి దగ్గరా ప్రస్తావించలేదు. అలా ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ చేతిలో మెగాస్టార్‌ చిరంజీవి ఘోరంగా మోసపోయారు.