English | Telugu

బాలకృష్ణ, మాధురీ దీక్షిత్‌లతో ఎ.ఎం.రత్నం హిందీ సినిమా.. ఎందుకు ఆగిపోయింది?

బాలకృష్ణ, మాధురీ దీక్షిత్‌లతో ఎ.ఎం.రత్నం హిందీ సినిమా.. ఎందుకు ఆగిపోయింది?

నటరత్న ఎన్‌.టి.రామారావు తన నటనతో తెలుగు, తమిళ ప్రేక్షకుల్ని ఎంత మంత్రముగ్ధుల్ని చేశారో తెలిసిన విషయమే. తన 45 సంవత్సరాల సినీ జీవితంలో తెలుగు, తమిళ చిత్రాల్లో మాత్రమే నటించారు తప్ప మరో భాషలో నటించే ప్రయత్నం చెయ్యలేదు. పౌరాణిక, జానపద, చారిత్రాత్మక, సాంఘిక చిత్రాల్లో తను చేయని పాత్ర లేదు అన్నంతగా తన నటనతో అలరించారు ఎన్టీఆర్‌. తండ్రి నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న అద్భుతమైన నటుడు నందమూరి బాలకృష్ణ. తండ్రిలాగే అన్ని జోనర్స్‌లో సినిమాలు చేసి ఈ తరంలో అలాంటి నటులు లేరని నిరూపించారు. బాలయ్య సమకాలీన నటులైన చిరంజీవి, వెంకటేష్‌, నాగార్జున వంటి హీరోలు తెలుగులోనే కాదు, హిందీలోనూ హీరోలుగా ఎంట్రీ ఇచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే వారిలో నాగార్జున మాత్రమే అప్పుడప్పుడు హిందీలో సినిమాలు చేస్తున్నారు తప్ప చిరంజీవి, వెంకటేష్‌ కొన్ని సినిమాలతోనే వెనక్కి వచ్చేశారు. అయితే వీరిద్దరూ చేసిన సినిమాలు తెలుగులో సూపర్‌హిట్‌ అయినవే తప్ప కొత్త కథలు కాదు. ప్రతిబంధ్‌, ఆజ్‌ కా గూండారాజ్‌, ది జెంటిల్‌మేన్‌ అనే మూడు సినిమాలు మాత్రమే చిరంజీవి చేశారు. ఈ సినిమాలు అక్కడ కమర్షియల్‌గా బాగా వర్కవుట్‌ అయినప్పటికీ బాలీవుడ్‌ నిర్మాతలెవరూ చిరంజీవితో సినిమాలు చేసేందుకు ముందుకు రాలేదు. అలాగే వెంకటేష్‌ అనాడి, తక్‌దీర్‌వాలా చిత్రాలు చేశారు. ఈ రెండూ మంచి విజయం సాధించాయి. ఆ తర్వాత వెంకటేష్‌ మళ్ళీ హిందీ సినిమాల జోలికి వెళ్ళలేదు. అయితే 2023లో సల్మాన్‌ ఖాన్‌ హీరోగా వచ్చిన కిసీకా భాయ్‌ కిసీకి జాన్‌ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించారు. 

నందమూరి బాలకృష్ణ విషయానికి వస్తే.. 50 ఏళ్ళ తన కెరీర్‌లో తెలుగు సినిమాల్లోనే నటించారు తప్ప మరో భాషకి వెళ్ళలేదు. ఎన్టీఆర్‌ కొన్ని తమిళ్‌ సినిమాల్లో నటించారు. బాలకృష్ణ మాత్రం తెలుగుకే పరిమితం అయ్యారు. అయితే బాలకృష్ణ నటించిన సినిమాలను హిందీలోకి డబ్‌ చేసి రిలీజ్‌ చేస్తే మంచి కలెక్షన్లు వచ్చేవి. 1992లో బాలకృష్ణ, బి.గోపాల్‌ కాంబినేషన్‌లో వచ్చిన రౌడీ ఇన్‌స్పెక్టర్‌ చిత్రాన్ని హిందీలోకి డబ్‌చేసి 17 సెంటర్స్‌లో విడుదల చేశారు. అప్పటికి అది రికార్డ్‌ అనే చెప్పాలి. ఆ సినిమా అక్కడ మంచి కలెక్షన్లు రాబట్టింది. అలాగే మరికొన్ని సినిమాలు కూడా హిందీలోకి డబ్‌ అయ్యాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని బాలకృష్ణను బాలీవుడ్‌కి పరిచయం చెయ్యాలని నిర్మాత ఎ.ఎం.రత్నం భావించారు. తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి నిర్మించాలని అనుకున్నారు. తేజాబ్‌ చిత్రంతో బ్లాక్‌బస్టర్‌ సాధించి నెంబర్‌ వన్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు ఎన్‌.చంద్ర. అలాగే తెలుగులో సూపర్‌హిట్‌ అయిన ప్రతిఘటన చిత్రాన్ని హిందీలో ప్రతిఘాత్‌ పేరుతో రీమేక్‌ చేసి విషయం తెలిసిందే. ఈ సినిమాకి ఎన్‌.చంద్ర దర్శకుడు. బాలయ్య బాలీవుడ్‌ ఎంట్రీకి అతనే కరెక్ట్‌ అని భావించిన రత్నం ఆ ప్రయత్నాలు ప్రారంభించారు. చంద్ర కూడా ఈ ప్రాజెక్ట్‌కి ఓకే చెప్పారు. బాలకృష్ణ, చంద్ర, రత్నం స్టోరీ డిస్కషన్‌ కోసం నాలుగైదు సిట్టింగ్స్‌ కూడా వేశారు. బాలయ్యకు ఒక పవర్‌ఫుల్‌ సబ్జెక్ట్‌ రెడీ చేశారు చంద్ర.  

అప్పట్లో మాధురీ దీక్షిత్‌ బాలీవుడ్‌లో నెంబర్‌ వన్‌ హీరోయిన్‌. ఎన్‌.చంద్ర డైరెక్షన్‌లో వచ్చిన తేజాబ్‌ చిత్రంలోని ఏక్‌దోతీన్‌ పాటతో దేశాన్ని ఉర్రూతలూగించి ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిపోయింది మాధురి. ఆ సమయంలోనే టాలీవుడ్‌కి ఆమెను తీసుకు రావాలని ఎంతో మంది దర్శకనిర్మాతలు ప్రయత్నించారు. కానీ, బాలీవుడ్‌లో నెంబర్‌వన్‌గా కొనసాగుతున్న మాధురి.. తెలుగు సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపించలేదు. అయితే తనను స్టార్‌ని చేసిన చంద్ర డైరెక్టర్‌ కాబట్టి బాలయ్య కాంబినేషన్‌లో సినిమా చేసేందుకు ఒప్పుకుంది. అయితే అదే టైమ్‌లో చంద్ర బాలీవుడ్‌లో ఒక సినిమా చెయ్యాల్సి వచ్చింది. దీంతో బాలకృష్ణ, మాధురీ దీక్షిత్‌ సినిమాను పక్కన పెట్టారు. అలా రెండేళ్లు గడిచిన తర్వాత మరోసారి ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు ప్రయత్నించారు రత్నం. కానీ, అప్పటికి బాలయ్య వరస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నారు. దాంతో బాలకృష్ణ బాలీవుడ్‌ ఎంట్రీ అనేది ప్రయత్నంతోనే ఆగిపోయింది. అప్పుడు తెలుగులో సూపర్‌హిట్‌ అయిన కర్తవ్యం చిత్రాన్ని హిందీలో తేజస్విని పేరుతో రీమేక్‌ చేస్తూ రత్నం కూడా బిజీ అయిపోయారు. అలా బాలకృష్ణను హిందీకి పరిచయం చేద్దామనుకున్న రత్నం కోరిక తీరలేదు.