English | Telugu

మిథున్ చక్రవర్తితో 35 సినిమాలు చేసి లిమ్కా రికార్డు సాధించిన తెలుగు డైరెక్టర్‌!

ఏ భాషలోనైనా ఒక హీరోతో వరసగా నాలుగైదు సినిమాలు చేయడం చాలా కష్టం. అలాంటిది కొందరు డైరెక్టర్లు ఒకే హీరోతో పదుల కొద్దీ సినిమాలు చేసిన వారు ఉన్నారు. తెలుగు విషయానికి వస్తే రాజేంద్రపస్రాద్‌ హీరోగా రేలంగి నరసింహారావు 32 సినిమాలు డైరెక్ట్‌ చేశారు. అయితే తెలుగు డైరెక్టర్‌ అయి ఉండి బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి కేవలం 8 సంవత్సరాల్లో ఒకే హీరోతో 30 హిందీ సినిమాలు, 4 బెంగాలీ, 1 మరాఠి చిత్రాలను రూపొందించిన డైరెక్టర్‌ గురించి మీకు తెలుసా? అతనే తాతినేని ప్రసాద్‌. 1950 దశకంలో టాప్‌ డైరెక్టర్‌గా వెలుగొందిన తాతినేని ప్రకాశరావు తనయుడు తాతినేని ప్రసాద్‌. ఇతని పేరును టి.ఎల్‌.వి.ప్రసాద్‌గా కూడా చాలా సినిమాల్లో వేశారు. 

1979లో కుడి ఎడమైతే చిత్రంతో దర్శకుడుగా పరిచయమయ్యారు తాతినేని ప్రసాద్‌. తనయుడిని డైరెక్టర్‌గా నిలబెట్టేందుకు తాతినేని ప్రకాశరావు వరసగా నాలుగైదు సినిమాలను స్వయంగా నిర్మించారు. అలా ప్రసాద్‌ డైరెక్టర్‌గా నిలదొక్కుకున్నారు. ఎన్‌.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, చిరంజీవి, బాలకృష్ణ, మోహన్‌బాబు, మురళీమోహన్‌, చంద్రమోహన్‌, సుమన్‌ వంటి హీరోలతో దాదాపు 25 సినిమాలు చేశారు. దాదాపు 11 సంవత్సరాల పాటు తెలుగులో డైరెక్టర్‌గా కెరీర్‌ కొనసాగించిన ప్రసాద్‌.. సొంతంగా కొన్ని సినిమాలు నిర్మించి ఆర్థికంగా నష్టపోయారు. తనకు ఇకపై ఎవరూ సినిమాలు ఇవ్వరు అని డిసైడ్‌ అయ్యారు. ఆ సమయంలోనే అనుకోకుండా బాలీవుడ్‌ దర్శకనిర్మాత కె.సి.బొకాడియా తటస్థపడ్డారు. నిర్మాతగా ఆయన తొలి సినిమాను తాతినేని ప్రకాశరావు డైరెక్ట్‌ చేశారు. దాంతో ప్రసాద్‌ను యోగ క్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. తన పరిస్థితి వివరించారు ప్రసాద్‌. ఎలాంటి దిగులు పెట్టుకోవద్దని చెప్పి తనతో ముంబాయి తీసుకెళ్ళారు బొకాడియా.

తెలుగులో పాతిక సినిమాలను డైరెక్ట్‌ చేసిన తాతినేని ప్రసాద్‌.. హిందీలో కె.సి.బొకాడియా నిర్మించే సినిమాలకు అసోసియేట్‌ డైరెక్టర్‌గా పనిచెయ్యాల్సి వచ్చింది. కె.సి.బొకాడియా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఓ అరడజను సినిమాలకు ప్రసాద్‌ పనిచేశారు. ఆ తర్వాత ప్రసాద్‌కి డైరెక్టర్‌గా అవకాశం ఇవ్వాలని డిసైడ్‌ అయ్యారు బొకాడియా. మిథున్‌ చక్రవర్తి హీరోగా ఒక సినిమా చేసే ఛాన్స్‌ వచ్చింది. మిథున్‌ చక్రవర్తి మొదటి సినిమా మృగయా. అంతకుముందే తాతినేని ప్రకాశరావు డైరెక్షన్‌లో రూపొందిన రివాజ్‌ అనే హిందీ సినిమాలో ఓ చిన్న క్యారెక్టర్‌ ద్వారా అతన్ని పరిచయం చేశారు. ఆ కృతజ్ఞతతో వారి అబ్బాయి డైరెక్షన్‌లో సినిమా అనగానే వెంటనే ఒప్పుకున్నారు మిథున్‌. 

అలా వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మొదటి సినిమా జన్‌తా కి అదాలత్‌. ఈ సినిమా పెద్ద హిట్‌ అయ్యింది. దీంతో బాలీవుడ్‌ నిర్మాతల దృష్టిలో పడ్డారు ప్రసాద్‌. దానికి కారణం కేవలం 30 రోజుల్లోనే జన్‌తా కి అదాలత్‌ చిత్రాన్ని పూర్తి చేశారు. ఆరోజుల్లో హిందీ సినిమా పూర్తి చేయాలంటే కనీసం సంవత్సరం పట్టేది. అలాంటిది 30 రోజుల్లో పూర్తి చేయడాన్ని అందరూ ఒక వండర్‌లా చూశారు. ఒక్కసారే అరడజను సినిమాలు చేసే అవకాశం తాతినేని ప్రసాద్‌కి వచ్చింది. అయితే ఆ అరడజను సినిమాల్లోనూ మిథున్‌ చక్రవర్తే హీరో. ఆ సినిమాలు కూడా మంచి విజయం సాధించడంతో ప్రసాద్‌తో సినిమా చెయ్యాలని వచ్చే ప్రతి నిర్మాతా తమకు మిథున్‌తో ఓ సినిమా చేసి పెట్టమని అడగడం మొదలుపెట్టారు. 1992లో మొదలైన వీరిద్దరి ప్రయాణం 2000 వరకు కొనసాగింది. ఈ 8 సంవత్సరాల్లో ఇద్దరూ కలిసి 30 సినిమాలు చేశారు. ఇవికాక బెంగాలీలో 4, మరాఠీలో 1 సినిమా చేశారు. ఇలా ఒకే హీరోతో 35 సినిమాలు చేసిన డైరెక్టర్‌గా తాతినేని ప్రసాద్‌.. లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇండియన్‌ సినిమా పుట్టిన నాటి నుంచి ఆ రికార్డు ఎవరూ సాధించలేదు. అలాగే ఇప్పటివరకు ఆ రికార్డును ఎవరూ బ్రేక్‌ చేయలేదు కూడా.