English | Telugu
చిరంజీవికి బంపర్ ఆఫర్.. ఏడాదికి నాలుగు సినిమాలు, రూ.18 లక్షలు రెమ్యునరేషన్!
Updated : Nov 18, 2024
మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా కేవలం స్వయంకృషితోనే టాలీవుడ్‌లో టాప్ హీరోగా ఎదిగారన్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన ఈ స్థాయికి రావడం వెనుక ఎంతో కృషి, పట్టుదల, క్రమశిక్షణ ఉన్నాయన్న విషయం వేరే చెప్పక్కర్లేదు. చిరంజీవి భవిష్యత్తులో పెద్ద స్టార్ అవుతారని ఆయన ఇండస్ట్రీకి వచ్చిన తొలిరోజుల్లోనే చాలా మంది దర్శకనిర్మాతలు ఊహించారు. అలాంటి వారిలో ప్రముఖ దర్శకుడు తాతినేని ప్రసాద్ ఒకరు. ప్రముఖ దర్శకనిర్మాత తాతినేని ప్రకాశరావు తనయుడు తాతినేని ప్రసాద్. కొడుకు దర్శకుడుగా మంచి పేరు తెచ్చుకోవాలని ఆయన కెరీర్ ప్రారంభంలో తాతినేని ప్రకాశరావు సొంతం సినిమాలు నిర్మించారు. తాతినేని ప్రసాద్ తొలి సినిమా కుడిఎడమైతే. దాసరి నారాయణరావు కథతో రూపొందిన సినిమా ఇది. ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని సాధించి దర్శకుడుగా తాతినేని ప్రసాద్‌కి మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత పాతిక సినిమాలకు దర్శకత్వం వహించారు ప్రసాద్. అందులో చిరంజీవితో టింగురంగడు, రాణీకాసుల రంగమ్మ, నాగు సినిమాలు ఉన్నాయి.
ఇక చిరంజీవితో ప్రసాద్ రూపొందించిన తొలి సినిమా టింగు రంగడు. ఈ సినిమా జరుగుతున్న సమయంలోనే చిరంజీవి నటనలోగానీ, డాన్సుల్లోగానీ, ఫైట్స్‌లోగానీ కనబరుస్తున్న ఈజ్ చూసి ఆయన ఆశ్చర్యపోయేవారు. తప్పకుండా భవిష్యత్తులో టాప్ హీరోగా ఎదుగుతాడని ఆయన ముందే ఊహించారు. ఇదే విషయాన్ని స్వయంగా చిరంజీవితోనే ప్రసాద్ అన్నారు. ఆ మాటలు చిరుకి ఎంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చాయి. భవిష్యత్తుపై ఆశల్ని పెంచాయి. తన క్యారెక్టర్ కోసం చిరంజీవి ఎంత కష్టపడేవారు అనే విషయాన్ని తెలిపేందుకు టింగురంగడు చిత్రం షూటింగ్‌లో జరిగిన కొన్ని సంఘటనల గురించి ప్రసాద్ వివరించారు. సాధారణంగా సినిమాల్లోని ఫైట్ సీన్స్‌లో హీరోలు నటించేటపుడు కొన్ని రిస్కీ షాట్స్ కోసం డూప్‌లను ఉపయోగిస్తుంటారు. దాదాపు అందరు హీరోల సినిమాల్లోనూ ఇది జరుగుతుంది. కానీ, టింగురంగడు చిత్రంలోని ఫైట్ సీక్వెన్స్‌లన్నీ డూప్ లేకుండానే చేశారు చిరంజీవి. ముఖ్యంగా క్లైమాక్స్‌లో గుర్రాలను ఉపయోగించారు. హార్స్ రైడింగ్‌తోపాటు ఫైట్స్ సీన్స్ కూడా ఒరిజినల్‌గా చేశారు చిరంజీవి.
తమ సినిమాలోని చిరంజీవి పెర్‌ఫార్మెన్స్ చూసిన దర్శకుడు తాతినేని ప్రసాద్ మరోసారి తన మనసులోని మాటను తెలిపారు. తప్పకుండా మీరు హీరోగా టాప్ పొజిషన్‌కి వెళ్తారు అని చెప్పారు. అంతేకాదు, చిరంజీవి కోసం ఓ బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు ప్రసాద్. అదేమిటంటే.. చిరంజీవికి ఒక ఏడాదికి రూ.18 లక్షలు రెమ్యునరేషన్. ప్రసాద్ డైరెక్షన్‌లోనే సంవత్సరానికి నాలుగు సినిమాలు చెయ్యాల్సి ఉంటుంది. ఇది విన్న చిరంజీవి ఎంతో ఎక్సైట్ అయిపోయి తప్పకుండా అలాగే చేద్దాం అన్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన ఎగ్రిమెంట్ చేసుకోవాలని ప్రసాద్ చెప్పారు. ఈ ఆఫర్ గురించి తన బంధు మిత్రులతో చర్చించారు చిరంజీవి. కానీ, వారు దీనికి ఒప్పుకోలేదు. అలా అగ్రిమెంట్ చేసుకోవడం కరెక్ట్ కాదని వారు చెప్పడంతో అదే విషయాన్ని ప్రసాద్‌కి చెప్పారు చిరంజీవి. ఇందులో బలవంతం ఏమీ లేదని, మీకు ఇష్టమైతేనే చేద్దాం అన్నారు ప్రసాద్. ఆ తర్వాత ఇద్దరూ దాని గురించి మర్చిపోయారు. వీరిద్దరి కాంబినేషన్‌లో తర్వాత వచ్చిన సినిమా రాణీకాసుల రంగమ్మ. ఈ సినిమాలో చిరంజీవి నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేశారు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత నాగు చిత్రం వచ్చింది. 1984లో ఈ సినిమా రిలీజ్ అయింది. దీని తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా రాలేదు.