English | Telugu
శ్రీదేవి చెల్లెలు శ్రీలత గురించి మీకు తెలీని నిజాలు!
Updated : Aug 5, 2021
అతిలోకసుందరి శ్రీదేవికి ఒక చెల్లెలు ఉందనీ, ఆమె పేరు శ్రీలత అనీ ఇప్పటి తరంలో చాలామందికి తెలీదు. సినీ నటి మహేశ్వరిని శ్రీదేవి సొంత చెల్లెలుగా చాలామంది పొరపడుతుంటారు. మహేశ్వరి.. శ్రీదేవికి కజిన్. బోనీ కపూర్‌ను పెళ్లాడి ముంబైలో సెటిల్ కావడానికి ముందు చెన్నైలో ఉన్నంత కాలం శ్రీలత అంటే శ్రీదేవికి పంచప్రాణాలు. తన ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్ తన చెల్లెలేనని పలు సందర్భాల్లో శ్రీదేవి చెప్పేవారు. రోజూ కనీసం పదిసార్లన్నా ఆ ఇద్దరూ దెబ్బలాడుకుని, అంతలోనే కలిసిపోయేవారు. ఇద్దరూ భిన్న ధ్రువాల వంటివారు.
ఏదైనా సినిమాలో శ్రీదేవి మోడ్రన్ డ్రస్ వేసుకుంటే, తనకూ సరిగ్గా అలాంటి బట్టలే కావాలని వాళ్లమ్మ రాజేశ్వరి దగ్గర ఏడుస్తూ మారాం చేసేది శ్రీలత. దాంతో అలాంటి బట్టలు నేను వేసుకుంటేనే బాగుంటాయి, నువ్వు వేసుకుంటే బాగుండవని చెల్లెల్ని మరింత ఏడిపించేవారు శ్రీదేవి. అలా అన్న వెంటనే ఇద్దరి మధ్యా పెద్ద దెబ్బలాట మొదలయ్యేది.
శ్రీదేవి నటించిన సినిమా ప్రొజెక్షన్ వేస్తే అక్కచెల్లెళ్లిద్దరూ వెళ్లేవారు. ఏదైనా ఎమోషనల్ సీన్‌లో శ్రీదేవి ఏడుస్తూ నటిస్తుంటే, ఆమె పక్కన కూర్చొని "ఎందుకు తల్లీ అలా ఏడుస్తున్నావ్?" అంటూ టీజ్ చేసేది శ్రీలత. వెంటనే శ్రీదేవికి కోపం వచ్చేసేది. మళ్లీ ఇద్దరి మధ్యా పోట్లాట మొదలు. ఏమైనా ఐదు నిమిషాల కంటే ఎక్కువసేపు పోట్లాడుకొనేవాళ్లు కాదు. ఎందుకంటే మరోసారి పోట్లాడుకోడానికి చాన్స్ ఉండాలి కదా!
ప్రతిరోజూ షూటింగ్ అయిపోయాక, రాత్రి ఎన్ని గంటలకు ఇంటికి వచ్చినా, కాస్సేపు శ్రీలతతో మాట్లాడందే శ్రీదేవికి నిద్రపట్టేది కాదు. ఇద్దరూ వీడియోలో రోజుకు రెండు సినిమాలు చూసేవారు. శ్రీలతకు నవలలంటే చాలా ఇష్టం. తను చదివిన ప్రతి నవల గురించి అక్కతో చర్చించేది శ్రీలత. అయితే అక్కతో కలిసి షూటింగ్‌కు వెళ్లడం అంటే ఆమెకు ఇష్టం ఉండేది కాదు. శ్రీదేవే బలవంతంగా చెల్లెల్ని తీసుకువెళ్లేవారు.
శ్రీదేవి అమ్మకూచి అయితే, శ్రీలత నాన్నకూచి. చిన్నప్పుడు ఆ ఇద్దరూ ఒక తెలుగు సినిమాలో అక్కాచెల్లెళ్లుగా నటించారు. ఒకసారి షూటింగ్ జరుగుతున్నప్పుడు తన కుక్కపిల్లను షూటింగ్ లొకేషన్‌కు తెస్తేకానీ నటించనని మొండికేసింది శ్రీలత. అలా మారాం చేయకూడదని శ్రీదేవి, వాళ్లమ్మ ఎంత చెప్పి చూసినా ఫలితం లేకపోయింది. ఇక లాభం లేదనుకొని కారు పంపించి, ఇంట్లో ఉన్న కుక్కపిల్లను తెప్పించాకే, షూటింగ్ జరిగింది. శ్రీలత అంత మొండిఘటం! తను ఏది కోరితే అది జరగాల్సిందే!!
ఆ సినిమాలో శ్రీలతను ఒకామె కొట్టే సీన్ ఉంది. ఆ షాట్‌లో శ్రీదేవి కూడా ఉన్నారు. శ్రీలతను కొట్టబోయే ఆమె ఒక కొత్త నటి. రిహార్సల్‌లో ఆమె సరిగా కొట్టలేదు. దాంతో డైరెక్టర్, "ఏవమ్మా, నీకు కొట్టడం కూడా రాదా!" అని కేకలేశాడు. టేక్ తీసేటప్పుడు ఆవిడ శ్రీలతను లాగి కొట్టింది. ఆ దెబ్బకు తట్టుకోలేక శ్రీలత వెక్కి వెక్కి ఏడ్చేసింది. అది చూడగానే శ్రీదేవి కళ్లల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. సీన్ ప్రకారం ఆమె ఏడవకూడదు. దాంతో ఆ సీన్‌ను మళ్లీ తీయాల్సి వచ్చింది.
శ్రీదేవి నైలెక్స్ చీరలు ఎక్కువగా ధరించేవారు. శ్రీలతకు కాటన్, ఆర్గండీ చీరలంటే ఇష్టం. వాళ్లిద్దరికీ ఎలాంటి బట్టలు కొన్నా, ఇద్దరికీ ఒకే రంగు బట్టల్నే కొనేవారు వాళ్లమ్మ. ఈ విషయంలో ఆమె చాలా స్ట్రిక్టుగా ఉండేవారు. శ్రీదేవి ఔట్‌డోర్ షూటింగ్‌లకు వెళ్లి, ఇంటికి వచ్చినప్పుడు చెల్లెలికి తప్పకుండా ఏదైనా కొని తీసుకువచ్చేవారు. ఒకవేళ ఆమె మర్చిపోయి వచ్చారంటే, శ్రీలత గొడవపెట్టేసేది. ఆ ఇద్దరూ షేర్ చేసుకొనే ఒకే ఒక్క వస్తువు.. మంచం! అవును. ఇద్దరూ ఒకే మంచం మీద పడుకొనేవారు. బోలెడు కబుర్లు చెప్పుకొని కానీ నిద్రపోయేవారు కాదు.
తర్వాత కాలంలో సంజయ్ రామస్వామి అనే వ్యక్తిని శ్రీలత పెళ్లి చేసుకుంది. ఎంతో అన్యోన్యంగా ఉండే అక్కాచెల్లెళ్ల మధ్య ఆస్తి గొడవలు తలెత్తాయి. దాంతో ఇద్దరూ చాలా కాలం మాట్లాడుకోలేదు. దాదాపు దశాబ్ద కాలం పాటు ఆ ఇద్దరికీ సరిగా మాటలు లేవని చెప్పుకొనేవారు. బోనీ కపూర్ చొరవతో అక్కచెల్లెళ్లు తిరిగి ఒకటయ్యారు.
అక్క శ్రీదేవి దుబాయ్‌లో ప్రమాదవశాత్తూ బాత్‌టబ్‌లో మృతిచెందిన టైమ్‌లో శ్రీలత కూడా అక్కడే ఉంది. అప్పట్లో శ్రీదేవి మృతిపై ఆమె కొన్ని నిజాలు వెల్లడిస్తుందంటూ ప్రచారంలోకి వచ్చింది కానీ, ఆ విషయంలో శ్రీలత మౌనంగానే ఉండిపోయింది.