English | Telugu

కెరీర్ మొత్త‌మ్మీద చంద్ర‌మోహ‌న్‌లోని న‌టుడ్ని ఛాలెంజ్ చేసిన సీన్‌ అదొక్క‌టే!

 

దాదాపు 600 సినిమాల్లో న‌టించిన చంద్ర‌మోహ‌న్ వాటిలో ఎన్నో మంచి పాత్ర‌లు చేశారు, ఆ పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చెర‌గ‌ని స్థానం పొందారు. అయితే ఇన్ని సినిమాల్లో ఆయ‌న బాగా క‌ష్ట‌ప‌డి, ఫ‌లితాల గురించి భ‌య‌ప‌డి చేసిన ఒక స‌న్నివేశం, బాగా ఇన్‌వాల్వ్ అయి చేసిన స‌న్నివేశం 'సిరిసిరిమువ్వ' సినిమాలో "రా దిగిరా దివినుంచి భువికి దిగిరా" పాట స‌న్నివేశం కావ‌డం గ‌మ‌నార్హం. ప్రేక్ష‌కులంద‌రికీ ఆ స‌న్నివేశం ఎంత‌టి అనుభూతిని ఇచ్చిందో, ఎంత‌గా క‌దిలించిందో చెప్పాల్సిన ప‌నిలేదు. ఆ సినిమాని రూపొందించింది లెజెండ‌రీ డైరెక్ట‌ర్ కె. విశ్వ‌నాథ్‌.

చంద్ర‌మోహ‌న్‌కు ఆ స‌న్నివేశాన్ని వ‌ర్ణిస్తూ ఆయ‌న‌, "ఈ పాట అద్భుతంగా కుదిరిందిరా. వేటూరి క‌ష్ట‌ప‌డి రాశారు. బాలు హృదయంతో పాడాడు. మ‌హ‌దేవ‌న్ గారు అద్భుతంగా స్వ‌ర‌క‌ల్ప‌న చేశారు. ఆ స‌న్నివేశం - హీరోలో నిస్స‌హాయ‌త‌, క‌చ్చ‌, త‌ను ఆరాధించే అమ్మాయిని బ‌లిప‌శువుగా దేవుడి ముందు అన్యాయం చేస్తుంటే, త‌న‌ని అర్థం చేసుకునేవారు ఒక్క‌రైనా లేరే అన్న బాధంతో ఎదురుగా దేవుడితో మొర‌పెట్టుకుంటూ, ఈ ఘోర‌కృత్యాన్ని నీవైనా ఆప‌లేవా? అని దేవుడ్ని ఛాలెంజ్‌గా అడ‌గటం." అని చెప్పారు.

"నువ్వేం చెయ్యాలో నేను చెప్ప‌ను కానీ నాకేం ఎక్స్‌ప్రెష‌న్ కావాలో, ఎమోష‌న్ కావాలో చెబుతా. అందుక్కావాల్సిన ఎఫెక్టు నువ్వివ్వాలి. ఈ స‌న్నివేశం చూసిన‌వాళ్ల‌కు హృద‌యం పుల‌కించాలి. ఈ స‌మ‌స్య నీ స‌మ‌స్య‌గా నువ్వు ఫీల్ అవ్వాలి. పూర్తిగా పాత్ర‌లో అంత‌ర్లీన‌మై పోవాలి. అప్పుడే ఈ స‌న్నివేశం పండుతుంది. అప్పుడు ప్రేక్ష‌కులు కూడా ఈ స‌న్నివేశానికి తాదాత్మ్యం చెందుతారు." అని విశ్వ‌నాథ్ వివ‌రించిన‌ప్పుడు, చంద్ర‌మోహ‌న్‌లో ఎక్క‌డో ఉన్న ఆర్టిస్టును రెచ్చ‌గొట్టిన‌ట్లు అయ్యింది.

విశ్వ‌నాథ్ ఇచ్చిన ప్రోత్సాహానికి, స్థ్యైర్యానికి చంద్ర‌మోహ‌న్ ఎంతో క‌ష్ట‌ప‌డి, ఆ సీనును ర‌క్తి క‌ట్టించ‌డానికి ఏం చేశారో, ఎలా చేశారో ఆయ‌న‌కే తెలీకుండా చేసేశారు. ఆ సినిమా వ‌చ్చి ద‌శాబ్దాలు గ‌డిచిపోయినా, ఇప్ప‌టికీ ఆ స‌న్నివేశాన్ని, అందులో ఆయ‌న ప్ర‌ద‌ర్శించిన అభిన‌యాన్ని జ‌నం మెచ్చుకుంటూనే ఉన్నారు. 'సిరిసిరిమువ్వ' త‌ర్వాత ఎన్నో సినిమాల్లో ఎన్నో పాట‌లు, ఎన్నో స‌న్నివేశాలు చేసినా, ఆ సినిమా ఇచ్చిన తృప్తి ఆయ‌న‌కు మ‌ళ్లీ రాలేదు. ఈ విష‌యాల‌ను ఓ సంద‌ర్భంగా ఆయ‌న పంచుకున్నారు.