Read more!

English | Telugu

లెజెండ‌రీ క‌మెడియ‌న్ రాజ‌బాబు గురించి చాలామందికి తెలీని నిజాలు

 

పుణ్య‌మూర్తుల ఉమామ‌హేశ్వ‌ర‌రావు, ర‌మ‌ణ‌మ్మ దంప‌తుల‌కు 1937 అక్టోబ‌ర్ 20న పుట్టిన రాజ‌బాబు అస‌లుపేరు అప్ప‌ల‌రాజు. పుట్టిన ఊరు రాజ‌మండ్రిలో ఇంట‌ర్మీడియేట్ చ‌దివాక‌, టీచ‌ర్ ట్రైనింగ్ పూర్తిచేసి, బ‌డిపంతులుగా కొంత కాలం ప‌నిచేశారు. అదే కాలంలో 'నాలుగిళ్ల చావిడి', 'అల్లూరి సీతారామ‌రాజు', 'కుక్క‌పిల్ల దొరికింది' లాంటి నాట‌కాల్లో న‌టిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. సినీ న‌టుడు కావాల‌నే త‌ప‌న‌తో ఉద్యోగానికి రాజీనామా చేసి, 1960లో మ‌ద్రాస్ వెళ్లారు రాజ‌బాబు. 

ఒక‌వైపు అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నిస్తూ, బ‌త‌క‌డం కోసం ట్యూష‌న్లు చెప్పారు. అడ్డాల నారాయ‌ణ‌రావు నిర్మించిన 'స‌మాజం' (1960)లో ఓ చిన్న పాత్ర దారా న‌టునిగా వెండితెర‌పై కాలుపెట్టారు. మొద‌ట్లో కెరీర్ ప‌రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. త‌ర్వాత త‌న‌దైన శైలి కామెడీతో ప్రేక్ష‌కుల‌ను న‌వ్విస్తూ, తిరుగులేని క‌మెడియ‌న్‌గా రాణించారు. నిల్చున్న చోట కానీ, కూర్చున్న చోట కానీ కుదురుగా ఉండ‌కుండా, మెలిక‌లు తిరిగే బాడీ లాంగ్వేజ్‌తో, డిఫ‌రెంట్ డిక్ష‌న్‌తో ఆయ‌న చెప్పే డైలాగ్స్‌కు జ‌నం ప‌డీ ప‌డీ న‌వ్వేవారు.

లీలా రాణి, గీతాంజ‌లి లాంటి తార‌లు ఆయ‌న స‌ర‌స‌న న‌టించిన‌ప్ప‌టికీ, ర‌మాప్ర‌భ‌తో ఆయ‌న కాంబినేష‌న్ సూప‌ర్ డూప‌ర్ హిట్ట‌యింది. తెర‌పై రాజ‌బాబు క‌నిపిస్తేనే న‌వ్వులు పండేది, ఇక ర‌మాప్ర‌భ కూడా ఆయ‌న‌కు తోడైతే.. ఆ గిలిగింత‌ల రేంజే వేరు.. అన్న‌ట్లు వుండేది వారి జంట‌. ఏ సినిమాలైనా ఆ ఇద్ద‌రూ జంట‌గా ఉన్నారంటే త‌ప్ప‌కుండా వారిపై ఓ హాస్య గీతం ఉండాల్సిందే. అనేక చిత్రాల‌కు ఆ జంట ఎస్సెట్ అయ్యింద‌నేది కాద‌న‌లేని నిజం.

ఇక రెమ్యూన‌రేష‌న్ ప‌రంగా రాజ‌బాబు మిగ‌తా కామెడీ యాక్ట‌ర్ల కంటే ఓ మెట్టు పైనే ఉండేవారు. అప్ప‌టి టాప్ స్టార్స్‌కు ధీటుగా ఆయ‌న‌కు పారితోషికం ఇచ్చేవాళ్లు నిర్మాత‌లు. పెద్ద సినిమాల‌కు అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌గా, చిన్న సినిమాల‌కు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా ఆయ‌న నిలిచేవారు. సినిమాలో రాజ‌బాబు లేర‌ని తెలిస్తే, డిస్ట్రిబ్యూట‌ర్లు పెదవి విరిచిన సంద‌ర్భాలెన్నో. వారి డిమాండ్ కార‌ణంగా క‌థ‌కు సంబంధం లేక‌పోయినా స‌ప‌రేట్ ట్రాక్ తీసి రిలీజ్ చేసిన సినిమాలు కూడా కొన్ని ఉన్నాయంటే ఆయ‌న హ‌వా ఎలా న‌డిచిందో ఊహించుకోవ‌చ్చు.

ఓ వైపు క‌మెడియ‌న్‌గా న‌టిస్తూనే, కొన్ని సినిమాల్లో హీరోగానూ న‌టించారు రాజ‌బాబు. వాటిలో దాస‌రి నారాయ‌ణ‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన తొలి చిత్రం 'తాత మ‌న‌వ‌డు' ప్ర‌ముఖ‌మైంది. ఎస్వీ రంగారావు తాత‌గా న‌టిస్తే, ఆయ‌న మ‌న‌వ‌డిగా న‌టించి, ప్రేక్ష‌కుల్ని అల‌రించారు. సిల్వ‌ర్ జూబ్లీ జ‌రుపుకున్న‌ ఆ సినిమాలో రాజ‌బాబు స‌ర‌స‌న విజ‌య‌నిర్మ‌ల హీరోయిన్ కావ‌డం ఇంకో విశేషం. ఆ త‌ర్వాత పిచ్చోడి పెళ్లి, తిర‌ప‌తి, ఎవ‌రికి వారే య‌మునా తీరే, మ‌నిషి రోడ్డున ప‌డ్డాడు లాంటి చిత్రాల్లో ఆయ‌న హీరోగా న‌టించారు. 'మ‌నిషి రోడ్డున ప‌డ్డాడు' చిత్రాన్ని నిర్మించిన ఆయ‌న ఆర్థికంగా తీవ్రంగా న‌ష్ట‌పోయి నిజంగానే రోడ్డున ప‌డ్డాడంటారు.

ల‌క్ష్మీ అమ్ములుతో 1965లో ఆయ‌న వివాహం జ‌రిగింది. ఆ దంప‌తుల‌కు ఇద్ద‌రు కుమారులు.. నాగేంద్ర‌బాబు, మ‌హేశ్‌బాబు. న‌టుడిగా ఎంత‌టి ఉన్న‌త స్థాయిని చూశాడో, వ్య‌క్తిగా అంత‌కంటే ఉన్న‌తుడిగా పేరు తెచ్చుకున్నారు రాజ‌బాబు. అనేక‌మంది ఆయ‌న ఆర్థిక సాయం చేశారు. త‌ను జీవించి ఉండ‌గా ప్ర‌తి పుట్టిన‌రోజుకు ఒక సీనియ‌ర్ యాక్ట‌ర్‌ను ఆయ‌న స‌న్మానిస్తూ వ‌చ్చారు. సావిత్రి, రేలంగి, బాల‌కృష్ణ (అంజి), ర‌మ‌ణారెడ్డి లాంటి న‌టులు వారిలో ఉన్నారు. 

రాజ‌బాబుకు అకాల మ‌ర‌ణం పొంద‌డానికి కార‌ణం, ఆయ‌న‌కున్న తాగుడు వ్య‌స‌నం. దాని వ‌ల్ల చివ‌రి రోజుల్లో ఆయ‌నకు అవ‌కాశాలు త‌గ్గిపోయాయి. ఆర్థికంగా క‌ష్టాల్లో ఉన్న అనేక‌మందిని ఆదుకున్న మంచి మ‌నిషి రాజ‌బాబు 1983 ఫిబ్ర‌వ‌రి 7న హైద‌రాబాద్‌లో గుండెపోటుతో క‌న్నుమూసి, అభిమానుల‌ను తీవ్ర విషాదంలో ముంచేశారు. రెండు ద‌శాబ్దాల పాటు తెలుగు సినిమాపై త‌న జెండాను రెప‌రెప‌లాడించి 580కి పైగా చిత్రాల్లో న‌టించిన‌ రాజబాబు తన ఊరికి, చలన చిత్ర రంగానికి చేసిన మరపురాని సేవలకు చిహ్నంగా 9 అడుగుల కాంస్య విగ్ర‌హాన్ని రాజ‌మండ్రిలో గోదావరి తీరాన ప్రతిష్టించి ఆయ‌న‌పై త‌న అభిమానాన్ని, గౌర‌వాన్ని తెలియ‌జేసింది తెలుగు చిత్ర‌సీమ‌.